– మరో రెండు ఇండ్ల తాళాలు పగలగొట్టిన దుండగులు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి దుండగులు తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. మరో రెండు ఇండ్ల తాళాలు పగలగొట్టి చోరీకి యత్నించారు. సంఘటనకు సంబంధించి కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కలాల శ్రీలేఖ కొంతకాలంగా హాస కొత్తూర్ గ్రామానికి వెళ్ళు రోడ్డులో సిరిగిరి శ్రీనివాస్ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. ఈనెల 16న ఇంటికి తాళం వేసి శ్రీలేఖ తన తల్లి ఇంటికి నిర్మల్ జిల్లా ఖానాపూర్ వెళ్ళింది. బుధవారం ఉదయం వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా గుర్తుతెలియని దొంగలు తాళం పగలగొట్టి బీరువాను తెరచి చోరీకి పాల్పడ్డట్టు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న ఎస్ఐ అనిల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బీరువాలో పెట్టిన అర తుల బంగారం ఉంగరం, 18 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదును చోరీకి గురైనట్లు శ్రీలేఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పక్కనే ఉన్న సిరిగిరి శ్రీనివాస్, చింత గణేష్ ఇల్లు తాళాలను కూడా దుండగులు పగలగొట్టినట్లు ఎస్ఐ తెలిపారు. వారి ఇండ్లలో ఏం సూరి జరగలేదని తెలిపారు. కాగా కలాల శ్రీలేఖ ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. దొంగతనం జరిగిన ఇంటిని భీంగల్ సీఐ నవీన్ కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులకు సూచించారు.