బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్‌

Father of Burrakatha Padmashri Nazarప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్‌, నటుడు, ప్రజారచయిత, గాయకుడు. ” ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు” అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.

జననం : 1920 ఫిబ్రవరి 5న గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో జననం
తల్లిదండ్రులు : వివాబ్‌, మస్తాన్‌ దంపతులు
కుటుంబ నేపథ్యం : వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించారు.
విద్యాభ్యాసం : పాఠశాల విద్య మధ్యలోనే ఆగిపోయింది. పేదరికం, గణితం వంటి క్లిష్టమైన అంశాలలో శ్రద్ధ లేకపోవడంతో పాఠశాల విద్య అర్థాంతరంగానే ఆగిపోయింది.
బాల్యం : 14 – 15 ఏండ్ల వయసుదాకా విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయంలో కూలీ నాలీ పనులతో గడిచింది.
15 ఏండ్ల వయసు నుంచి ‘చెక్క భజనలు’ నేర్చుకుని గ్రామీణ లలిత కళలో ప్రావీణ్యం సంపాదించారు.
ఆ తరువాత ‘మంగళగిరి’లో హార్మోనియం నేర్చుకున్నారు. అలా యుక్తవయసు నాటికి పాటలు, పద్యాలు, సంగీతంతో అభిమానం పొందాడు.
కళారాధన : ముట్లూరు కోటీరయ్య అను గురువుగారి వద్ద శాస్త్రీయ గీతాలు నేర్చుకోవడంతో సంగీతంపై పట్టు సాధించారు.
పాఠశాలలో చదివే రోజులలోనే ద్రోణ పాత్రను ధరించి ప్రజా మన్ననలు పొందారు. హార్మోనిస్ట్‌ ‘ఖాదర్‌” ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత ధర్మి రామారావు అనే గ్రామపెద్ద ప్రోత్సాహంతో నాటకాలు వేయడం ప్రారంభించారు. కొమ్మినేని బసవయ్య అనువారి వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు.
ఊహకందని మలుపు : కొండపనేని బలరాం, వేములపల్లి శ్రీకృష్ణ ద్వయం గుంటూరుకు తీసుకు వచ్చి ”బుర్రకథలు” చెప్పించి ప్రోత్సహించి పార్టీ ప్రచారానికి బుర్ర కథలనే ప్రచారాస్త్రంగా మలుచుకొని నాజర్‌ ‘దశ – దిశ’ను మార్చారు.
ఇప్పటినుంచే ‘బుర్రకథ దళం’ ఏర్పడింది. తాడికొండలో వీరనారి సామ్య బుర్రకథను మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు.
ఆ తరువాత ప్రజానాట్యమండలి సభ్యులు అయ్యారు. 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ గౌరవ వేతనంతో పార్టీ ప్రచారాలకు బుర్రకథలు చెప్పారు.
జానపద సాహిత్య సేవ : కోలాటం, భజన పాటలు, వీధి భాగవతుల కథలు, బిచ్చగాళ్ళతో పాటలు, పౌరాణిక రంగ పద్యాలు ఒక్కటేమిటి గ్రామీణ ప్రాంతంలో ప్రాచుర్యం పొందిన జానపద కళలన్నింటినీ విస్తృతంగా పోషించి, ఆరాధించి ప్రచారం చేసి జానపద కళ నాజర్‌ నుంచే పుట్టిందా అనేంతటి పేరు సంపాదించి జనకళకు సాహిత్యానికి విశ్వంలోనే పేరుప్రతిష్టలు సంపాదించారు.
అవార్డులు : 1981లో ఆంధ్ర నాటక కళా పరిషత్‌ వారి ఉత్తమ కళా పోషకుడు బిరుదును పొందారు.
‘ఆసామి’ నాటక రచనకు 18వ ఆంధ్ర నాటక కళా పరిషత్‌ వారు ప్రథమ బహుమతిని ఇచ్చారు.
ప్రముఖ పాత్రికేయులు కె.ఏ. అబ్బాస్‌ ‘ఆంధ్రఅమర శిల్పి’ అని అభివర్ణించారు.
పద్మశ్రీ అవార్డు : 1986లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదుతో రాష్ట్రపతి సత్కారం పొందారు.
సినీ రంగంలో సేవలు : పుట్టిల్లు, అగ్గిరాముడు, నిలువు దోపిడి, పెత్తందార్లు వంటి అనేక సినిమాల్లో బుర్ర కథ సేవలు అందించారు.
జీవిత చరిత్రపై పుస్తక ముద్రణ : శ్రీ అంగదాల వెంకట రమణమూర్తి ఈయన జీవితంపై ‘పింజారి’ అనే పుస్తకం ముద్రించారు.
రచయిత : స్వయంగా పుస్తకాలు జానపద కళపై రచించారు. చాలాకాలం ‘విరసం’ సభ్యుడుగా ఉన్నారు.
తుదిశ్వాస : 1997 ఫిబ్రవరి 22న ‘అంగలూరు’ అనే గ్రామంలో తుదిశ్వాస విడిచారు.
నాజర్‌తో నాకు స్వయంగా పరిచయం నేను కాలేజీలో చదివే రోజుల్లో (1969 – 74) ఆయన్ని కలిసే అవకాశం వచ్చింది. ఒక పర్యాయం కలిసి ముచ్చటించాను.
బోడపాటి అప్పారావు, 9381509814