– చెలరేగిన సూర్య, విజృంభించిన బుమ్రా
– అఫ్గనిస్థాన్‌పై భారత్ ఘన విజయం
– ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్
– భారత్ 181/8, అఫ్గనిస్థాన్ 134/10
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్8 రేసును టీమ్ ఇండియా విజయంతో ఆరంభించింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (53) అర్థ సెంచరీతో చెలరేగగా.. ధనాధన్ హిట్టర్లు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య మెరవటంతో తొలుత భారత్ 181 పరుగులు చేసింది. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా (3/7) నిప్పులు చెరగటంతో ఛేదనలో అఫ్గాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్
అఫ్గనిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. సూపర్8 పోరులో సూపర్ షోతో ఓ విజయం ఖాతాలో వేసుకుంది. 182 పరుగుల ఛేదనలో అఫ్గనిస్థాన్ చేతులెత్తేసింది. జశ్‌ప్రీత్ బుమ్రా (3/7) నిప్పులు చెరుగగా.. అర్ష్‌దీప్ సింగ్ (2/35), కుల్దీప్ యాదవ్ (2/32) మ్యాజిక్ చేశారు. 20 ఓవర్లలో అఫ్గాన్ 134 పరుగులకు కుప్పకూలింది. ఆ జట్టులో అజ్మతుల్లా ఓమర్‌జారు (26), నజీబుల్లా జద్రాన్ (19), గుల్బాదిన్ నయిబ్ (17) మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. తొలుత, పొట్టి ఫార్మాట్ సూపర్‌స్టార్ సూర్యకుమార్ యాదవ్ (53, 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సహజశైలికి కాస్త భిన్నంగా ఆడినా అర్థ సెంచరీతో టీమ్ ఇండియాను ఆదుకున్నాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (32, 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహా రిషబ్ పంత్ (20, 11 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. సూర్యకుమార్ యాదవ్‌కు తోడు హార్దిక్, పంత్‌లు మెరవటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది.
ఆ ఇద్దరు విఫలం : సూపర్8 మ్యాచ్‌లో టాస్ నెగ్గిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు కాస్త కష్టంగా సాగిన పిచ్‌పై భారత ఓపెనర్లు, సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (24) విఫలమయ్యారు. పవర్‌ప్లేలోనే కెప్టెన్ రోహిత్ శర్మ నిష్క్రమించగా.. జట్టుకు అతడి అవసరం ఎక్కువగా ఉన్న తరుణంలో విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. అఫ్గాన్ పేసర్ ఫరూకీ మరోసారి బ్రేక్ అందించాడు. పవర్‌ప్లేలో వికెట్‌తో అఫ్గాన్‌కు పైచేయి అందించాడు. పవర్‌ప్లేలో ఓ వికెట్ కోల్పోయిన భారత్ 47 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (20, 11 బంతుల్లో 4 ఫోర్లు) పవర్‌ప్లేలో భారత్ గౌరవప్రద స్కోరు అందుకుంది. విలక్షణ షాట్లతో మెరిసిన రిషబ్ పంత్ యుఎస్‌ఏ లెగ్ ఫామ్ కొనసాగించాడు. కానీ పవర్‌ప్లే అనంతరం రషీద్‌ఖాన్‌పై స్విచ్ షాట్ ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ కోహ్లి సైతం రషీద్ ఖాన్ ఓవర్లోనే వికెట్ పారేసుకున్నాడు. దీంతో 62/3తో భారత్ కష్టాల్లో పడింది.
ఆదుకున్న సూర్యకుమార్ : లేటుగా ఫామ్ అందుకున్న సూర్యకుమార్ (53) అఫ్గనిస్థాన్‌పై ఆపద్బాందవుడి ఇన్నింగ్స్ నమోదు చేశాడు. ఓ ఎండ్‌లో సహచర బ్యాటర్లు తడబాటుకు గురవుతున్న వేళ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో పరుగులు పిండుకున్నాడు. ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. యువ బ్యాటర్ శివం దూబె (10) దూకుడు చూపించినా వికెట్ నిలుపుకోలేదు. ఓ ఎండ్‌లో సూర్యకుమార్ దంచికొట్టగా.. మరోఎండ్ నుంచి వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య (32) మెప్పించాడు. విలువైన ఇన్నింగ్స్‌తో జట్టుకు మంచి స్కోరు అందించటంలో ముఖ్య భూమిక పోషించాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (7) ఆశించిన ప్రదర్శన చేయలేదు. అక్షర్ పటేల్ (12, 6 బంతుల్లో 2 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్‌హాక్ ఫరూకీ, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లతో విజృంభించారు.