బుస్‌..బుస్‌..

– పాముకాటు కేసులపై ఐసీఎంఆర్‌ అప్రమత్తం
– అవగాహన కల్పించనున్న అధికారులు
న్యూఢిల్లీ : భారత్‌లో పాము కాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అప్రమత్తమవుతున్నది. పాము కాటు కేసులపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నది. పాము కాటు కేసులు భారత్‌లో సంవత్సరానికి సగటున 58 వేల మరణాలకు కారణమవుతున్నది. దేశంలో రుతుపవనాల రాకతో పాము కాటు కేసుల సంఖ్య పెరుగుతుందని ఐసీఎంఆర్‌ అంచనా వేస్తున్నది. ఈ విషయంలో వైద్యాధికారులు, ప్రజలతో పాటు ఆరోగ్య కేంద్రాల కోసం హిందీ, ఇంగ్లీష్‌, ఒడియా భాషలలో విద్యా సామాగ్రిని ఐసీఎంఆర్‌ విడుదల చేయబోతున్నది. ఆరోగ్య కార్యకర్తలకు సంబంధించిన విద్యా విషయాలు ఇతర ప్రాంతీయ భాషలలో, ముఖ్యంగా పాము కాటు కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ప్రచురించబడతాయి. ఆశా (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు) కార్మికులు, సహాయక నర్స్‌ మిడ్‌వైవ్‌లు (ఏఎన్‌ఎం), ఇతర ఆరోగ్య కార్యకర్తలకు పాము కాటును ముందుగానే గుర్తించడం, సమర్థవంతమైన ప్రథమ చికిత్స అందించడం, సమీప ఆరోగ్య సంరక్షణకు సకాలంలో రిఫరల్‌లు అందించడం వంటి వాటిపై చర్యలు తీసుకోనున్నది. ఐసీఎంఆర్‌ బుక్‌లెట్‌లో సాధారణంగా కనిపించే పాము జాతులు, పాము కాటు విషం యొక్క సంకేతాలు, లక్షణాల చిత్రమైన వర్ణనలు ఉన్నాయి. ఇది ప్రథమ చికిత్స, నివారణ చర్యలను కూడా వివరిస్తుంది.