– 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు
– వారంరోజుల్లో మరింత పెరుగుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మార్చి నెలలో ఎండలు భగభగ మండిపోతున్నాయి. పది జిల్లాల్లో అప్పుడే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తాళ్లమడుగులో మంగళవారం అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. వచ్చే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమ శాతం కూడా తక్కువగా ఉండే అవకాశముంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కొమ్రంభీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, సూర్యాపేట, పెద్దపల్లి, మంచిర్యాల్, నిజామాబాద్, ములుగు, హన్మకొండ, జయశంకర్‌భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, జగిత్యాల, జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం అత్యధికంగా జూబ్లీహిల్స్‌లో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. అయితే, ఈ నెల 31, ఏప్రిల్ ఒకటో తేదీన రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశముంది.
తాళ్ల మడుగు(ఆదిలాబాద్) 42.3 డిగ్రీలు
సత్నాల(ఆదిలాబాద్) 42.3 డిగ్రీలు
చాప్రాల(ఆదిలాబాద్) 42.1 డిగ్రీలు
అసిఫాబాద్ (కొమ్రంభీమ్) 42.0 డిగ్రీలు
అర్లీ(టి)(ఆదిలాబాద్) 41.9 డిగ్రీలు
కొండాపూర్(మంచిర్యాల) 41.8 డిగ్రీలు
రాయినిగూడెం(సూర్యాపేట) 41.7 డిగ్రీలు
మాడ్గులపల్లి(నల్లగొండ) 41.7 డిగ్రీలు
మోర్తాడ్(నిజామాబాద్) 41.5 డిగ్రీలు
దసూరాబాద్(నిర్మల్) 41.4 డిగ్రీలు