ఇవ్వాళ్ళ మనం పరిచయం చేసుకుంటున్న ఈ బాల సాహితీవేత్త కూడా సిద్ధిపేటకు చెందినవారే! గతంలో చెప్పుకున్న బాల సాహితీవేత్తల్లో సిద్ధిపేటకు చెందినవాళ్ళు అనేకమంది ఉన్నారు. ఒక రకంగా చూస్తే రాశిలోనూ… వాసిలోనూ సిద్ధిపేట బాల సాహితీవేత్తలది తెలంగాణ బాల సాహిత్య చరిత్రలో నిక్కచ్చిగా ఎన్నికగన్న స్థానమే! ఈ కోవకు చెందినవారే డా. బి. సుధాకర్ గా పరిచితులైన ‘బురాన్‌శెట్టి సుధాకర్’. వృత్తిరీత్యా హిందీ ఉపాధ్యాయుడు, కవి, రచయిత, బాల సాహితీవేత్త, అనేక లఘు ప్రక్రియలను చేపట్టిన సుసంపన్నులు. సిద్ధిపేటలో నవంబర్ 25, 1965న డా.బి. సుధాకర్ జన్మించారు. శ్రీమతి బురాన్‌శెట్టి మనోహర- శ్రీ లక్ష్మయ్యలు తల్లితండ్రులు.
వృత్తిరీత్యా హిందీ భాషోపాధ్యాయులు అయిన సుధాకర్ ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, హిందీ తెలుగు అనువాదకులు. కవిత్వం, గేయం, పాట, పద్యం, సమీక్ష, కథలు, బాల గీతంతో పాటు ఇతర లఘు ప్రక్రియల్లో ప్రతిభను కనబరుస్తున్నారు. మాతృభాష తెలుగుతో బాటు తన వృత్తి భాష లేదా బడిలో తాను బోధిస్తున్న హిందీలోనూ రచనలు అనువాదాలు చేస్తున్నారు ఈయన. కవిగా తన తొలి సంపుటి మాతృభాష తెలుగులో అచ్చువేశారు. ‘వేకువ పుష్పము’ పేరుతో వచ్చిందీ రచన. యాత్రా వృత్తాంతాన్ని తన రెండవ రచనగా ‘నేపాల్ యాత్ర’ పేరుతో అచ్చువేశారు. హిందీలోనూ మౌలిక రచనలతో పాటు అనువాదాలు కూడా చేశారు డా. సుధాకర్. వాటిలో సిద్ధిపేట వాస్తవ్యులు కథాశిల్పి ఐతా చంద్రయ్య బాలల కథలను ‘కిస్సా కుర్సీకా’ పేరుతో హిందీలోకి అనువాదం చేసి ‘అటు మాతృభాషలోనూ, ఇటు రాష్ట్రభాషలోనూ మేటి బురాన్ శెట్టి’ అనిపించుకున్నారు. లఘు రూపాలైన మణిపూసలు, పంచపదుల వంటివి తెలుగు, హిందీల్లో కూర్చిన సుధాకర్ అనేక అంతర్జాల సమూహాల్లో సభ్యులు. నిరంతరం రచనలు చేసే కవి, రచయిత. ఆటవెలది, తేటగీతులను అందంగా రాసే ఈ హిందీ పంతులు హిందీలోనూ గేయాలను, ఇతర ప్రక్రియలను చేపట్టి సుసంపన్నం చేస్తున్నారు. రాష్ట్ర భాష బోధనతో బాటు భాషా ప్రచారంలోనూ ముందువరుసలో నిలిచిన ఈయన జిల్లా స్థాయిలో ఉత్తమ హిందీ ప్రచారకులుగా పురస్కారం అందుకున్నారు. సిద్ధిపేటజిల్లా ఉత్తమ ఉపాధ్యాయ సత్కారం పొందారు. లఘు ప్రక్రియలను ఉద్యమ స్థాయిలో చేపట్టి రాసినందుకు కవన కిరీటి, కవి విభూషణ, కవిచక్ర వంటి గుర్తింపులను పొందారు. బాల సాహిత్య రచనతో పాటు బాలల వికాసం కోసం నిరంతరం ముందువరుసలో నిలుస్తున్నారు డా.సుధాకర్. ‘తెలంగాణ కవి సినారె/ సినిమా పాటతో భళారె/ జ్ఞానపీఠ మందుకొని/ జగతిన వెలిగే సితారే’ అంటూ ఒక లఘు ప్రక్రియలో విశేషంగా చెబుతాడీయన.
