సూట్‌కేసులో కరెన్సీ కట్టలు..

సూట్‌కేసులో కరెన్సీ కట్టలు..– రూ. నాలుగు కోట్ల నగదుతో పట్టుబడిన బీజేపీ కార్యకర్త
– తమిళనాడులోని చెన్నై తాంబరం రైల్వే స్టేషన్‌లో పట్టుకున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌
చెన్నై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమిళనాడులో నగదు ప్రవాహానికి దారులు తెరుస్తున్నది. తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్‌లో బీజేపీ కార్యకర్త సహా ముగ్గురు వ్యక్తులు రూ.4 కోట్ల నగదుతో పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి విచారణ నిమిత్తం ఆదాయపు పన్ను(ఐటీ) శాఖకు పంపినట్టు చెంగల్‌పట్టు జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో) తెలిపారు. నిందితులు  బీజేపీ సభ్యుడు, ప్రయివేట్‌ హౌటల్‌ మేనేజర్‌ సతీష్‌, అతని సోదరుడు నవీన్‌, ఒక డ్రైవర్‌ పెరుమాళ్‌ ఆరు బ్యాగుల్లో 4 కోట్ల రూపాయలను తీసుకువెళుతున్నారు. ఈ ముగ్గురూ రైలులో తిరునల్వేలికి వెళ్లాల్సి ఉండగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వారిని అదుపులోకి తీసుకున్నది. తిరునెల్వేలి బీజేపీ ఎంపీ అభ్యర్థి నైనార్‌ నాగెంతిరన్‌ బృందం సూచనల మేరకు సతీష్‌ పనిచేసినట్టు ప్రాథమికంగా అంగీకరించారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. 39 లోక్‌సభ స్థానాలున్న తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనున్నది. దీనికి కొన్ని రోజుల ముందే ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.
తమిళనాడులో ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇక్కడ కొన్ని పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసింది. ప్రధాని కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి సమయం దొరికినప్పుడల్లా తమిళనాడులో సభలు, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఒక తమిళ వార్త ఛానెల్‌కు ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఇందులో ఆయన తమిళ సాంప్రదాయ వస్త్రధారణ అయిన లుంగీ కట్టుకొని మరీ వచ్చారు. అయితే, ఇక్కడ ఓటు షేర్‌ను పెంచుకొని ఒకట్రెండు సీట్లయినా దక్కించుకోవాలని కాషాయపార్టీ తపనపడుతున్నది. ఇందుకోసమే, నగదు ప్రవాహం వంటి అడ్డదారులకైనా ఆ పార్టీ వెనకాడటం లేదనీ, బీజేపీ కార్యకర్త నగదుతో పట్టుబడటమే దీనికి తార్కాణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.