– ఇటు ఎమ్మెల్సీ ఎన్నిక.. అటు లోక్‌సభ… అయోమయంలో నాయకత్వం
– పాలమూరు జడ్పీటీసీ, ఎంపీటీసీలతో గోవాలో కేటీఆర్ క్యాంపు
– పార్లమెంటరీ పార్టీ నేత కేకే వ్యాఖ్యలతో మరింత హీటు
– ఈ గందరగోళం మధ్యే హైదరాబాద్ ఎంపీ సీటుకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారు
– నేడు సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంపై సమీక్ష
– హాజరుకానున్న కేటీఆర్, పద్మారావు, తలసాని తదితరులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పరిస్థితి రోజురోజుకు మరింత ఇబ్బందికరంగా మారుతోంది. లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ… నేతలందరూ పార్టీని వీడుతుండటంతో ఏం చేయాలో పాలుపోని దుస్థితి ఆ పార్టీలో నెలకొంది. మరోవైపు ఈనెల 28న జరగబోయే మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. అక్కడున్న జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో అత్యధిక మంది బీఆర్‌ఎస్‌కు చెందిన వారే. అయినా ఏదో తెలియని ఆందోళన. గతంలో నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు నేతలు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ఆ జిల్ల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలందరూ బీఆర్‌ఎస్ వారే ఉన్నప్పటికీ… కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. అంటే కారు పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువ మంది హస్తానికి ఓటేశారన్నమాట. అలాంటి పరిస్థితే ఇప్పుడూ ఎదురవుతుందని బీఆర్‌ఎస్ అంచనా వేసింది. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలందర్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోవాకు తీసుకెళి, గత రెండు రోజుల నుంచి అక్కడే క్యాంపు రాజకీయాలు నడిపినట్టు సమాచారం. ఈ క్యాంపునకు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్, బీఆర్‌ఎస్ నాగర్ కర్నూల్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ జిల్లా నేతలు మర్రి జనార్థన్‌రెడ్డి, నవీన్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 1,394 మంది ఓటర్లు (స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు) ఉండగా, వీరిలో బీఆర్‌ఎస్‌కు 823, కాంగ్రెస్‌కు 396, బీజేపీకి 88, బీఎస్పీకి ఒకటి, సీపీఐకి 4, సీపీఐ(ఎం)కు ఇద్దరు, ఎంఐఎంకు ఆరుగురు ఓటర్లు ఉన్నారు. ఇండిపెండెంట్లు 13 మంది ఉన్నారు. ఈ సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థాన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదనే ఉద్దేశంతో కారు పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది.
మరోవైపు సాక్షాత్తూ బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు యూట్యూబ్ ఛానళ్లలో తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో… ఆయన కేసీఆర్ కుటుంబపైనా, బీఆర్‌ఎస్ పరిస్థితిపైనా చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ‘బీఆర్‌ఎస్ ఓ కుటుంబ పార్టీ. ఆ పార్టీలో కేటీఆర్, హరీశ్, కవిత మాత్రమే ప్రచారంలో ఉంటారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పడిపోవటం ఖాయం. కాంగ్రెస్ ఈ ఎలక్షన్లలో అత్యధిక సీట్లను గెలుచుకుంటుంది. సీఎం రేవంత్ పాలన బాగుంది…’ అంటూ ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. దీన్నిబట్టి గులాబీ పార్టీ పట్ల కేకే వైఖరేంటో తెలిసిపోతోంది.
ఇలాంటి గందరగోళం, అయోమయ పరిస్థితుల నడుమే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్… హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి సోమవారం అభ్యర్థిని ప్రకటించారు. ఆ స్థానానికి గడ్డం శ్రీనివాస యాదవ్ పేరును ఆయన ఖరారు చేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు బీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. ఇక సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు బీఆర్‌ఎస్సే ఏడింటినీ గెలుచుకోవటంతో ఆ ఎంపీ సీటును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సారి ఆ స్థానాన్ని కచ్చితంగా దక్కించుకోవాలంటూ ఆయన నేతలను ఆదేశించారు. ఇందుకనుగుణంగా కార్యాచరణ రూపొందించాలంటూ దిశా నిర్దేశం చేశారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారి, కాంగ్రెస్ కండువా కప్పుకోవటమేగాక ఆ పార్టీ నుంచి ఏకంగా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో తక్షణమే ఆ స్థానంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలంటూ కేసీఆర్… వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. దీంతో మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ సికింద్రాబాద్ ఎంపీ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి సీనియర్ నేతలు పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్‌తోపాటు ఇతర నాయకులందరూ హాజరుకానున్నారు.