పగిలిన మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌

పగిలిన మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌– ఎగిసిపడ్డ నీరు
– ఇండ్లల్లోకి చేరిన వరద
నవతెలంగాణ-ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని కోర్టు ఏరియా నెహ్రు నగర్‌లో మెయిన్‌ రోడ్డుపై మిషన్‌ భగీరథ మెయిన్‌ పైప్‌ పగిలి నీరు లీకైంది. దాంతో నీరు ఒక్కసారిగా ఎగిసిపడి వరద బీభత్సాన్ని సృష్టించింది. 100 మీటర్ల వరకు నీరు ఎగసిపడుతోంది. మెయిన్‌ రోడ్డు పైన, సమీపంలోని ఇండ్లలోకి మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయింది. నీటి ఉధృతికి పక్కనే ఉన్న ఓ ఇంటి ప్రహరీ గోడ కూలిపోయింది. గుంటి ఆండాలు అనే మహిళ ఇంట్లోకి నీరు ప్రవేశించి ఫ్రిడ్జ్‌, టీవీ, ధాన్యం, బట్టలు ఇతర వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. భారీగా వరద నీరు స్థానికంగా ఉన్న ఇండ్లలోకి ప్రవేశించడంతో సుమారు రూ.15 లక్షలు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ప్రధాన రహదారి దెబ్బతిన్నది. విషయం తెలుసుకున్న మిషన్‌ భగీరథ డీఈ, ఏఈ సంఘటనా స్థలాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. ఆర్‌ అండ్‌ బీ రోడ్డు పొడిగించే క్రమంలో రోడ్డు పొడవునా గుంతలు తీసి అందులో రాళ్లు మొరం వేయడం వల్లనే కింద ఉన్న పైపులైన్‌ పగిలి ఉంటుందని భావిస్తున్నారు. బాధితులకు తగు న్యాయం చేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అబ్దుల్‌ నబీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాగా, వేసవి తాపంతో నీటి ఎద్దడితో బాధపడుతుంటే.. ఆ నీటిని కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో భగీరథ నీరు వృథాగా పోతుంది.