– స్కూల్ గ్రాంటు సరిపోక హెచ్‌ఎంల ఇబ్బందులు
– కమర్షియల్ నుంచి డొమెస్టిక్‌కు మార్చే అవకాశం
– ప్రభుత్వ సమాలోచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్‌లోని బోరబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1540 మంది విద్యార్థులు చదువుతున్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కరెంటు బిల్లు వస్తున్నది. అంటే నెలకు రూ.15 వేలు అయితే పది నెలలకు రూ.1,50,000, ఏడాదికి రూ.180,000 అవుతాయి. నెలకు రూ.20 వేలు అయితే పది నెలలకు రూ.2 లక్షలు, ఏడాదికి రూ.2,40 లక్షలు అవుతాయి. కానీ ఆ పాఠశాలకు గ్రాంటు కింద ఏడాదికి రూ.లక్ష మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. ప్రస్తుతం బోరబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కరెంటు బిల్లు బకాయిలు రూ.87,545 ఉన్నాయి.
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1,065 మంది విద్యార్థులున్నారు. కరెంటు బిల్లు నెలకు రూ.17 వేలు వస్తుంది. అంటే పది నెలలకు రూ.1.70 లక్షలు, ఏడాదికి రూ.2.04 లక్షలు వస్తుంది. ఆ పాఠశాలకూ గ్రాంటు కింద ఏడాదికి రూ.లక్ష మాత్రమే వస్తుంది. హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ మండలం శ్రీరామ్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 900 మంది విద్యార్థులున్నారు. నెలకు రూ.5 వేలు కరెంటు బిల్లు వస్తుంది. అంటే పది నెలలకు రూ.50 వేలు,
సర్కారు బడులపై విద్యుత్ బిల్లుల భారం!
ఏడాదికి రూ.60 వేలు అవుతాయి. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలాగే ఉన్నది. సర్కారు బడులపై విద్యుత్ బిల్లుల భారం తీవ్రంగా ఉన్నది. ఆ బిల్లులను చూసి ప్రధానోపాధ్యాయులు షాక్‌కు గురవుతున్నారు. వాటిని ఎలా కట్టాలో తెలియక బెంబేలెత్తుతున్నారు. అయితే విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం పాఠశాల గ్రాంటును ఇస్తున్నది. ఒకటి నుంచి 30 లోపు విద్యార్థులుంటే రూ.10 వేలు, 31 నుంచి వందమందిలోపు విద్యార్థులుంటే రూ.25 వేలు, 101 నుంచి 250 మందిలోపు విద్యార్థులుంటే రూ.50 వేలు, 251 నుంచి వెయ్యిలోపు విద్యార్థులుంటే రూ.75 వేలు, వెయ్యి ఆపైన విద్యార్థులుంటే రూ.లక్ష చెల్లిస్తున్నది. అవి ప్రతినెలా మంజూరు చేయడం లేదు. అయితే పాఠశాల గ్రాంటు కనీస అవసరాలకే సరిపోతున్నాయి. ఉదాహరణకు స్టేషనరీ ఖర్చులు, చాక్‌పీస్‌లు, జిరాక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాల బట్ట రవాణా ఖర్చులకు ఆ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. దీంతో కరెంటు బిల్లులు కట్టలేక ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే పాఠశాల గ్రాంటు కరెంటు బిల్లులకూ సరిపోవడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారం తగ్గించేందుకు సర్కారు సమాలోచన
‘పాఠశాలల విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతనెల 30న సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేశారు. అయితే ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. పాఠశాలలకు విద్యుత్ సరఫరా ప్రస్తుతం కమర్షియల్ కేటగిరీలో ఉన్నది. దాన్ని డొమెస్టిక్ (గృహవినియోగం) కేటగిరీ కిందికి మార్చే అవకాశమున్నది. దీంతో యూనిట్ ధర బాగ తగ్గనుంది. రాష్ట్రంలో గృహవినియోగదారులకు ప్రస్తుతం 50 యూనిట్లలోపు ఒక్కో యూనిట్ ధర రూ.1.95 ఉన్నది. 51 నుంచి 100 యూనిట్లలోపు ఒక్కో యూనిట్‌కు రూ.3.10 వసూలు చేస్తున్నారు. కమర్షియల్ కేటగిరీ కింద 50 యూనిట్లలోపు ఒక్కో యూనిట్ ధర రూ.7, వందలోపు యూనిట్లకు ఒక్కో యూనిట్‌కు రూ.8.50 ఉన్నది. దీన్ని గృహవినియోగం కేటగిరీలోకి మార్చాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. దానివల్ల ప్రభుత్వ పాఠశాలలపై విద్యుత్ భారం తగ్గుతుందని ఆలోచన చేస్తున్నారు. ఇంకోవైపు గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు వాడితే ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి రావడంతో అందరూ ఆ పథకం అమలు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకూ గృహజ్యోతి పథకాన్ని వర్తింపచేసి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను అమలు చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం : చావ రవి, ప్రధాన కార్యదర్శి టీఎస్‌యూటీఎఫ్
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలి. ఒకవేళ కమర్షియల్ కేటగిరీ నుంచి డొమెస్టిక్ కేటగిరీకి మార్చితే ఆ బిల్లులకు అవసరమైన బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించాలి. పాఠశాల నిర్వహణ గ్రాంటును కరెంటు బిల్లులకు వాడితే భారంగా ఉన్నది. పాఠశాలల నిర్వహణకే ఆ గ్రాంటు సరిపోతున్నది. సుదీర్ఘ కాలంగా ఉన్న పాఠశాలల కరెంటు బిల్లుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడాన్ని ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పాఠశాలలపై కరెంటు బిల్లుల భారం పెరుగుతున్నదీ, దాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని అడిగాం. అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వాలి. లేదంటే గృహవినియోగం కేటగిరీకి మార్చినా ఆ భారాన్ని ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులివ్వాలి. విద్యుత్ భారాన్ని తగ్గించాలి : ఎం వీరాచారి, అధ్యక్షులు, ఎల్‌సీటీజీఏ ప్రభుత్వ పాఠశాలలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలి. ఉచిత విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పాఠశాల గ్రాంటు నిర్వహణకే సరిపోతున్నది. విద్యుత్ బిల్లులు ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలి.