పోరుబాటగా ఆశా వర్కర్ల బస్సు జాతా

Bus Jatha of Asha workers as struggleఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-లు ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించాలని, పీఎఫ్‌., ఈఎస్‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతా ఈ నెల 15న నిర్మల్‌ జిల్లాలో ప్రారంభమైంది. రాష్ట్రమంతా అన్ని జిల్లాలు పర్యటించి డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద భారీ బహిరంగ సభతో ముగుస్తుంది.
ఆశాల సమస్యల పరిష్కారం కోసం ఏడుగురు బృందం సభ్యులు ఇల్లు వాకిలి సొంత ఊరు కుటుంబాన్ని చివరికి చేస్తున్న ఆశా పనిని కూడా పక్కన పెట్టారు. మహిళలు అనేక ఆటంకాలను అధిగమించి 17 రోజులు రాష్ట్రమంతా పర్యటించడానికి సిద్దం కావటం చిన్న అంశమేమీ కాదు. అందుకే ఆశాలు కూడా ఈ బస్‌ జాతాకు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు. ఫిక్స్‌డ్‌ వేతనంలేక అనేక సంవత్సరాల నుండి వెట్టిచాకిరీలో మునిగిపోయిన ఆశాలు బస్సు జాతాను చూసి మా బతుకుల్లో వెలుగులు నింపడం కోసం బయలుదేరిన పోరు యాత్రగా బస్సు జాతాను అక్కున చేర్చుకుంటున్నారు. మా జిల్లాకు ఫలానా తేదీన బస్సు జాతా వస్తుందనీ, మేము సమయానికి వెళ్ళి విజయవంతం చేయాలని కుటుంబ సభ్యులకు, చుట్టాలతో పాటు గ్రామంలో సేవలందించే ప్రజలందరిలో ఆశాలు ఎంతో గర్వంగా ప్రచారం చేస్తున్నారు. కరపత్రం పంపిణీ పోస్టర్‌ ఆవిష్కరణ ఆశా వర్కర్ల సమస్యలపైన పాడిన పాటల ప్రచారంతో రాష్ట్రమంతా గ్రామగ్రామానా బస్సు జాతా ప్రచారాన్ని ఆశాలు మారుమోగి స్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాతా కోసం ఆశాలు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే ఒకరోజు ముందే జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. అధికారుల వేధింపులు, క్రిస్టమస్‌ లాంటి పండుగలను సైతం అధిగమించి భారీ సంఖ్యలో ఆశాలు పాల్గొంటున్నారు. ఆశా యూనిఫామ్‌ కట్టుకొని, చేతిలో సీఐటీయూ జెండా పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లు పరిష్కరించాలని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బోనాలు, బతుకమ్మలు, డప్పులు, కోలాటం ఆట పాటలతో బస్సు జాతాకు ఆశాలు ఘనస్వాగతం పలుకుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆశాలు అడుగుతున్నది గొంతెమ్మ కోర్కెలు కాదు. పాత డిమాండ్లే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18,000/-ల కోసం, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఆశాలు 15 రోజులు నిరవధిక సమ్మె చేశారు. హైదరాబాద్‌ కోఠి కమిషనర్‌ ఆఫీసు వద్ద సమ్మె ముగింపు సందర్భంగా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఆశాల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేస్తున్నామని, ఈ కమిటీ నివేదిక తయారు చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి అందిస్తుందని ఆశాల సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేసే విధంగా కమిటీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఇదే సమ్మె సందర్భంగా ఇప్పుడు అధికారంలో ఉన్న ఎంఎల్‌ఏలు, మంత్రులు సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారితో సహా కాంగ్రెస్‌ నాయకులందరూ ఆశాల టెంట్ల వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. మా కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేసి గెలిపించండి మాకు అధికారం ఇస్తే ఆశాల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఆశాలకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని పొందుపర్చారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశాలకిచ్చిన హామీలు, గత సమ్మె హామీలు అమలు చేయాలని ఆశాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ పోరాటాల్లో ఉన్నతాధికారులు ఫిక్స్‌డ్‌ వేతనంతో పాటు రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌, 50 వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర హామీలు ఇచ్చారు. హామీలతో కడుపు నిండట్లేదని, హామీల అమలు కోసం వెంటనే జీఓ లు విడుదల చేయాలని ఆశాలు డిమాండ్‌ చేస్తున్నారు.
