బట్లర్‌ బాదేశాడు

Butler said– బెంగళూర్‌పై రాజస్థాన్‌ గెలుపు
– కోహ్లి అజేయ సెంచరీ వృథా
– బెంగళూర్‌ 183/3, రాజస్థాన్‌ 189/4
నవతెలంగాణ-జైపూర్‌
రాజస్థాన్‌ రాయల్స్‌కు ఎదురులేదు. ఐపీఎల్‌ 17లో వరుసగా నాల్గో విజయం సాధించిన రాజస్థాన్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 184 పరుగుల ఛేదనలో ఓపెనర్‌ జోశ్‌ బట్లర్‌ (100 నాటౌట్‌, 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (69, 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిశాడు. బట్లర్‌, సంజు 148 పరుగుల భారీ భాగస్వామ్యంతో రాయల్స్‌కు గెలుపు లాంఛనం చేశారు. బట్లర్‌ జోరుతో 19.1 ఓవర్లలోనే రాజస్థాన్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు, విరాట్‌ కోహ్లి (113 నాటౌట్‌, 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఐదు మ్యాచుల్లో బెంగళూర్‌కు ఇది నాల్గో పరాజయం.
కోహ్లి శతక నాదం : టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది!. ఓపెనర్లు ఇద్దరూ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌కు నిలబడినా.. బెంగళూర్‌ స్కోరు 200 దాటలేదు. స్పిన్నర్లు అశ్విన్‌, చాహల్‌ సహా పేసర్‌ బర్గర్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి క్రమశిక్షణ బంతులేసిన రాయల్స్‌ బౌలర్లు 33 డాట్‌ బాల్స్‌ సంధించారు. ఓవరాల్‌ స్కోరుపై ఇది ప్రభావం చూపించింది. ఆర్సీబీ ఓపెనర్లు కోహ్లి (113 నాటౌట్‌), డుప్లెసిస్‌ (44) తొలి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఆరంభంలో డుప్లెసిస్‌, కోహ్లి ఇద్దరూ దూకుడు చూపించలేకపోయారు.డుప్లెసిస్‌ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టినా సౌకర్యవం తంగా కనిపించలేదు. పవర్‌ప్లేలో 53 పరుగులు చేసిన బెంగళూర్‌ ఆ తర్వాత మరింత నెమ్మదిం చింది. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 39 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన కోహ్లి.. సెంచరీ కోసం 28 బంతులే తీసుకున్నాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 బంతుల్లో కోహ్లి శతకం సాధించాడు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (1), సౌరవ్‌ చౌహాన్‌ (9), కామెరూన్‌ గ్రీన్‌ (5 నాటౌట్‌) నిరాశపరిచారు. బెంగళూర్‌ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్లు నమోదు కాగా.. అందులో కోహ్లి ఒక్కడే 12 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టడం గమనార్హం. సమిష్టిగా రాణించటంలో మరోసారి విఫలమైన బెంగళూర్‌ బ్యాటర్లు జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు!.