– 35 మంది పాకిస్థానీ యాత్రికుల మృతి
– మరో 14 మంది పరిస్థితి విషమం
టెహ్రాన్ : పాకిస్థాన్ యాత్రికులతో వెళుతున్న బస్సు ప్రమాదానికి గురవడంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందికి తీవ్రగాయాలయ్యాయని, వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని ఇరానియన్ స్టూడెంట్స్ న్యూస్ ఏజన్సీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ ఇరాన్ ప్రావిన్స్ యాజ్ద్‌లో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అత్యవసర అధికారి మహ్మద్ అలీ మాలెక్‌జాదే తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ఉన్నారని చెప్పారు. గాయాలైన వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. బస్సు బ్రేకింగ్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. 7వ శతాబ్దానికి చెందిన షియా ప్రవక్త అర్బయిన్ 40 రోజుల సంతాప దినాలను పురస్కరించుకుని పలువురు షియా ముస్లిములు ఇరాక్‌లోని కర్బాలాలో వున్న అర్భయిన్ తీర్థయాత్రలో పాల్గొంటారు. ఏటా ఈ యాత్రకు వివిధ దేశాలు, ప్రాంతాల నుంచి లక్షలాదిమంది హాజరవుతుంటారు.