ఆశాలు అడుగుతున్న డిమాండ్లు చాలా న్యాయమైనవి. ఎందుకంటే ఒక కుటుంబం బతకాలంటే రూ. 26 వేల కనీస వేతనం ఉండాలి. కానీ తెలంగాణాలో ఆశాలు అడుగుతున్నది ఫిక్సిడ్‌ వేతనం రూ.18,000/-లు మాత్రమే. ఎందుకంటే వారు చేస్తున్న పనుల్లో ఎక్కువ శాతం రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పనులే ఉన్నాయి. పైగా ఈ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది కాబట్టి. పైగా ఆశాలకు రాష్ట్రంలో పారితోషికాలు మూడు సంవత్సరాల క్రితం పెంచారు. ఈ కాలంలో అనేక రెట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఆశాలు చేసే పనులను ఈ కాలంలో ప్రభుత్వం విపరీతంగా పెంచింది. పారితోషికం లేని అనేక పనులను ఆశాలతో చేయిస్తున్నారు. ఆశాలు చేస్తున్న పనులకు ఇచ్చే పారితోషికాల డబ్బులు చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. ఆశాల శ్రమనంతా లెక్కలోకి తీసుకోవాలి. అందుకే పారితోషికాలను రూ.18వేలకు పెంచి ఫిక్స్‌డ్‌ వేతనం 18వేలు నిర్ణయించాలని ఆశాలు కోరుతున్నారు. ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయం అయితే ఆశా వర్కర్ల సమస్యలు 90శాతం పరిష్కారం అవుతాయి. ఒకప్పుడు కేసులున్నప్పుడే ఆశాలు పనిలో ఉండేవారు. మిగిలిన సమయం సొంత పనులు చేసుకొనేవారు. కానీ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను మొత్తం మార్చింది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ఆశాలు మొత్తం హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ పనిలో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారమే రాష్ట్రంలో ఆశాలు పని చేస్తున్నారు. కానీ ప్రతి నెల 20వ తేదీన ఆశాలు చేసిన శ్రమనంతా పక్కన బెట్టి కేసులుంటేనే డబ్బులు కేసుల్లేకుంటే డబ్బుల్లేవని ప్రభుత్వం చెప్తున్నది. దీంతో ఆశాలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై, అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అందుకే ఈ వెట్టి చాకిరీ విధానాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్రల మాదిరిగా నెల జీతం నిర్ణయించాలని ఆశాలు డిమాండ్‌ చేస్తున్నారు. ఫిక్స్‌డ్‌ వేతనం అయితే అధికారుల వేధింపులు కూడా తగ్గుతాయి. ఇంత ముఖ్యమైన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలి.
రాష్ట్రంలో 30వేల మంది ఆశా వర్కర్లు గత 19 సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు. రాత్రనకా పగలనకా నిరంతరం ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచుతున్నారు. టీబీ, లెప్రసీ, బోదకాలు తదితర వ్యాధులు రాకుండా అరికడుతున్నారు. బీపీ, షుగర్‌కు మందులు పంచుతున్నారు. సీజనల్‌ వ్యాధులను గుర్తించి అరికడుతున్నారు. పిల్లలకు వ్యాధినిరోధక టీకాలిప్పించటం తదితర అనేక పనులు ఆశాలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కాలంలో ఆశాలు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందించారు. కరోనాను కట్టడి చేయడంలో ఆశాలు కీలకపాత్ర పోషించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) గుర్తించింది. ఆశాలు గ్లోబల్‌ లీడర్స్‌ అని అవార్డ్‌ను ఇచ్చింది. సీఐటీయూ పోరాటాల ఫలితంగా 2013లో 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సమావేశం స్కీం వర్కర్లలో భాగమైన ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్‌హెచ్‌ఎం స్కీంను ప్రయివేటీకరణ చేయకూడదని తీర్మానం చేసింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవటం లేదు. ఆశాల శ్రమను గుర్తించటం లేదు. పైగా ఎన్‌హెచ్‌ఎం స్కీంకు ఆశా వర్కర్లకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు చేస్తున్నారు. ఆశాల సమస్యలు పరిష్కారం చేయడంలో ఎక్కువ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే వుంది. కానీ కేంద్ర ప్రభుత్వం అతితక్కువ కేవలం రూ.3 వేలు మాత్రమే పారితోషికాలు చెల్లిస్తున్నది. ఇతర సమస్యలను పరిష్కరించటంలేదు. పైగా ఆరోగ్య రంగాన్ని ప్రయివేటీకరణ చేస్తున్నది. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్స్‌ని తెచ్చింది. పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచుతున్నది. యూనియన్‌ పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కును కాలరాస్తున్నది. కనీస వేతనం రోజుకు రూ.178/-లు ఉంటే చాలని దుర్మార్గంగా నిర్ణయం చేసింది. నిత్యావసర వస్తుల ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ఆశా వర్కర్ల వేతనాలు పెంచే అంశాన్ని పూర్తిగా పక్కన పడేసింది. ఈ విధానాలను నిరసిస్తూ ఆశాల సమస్యలు కేంద్రం ప్రభుత్వం పరిష్కరించాలని నవంబర్‌ 26న ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద వేలాదిమంది ఆశాలు ధర్నా నిర్వహించారు. అయినా కేంద్ర ప్రభుత్వం నేటికీ స్పందించలేదు.
తెలంగాణ రాష్ట్రంలో 10 సం||రాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆశాల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఆశాలు బలంగా కోరుకుంటున్న ఫిక్స్‌డ్‌ వేతనాన్ని నిర్ణయం చేయకుండా ఆశాలను మోసం చేసింది. ఇప్పుడు అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ పాలన సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీలను వెనక్కి తిరిగి చూడటం లేదు. పైగా పోరాటం చేసిన ప్రతీసారి చూస్తాము, చేస్తామని కాలయాపన చేసి తప్పించుకుంటున్నది. ఈ విధానాలతో విసిగి వేసారిన ఆశాలు పోరాటమే మార్గమని డిసెంబర్‌ 15న నిర్మల్‌ జిల్లాలో రాష్ట్ర బస్సు జాతాను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి భవిష్యత్‌ పోరాటాలకు ఆశాలను సన్నద్ధం చేస్తున్నారు. డిసెంబర్‌ 31న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద వేలాదిమంది ఆశాలతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ లోపు కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి ఆశాల సమస్యలు పరిష్కరించాలి. ఆలస్యం చేస్తే బస్సు జాతా అనంతరం పనులన్నీ బంద్‌ చేసి నిరవధిక సమ్మెకు దిగుతామని ఆశాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.
(రచయిత తెలంగాణా ఆశా వర్కర్స్‌ యూనియన్‌
రాష్ట్ర అధ్యక్షురాలు)
పి. జయలక్ష్మి
9490098605