బస్సులో మంటలు

– 13 మంది సజీవ దహనం
– మధ్యప్రదేశ్‌లో ఘటన
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 30-35 మంది ప్రయాణికులతో గుణ నుంచి ఆరోన్‌ వెళ్తున్న బస్సులో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. దుహాయి లోయలో బస్సు రోడ్డు పక్కగా నిలిచి ఉన్న డంపర్‌ ట్రక్కును ఢకొీట్టింది. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చి ఢ కొనడంతో బస్సులో మంటలు చెలరేగాయని గుణ పోలీసు సూపరింటెండెంట్‌ (ఎస్పీ) విజరు ఖత్రి తెలిపారు. కొందరు ప్రయాణికులు బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా, మరికొందరు బస్సులో చిక్కుకుని సజీవ దహనమయ్యారని ఎస్పీ తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, డంపర్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు సహాయక దళం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి.
ఆస్పత్రులకు తరలింపు..
సుమారు 14 మందిని గుణ జిల్లా ఆస్పత్రిలో చేర్చగా.. 13 మంది మరణించినట్టు జిల్లా కలెక్టర్‌ తరుణ్‌ రాఠీ తెలిపారు. బస్సులో తీవ్రంగా కాలిపోయిన 11 మృతదేహాలు, బయట రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది. మతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ముందు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ తరుణ్‌ రాఠీ తెలిపారు.
రూ. 4 లక్షల ఎక్స్‌ గ్రేషియా
మతుల కుటుంబాలను, క్షతగాత్రులను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ పరామర్శించారు. అనంతరం, మతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. ఆర్టీవో అనుమతి, ఇన్సూరెన్స్‌ లేకుండా బస్సు నడుపుతున్నందున నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుణ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) అధికారి రవి బరేలియా, గుణ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారి వీడీ కత్రోలియాలను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు.