దక్షిణ చైనా సముద్రం, తైవాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, తామిచ్చిన ఆయుధాలతో రష్యాపై దాడులకు దిగాలని పశ్చిమదేశాలు ఉక్రెయిన్ ఉసిగొల్పుతున్న తీరు, అంతర్జాతీయ కోర్టు, ఐరాస, ప్రపంచ దేశాలు ఎన్ని ఖండనలు చేసినా గాజా ప్రాంతంలో కొనసాగుతున్న ఇజ్రాయిల్ ఊచకోత. ఇలా వర్తమాన ప్రపంచ పరిణామాల అన్నింటి వెనుక సామ్రాజ్యవాదదేశాలు, వాటి ఆశ్రిత రాజ్యాలు ప్రత్యేకించి అమెరికా హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న లాక్‌హీడ్ మార్టిన్, రేతియాన్, జనరల్ డైనమిక్స్ వంటి పన్నెండు అమెరికా కంపెనీలు, వాటిలో పని చేస్తున్న పదిమంది సీనియర్ అధికారుల మీద బుధవారం నాడు చైనా ఆంక్షలు విధించింది. అంతకు ముందు రష్యాతో లావాదేవీలు జరుపుతున్న పన్నెండుకుపైగా చైనా కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలకు ఇది చెంపదెబ్బ అని కూడా చెబుతున్నారు. తైవాన్ తమ అంతర్భాగమని, దానికి నిరంతరం ఆయుధాలు అందచేయటాన్ని తాము సహించేది లేదని పదేపదే చేస్తున్న ప్రకటనలను తమ ప్రభుత్వ దన్ను చూసుకొని ఆమెరికా ఆయుధ కంపెనీలు ఖాతరు చేయటం లేదు. ఒక వైపు ఒకే చైనా అంటూ కబుర్లు చెబుతూనే బలవంతంగా కూడదంటూ మరోవైపు తైవాన్‌లో అధికారంలో ఉన్న విలీన వ్యతిరేకశక్తులకు పశ్చిమదేశాలు మద్దతు ఇవ్వటమేగాక ఆధునిక ఆయుధాలను అందిస్తూ తిరుగుబాటును రెచ్చగొడుతున్నాయి.
ప్రపంచ దేశాల ఆగ్రహం, స్వదేశంలో విద్యార్థుల వ్యతిరేకతను గమనించిన బైడెన్ సర్కార్ ఇజ్రాయిల్‌కు ఆయుధాల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించినప్పటికీ అవసరమైన ఆయుధాలను తరలిస్తున్నది. మరోవైపు గాజాలో జరుపుతున్న మారణకాండను సమర్థిస్తున్నది. ప్రపంచ కోర్టు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, తదితరుల అరెస్టును కోరగానే అమెరికా పార్లమెంటు సభ్యులు దాన్ని అనుమతిస్తే తదుపరి అరెస్టులు తమనేతలవే ఉంటాయంటూ కోర్టు న్యాయమూర్తులను ప్రభావితం చేసేందుకు బెదిరించేం దుకు పూనుకున్నారు. నిజానికి నెతన్యాహుతో పాటు అతనికి మద్దతిస్తున్న దేశాల నేతల మీద విచారణ జరిపి వేలాది మంది ప్రాణాలు తీసినందుకు, గాజాను సర్వనాశనం చేసినందుకు శిక్షలు విధించాల్సిందే. గతేడాది అక్టోబరు ఏడు నుంచి జరుపుతున్న దాడులకు తోడ్పడేందుకు సముద్ర మార్గంలో పంపితే ఆలస్యం కావచ్చు గనుక భారీ రవాణా విమానాల ద్వారా ఇజ్రాయిల్‌కు ఆయుధాలను తరలించటం గురించి పెంటగన్ ఆలోచిన సంగతి తెలిసిందే. నిజానికి గాజాలో జనాన్ని పూర్తిగా అంతం చేసేందుకు, ఆ ప్రాంతాన్ని నివాసరహితంగా మార్చేందుకు ఇజ్రాయిల్ దగ్గర ఆయుధాలు గుట్టలు పడి ఉన్నాయి. కొత్తగా ఇస్తామని అమెరికా చెప్పటం ఆ మారణకాండను వ్యతిరేకించే దేశాలను బెదిరించేందుకు తప్ప మరొకటి కాదు. 1960దశకం నుంచి ఇప్పటివరకు అమెరికా ఇచ్చిన ఆయుధాల విలువే 123 బిలియన్ డాలర్లని, ఇజ్రాయిల్ ఆయుధ దిగుమతుల్లో అమెరికా నుంచి 69శాతం ఉన్నట్లు తేలింది. వాటన్నింటినీ గాజాలో హమాస్ సాయుధులను ఏరివేసే పేరుతో సామాన్య జనం మీద ప్రయోగిస్తున్నారు.
2023లో వివిధ దేశాలకు అమెరికా విక్రయించిన ఆయుధాల విలువ రికార్డు స్థాయిలో 238 బిలియన్ డాలర్లకు చేరింది. రెండవ స్థానంలో పదకొండు శాతం చొప్పున రష్యా, ఫ్రాన్సు రెండవ స్థానంలో ఉన్నాయి. ఉక్రెయిన్‌ను తొత్తుదేశంగా మార్చుకొని తమ గుమ్మం ముందు ఆయుధకుంపటి పెట్టాలన్న నాటో కూటమి ఎత్తుగడలను గ్రహించిన రష్యా సైనికచర్య జరుపుతున్నది.రెండేండ్లు గడిచినా ఫలితం లేకపోవటంతో తాము అందచేసిన దీర్ఘశ్రేణి క్షిపణులతో రష్యాపై దాడులకు దిగాలని తాజాగా ఫ్రాన్స్ నేత మక్రాన్, నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌బర్గ్ బహిరంగంగా ప్రకటించి అక్కడి సంక్షోభాన్ని మరోమలుపు తిప్పేందుకు పూనుకున్నారు. ఎప్పటి నుంచో తమను అనుమతించాలని జెలెన్‌స్కీ కోరుతున్నాడు. తామిచ్చిన ఆయుధాలను ఎలా ప్రయోగిం చాలో అమెరికా, ఇతర దేశాల మిలిటరీ నిపుణులు ఉక్రెయిన్‌కు శిక్షణ ఇస్తున్నది బహిరంగ రహస్యమే. ఇది నిప్పుతో చెలగాటమని వ్లదిమిర్ పుతిన్ స్పందించాడు. పశ్చిమ దేశాలు ఇచ్చిన ఆయుధాలను ఉక్రెయిన్ మిలిటరీ ప్రయోగించి నప్పటికీ నాటో దేశాలు తమ మీద జరిపిన ప్రత్యక్ష దాడిగా పరిగణించి ప్రతి చర్యలు తీసుకుం టామని గతంలోనే ప్రకటించాడు. అదే జరిగితే ప్రపంచంలో అనూహ్యపరిణామాలు, పర్యవసానాలకు తెరలేస్తుంది.