అయితే ఆదివారం కాకుంటే సోమవారం

But if not Sunday then Mondayకొందరు చలాకీగా మాట్లాడుతారు. సమయస్ఫూర్తితో వాళ్లే గలగలా మాట్లాడే వాళ్ళు. ఎక్కువగా సామెతలను ఉపయోగిస్తారు. ఎప్పుడొస్తవు, ఎప్పుడు ఇస్తవు ఇలాంటి అవసరాల మాటల సంభాషణలో ‘అయితే ఆదివారం కాకుంటే సోమవారం’ అంటూ రెండు తీర్లుగ జవాబులు చెబుతారు. దీనినే ‘ఇరుక కుంట కొరక కుంట’ మాట్లాడుడు అంటరు. నిండు చూలాలని చూపి ఎవరు పుడతారో అని సరదాగా మాట్లాడే సందర్భంలో ‘కొడుకే పుడుతడు. నూటికి నూరు పాళ్లు కచ్చితంగా కొడుకే పుడుతడు. దబ్బన తప్పితే మాత్రం బిడ్డ’ అని మెల్లగ చెబుతారు. పుట్టేది బిడ్డ లేదా కొడుకు అని అందరికీ తెలిసిందే అయినా తర్వాత నేను చెప్పలేదా అని ‘ఏతులు సుత కొడుతరు’. సరే వాళ్ళు వాళ్లు ఏది అనుకుంటే ఏమి అనుకుంటే ‘కందకులేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నట్టు’ మిగతా వాళ్ళు చూసి నవ్వి ఊరుకుంటరు. ఇట్లా ఇగురంగ తొనకకుండా, బెనకకుండ కొందరు సరదాగా మాట్లాడుతరు. ‘ఆవు చేన్లో మేస్తే దూడ గడ్డకు మేస్తదా’ అనే సామెత ఉన్నట్టు ఒకరిని చూసి ఒకరు ఇలా అలవాటైపోతుంటారు. వరి చేనులో ఆవు మేస్తే దాని దూడ కూడా దాని వెంబడే పోతది. లేదంటే ‘ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు’ అనే అనే సామెత కూడా ఉంది. సావాసం అంటే స్నేహం. సాధారణంగా భావ సారూప్యత కలిస్తేనే స్నేహం కలిసిపోతుంది. చిన్నగా ఏమైనా తేడాలు ఉంటే ఆరు నెలల్లో ఒకటవుతారు.
– అన్నవరం దేవేందర్‌, 9440763479