– గుర్తింపు కార్డు సమస్య ఉచిత ప్రయాణానికి ఆటంకం కాకూడదు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అన్ని గ్రామాలకు బస్సు సర్వీసులను విస్తరించాలనీ, ఉచిత ప్రయాణానికి గుర్తింపు సమస్య అనేది ఆటంకంగా మారకూడదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పేర్కొంది. బుధవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన రాష్ట్ర కమిటి సమావేశం ప్రారంభమైంది. పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎ విజయరాఘవన్ హాజరయ్యారు. రాష్ట్రంలోని గ్రామాలన్నింటికీ బస్సు సర్వీసులను విస్తరింపచేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించినట్టు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో తెలిపారు. ‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10లక్షలకు పెంచింది. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు వాగ్దానాలను తక్షణం అమలు చేయటం హర్షణీయం. కానీ రాష్ట్రంలో సుమారు నాలుగువేల గ్రామాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేనందువల్ల గ్రామీణ నిరుపేద మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం లేదు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పల్లెవెలుగు, ప్యాసింజర్ బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు మాత్రమే పరిమితం చేయటంతో దూరప్రయాణం చేసే మహిళలకు ఈ సదుపాయం పరిమితంగానే అందుబాటులో ఉంటుంది.
అందువల్ల ఆర్టీసీ బస్సు సౌకర్యం లేని ప్రతి గ్రామానికీ బస్సు సౌకర్యం కల్పించాలని’ ఆయన కోరారు. గుర్తింపు కార్డు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయనీ, ఆ సమస్య ఏండ్ల తరబడి ఇక్కడ పనిచేస్తున్న వలస కూలీలు, గుర్తింపు కార్డు లేని పేద కుటుంబాల మహిళలకు ఆటంకం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఉపయోగకరమైనప్పటికీ, ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు.