కాటారం మండల కేంద్రానికి సమీపంలో భూపాలపల్లి వైపుగా జాతీయ రహదారిని ఆనుకొని కేటీపీపీకి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైపులైన్ గేట్ వాల్వ్ బుధవారం పగిలిపోవడంతో నీరు ఒక్కసారిగా ఎగిసిపడింది. కాళేశ్వరం సమీపంలోని గోదావరి నుంచి చెల్పూర్ సమీపంలోని కేటీపీపీకి నీటి సరఫరా కోసం గతంలో భారీ పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడక్కడ పెద్ద గేట్ వాల్స్ అమర్చారు.నీటి ప్రెషర్ కారణంగా మండల కేంద్రానికి సమీపంలో గేట్వాల్వ్ పగిలిపోవడంతో పెద్ద ఎత్తున నీరు బయటకు వచ్చింది. సుమారు గంటపాటు నీరు వృథాగా పారింది. సమాచారం అందుకున్న సిబ్బంది నీటి సరఫరాను నిలిపివేశారు.