ప్రధాన కూడలి లోని బహుళ అంతస్థుల భవనంలో చోరీ

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలోని ఒక బహుళ అంతస్తుల భవనంలో పట్టపగలే సోమవారం చోరీ జరిగింది.
బాధితుడి కథనం ప్రకారం..స్థానిక భగత్ సింగ్ కూడలి లో ఆళ్ల అంజయ్య బహుళ అంతస్తుల భవనంలో రెండవ అంతస్తులో ఉంటున్న విజయ్ కృష్ణ, తన భార్యతో కలిసి మధ్యాహ్న సమయంలో తన గదికి తాళం వేసి మార్కెట్కు వెళ్లారు. మార్కెట్ నుంచి కేవలం అరగంట వ్యవధిలోనే తిరిగి ఇంటికి రాగా, అప్పటికే వెనుక వైపు ఉన్న తలుపు తాళం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దొంగలు లోపలికి ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువా తెరిచి దాంట్లో ఉన్న నాలుగు కాసుల బంగారు హారం, రెండు ఉంగరాలు తో పాటు రూ.28 వేల నగదును అపహరించారు. అపహరణకు గురైన బంగారు అభరణాలు విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితుడు వాపోయాడు.  ఈ సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ శ్రీరాముల శ్రీను ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.అనంతరం క్లూస్ టీంకు సమాచారం అందించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.