అన్ని రూపాలు, ప్రక్రియల్లో ముందువరుసలో నిలిచిన సుధాకర్ పిల్లల కోసం నూరుకు పైగా కథలు రాశారు. అంతకు ఎక్కువ సంఖ్యలో బాల గేయాలు, వందలాది ఆటవెలదులు, తేటగీతులను కూర్చారు. బాల సాహితీవేత్తగా అచ్చులోకి వచ్చిన సుధాకర్ తొలి రచన ‘చిచ్చర పిడుగులు’ బాల గేయ సంపుటి. ‘బాల్యం బంగారు కాలం/ స్వేచ్ఛగా ఎగిరే విహంగం/ ఏమి రాయని తెల్లని కాగితం’గా భావించి వారి కోసం రచనలు చేశారీ బాలల కవి. ‘తిరంగా ఝండా’ గురించి రాస్తూ ‘మూడు రంగుల ఝండా/ భారతీయలకిది అండా/ ఉందీ మనసు నిండా/ విశ్వవిజేత భారత ఝండా’ అంటారు. వ్యంగ్యం, సరదా గీతాలు కూడా వీరి బాలగేయాల్లో చూడవచ్చు. అటువంటిదే ‘గూగుల్ గురువు’ గీతం. ఇందులో ‘గూగులే గురువైంది’ అంటూ ‘చేతిలోన వెలసిన గూగుల్/ నవతకానికిపుడు దేవుడు’ అంటూ బడి గురువు గూగుల్ మాత గురించి చెప్పడం బాగుంది. ‘తెలుగు భాష తీయదనం/ విశ్వమంత ప్రేమమయం/ అక్షరాల విన్యాసం/ అద్భుతాల పద ప్రవాహం’ అంటూ హిందీ పంతులు మాతృభాషను కీర్తించడం బాగుంది. ‘వానకు రక్షణ గొడుగు’, ‘నల్లని చల్లని మేఘం/ మార్చెను ఎండా కాలం’, ‘చేతులోన సెల్లుఫోనే లేకుండా ఉండలేను’, ‘ఇంటి ముందు తులసిచెట్టు/ అది మనకు ఆయువుపట్టు’ వంటి గేయ పాదాలు చక్కని లయతో సాగడమే కాక అనేక అంశాలను పిల్లలకు అందించే ప్రయత్నం చేశాయి. ‘చిర్రగోనె ఆట/ చిందులేసి ఆడేటి ఆట/.. పిల్లలంత పోగై/ అల్లరితో ఆడేటి ఆట’ అంటూ బాల్యపు బంగారు జ్ఞాపకాలను బాల గేయాత్మకం చేశారు. అదే కోవలో ‘పల్లెలోన ఎడ్లబండి/ పరుగుతీస్తు సాగునండి/ చక్రాల మా బడి/ చకచకా ఉరుకునండి/ అమ్మనాన్న తాత అవ్వ/ అందరమూ వెళ్ళేది/ పరుగు తీయు ఎడ్ల బండి/ ఆగకుండ ఉరుకు బండి’ అంటూ బాలలకు చక్రాన్ని పరిచయం చేశారు. పల్లెల్లోంచి, చిన్న టౌన్‌ల లోంచి వచ్చిన అందరికి చక్రం అంటే ‘పయ్య’ ఆట పరిచయమే కదా! తన బాల గేయాల్లో దానిని కూడా పరిచయం చేస్తూ, ‘గిరగిర తిప్పుగు పయ్యా/ టపటప కొట్టుచు పయ్య/ చకచక ముందుకు పయ్యా/ బిరబిరపోవును పయ్య/ అటకు పయ్యే తోడు’ అని రాశారు. ‘అమ్మ’ను గురించి కూడా చక్కని గేయం రాశారు ఇందులో. అనేక అంశాలు, విషయాల సమాహారమీ బాల గేయ సంపుటి. తాను హిందీ ఉపాధ్యాయుడు కదా, ‘సరళమైన హిందీ భాష/ జనం మెచ్చు దీని యాస’ అంటారు తన ఉద్యోగ భాష గురించి. ‘హిందీ పక్వాడ’ జరుగుతున్న ఈ సందర్భంలో తెలుగు-హిందీ భాషా సంగమంగా భాసిల్లుతున్న డా.బురంశెట్టి సుధాకర్‌ను అభినందిస్తూ… హిందీ పక్వాడా కా హార్దిక్ శుబ్‌కామ్నాయే… జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్, 9966229548