బస్సు చార్జీలు పెరగలేదు

– ఆర్టీసీ యాజమాన్యం స్పష్టీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ బస్సు టికెట్‌ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగానే టిక్కెట్‌ చార్జీలు పెరిగాయని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రెగ్యులర్‌ సర్వీస్‌లకు సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయనీ, దీపావళి తిరుగు ప్రయాణ రద్దీ నేపథ్యంలో స్పెషల్‌ బస్సుల్లో మాత్రమే ప్రభుత్వ ఉత్తర్వుల చార్జీలను సవరించామని వివరించారు. పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ఆర్టీసీ ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులు నడుపుతుందనీ, తిరుగు ప్రయాణంలో ప్రయాణీకుల రద్దీ ఉండకపోవడంతో ఆ బస్సులు ఖాళీగా వెళ్తుంటాయని తెలిపారు. ఆ స్పెషల్‌ బస్సులకు అయ్యే డీజిల్‌ ఖర్చుల మేరకు టికెట్‌ ధరలను సవరించుకోవాలని 2003లో ప్రభుత్వం జీవో నంబర్‌ 16 జారీ చేసిందని పేర్కొన్నారు. 21 ఏండ్లుగా ఇదే పద్ధతి ఆర్టీసీలో అమల్లో ఉందన్నారు.