3 రాష్ట్రాల్లో 14 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక తేదీ మార్పు

న్యూఢిల్లీ : కేరళ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో 14 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13న నిర్వహించాల్సిన ఉప ఎన్నికలను ఈ నెల 20కి వాయిదా వేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసిఐ) గతంలో ప్రకటించింది. ఆ రోజున పలు మతపరమైన కార్యక్రమాల కారణంగా బిజెపి, కాంగ్రెస్‌, బిఎస్‌పి, ఆర్‌ఎల్‌డి సహా పలు రాజకీయ పార్టీలు పోలింగ్‌ను వాయిదా వేయాలని ఇసిఐని కోరాయి. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల కారణంగా ఓటింగ్‌ శాతం తగ్గే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు దృష్టికి తేవడంతో, వాటి అభ్యర్థన మేరకు ఉప ఎన్నికల పోలింగ్‌ను ఈ నెల 20కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ప్రభావితమైన 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేరళలోని పాలక్కాడ్‌, పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌, చబ్బేవాల్‌, గిద్దర్‌ బాహా, బర్నాల్‌, ఉత్తరప్రదేశ్‌లోని ఖైర్‌, మీరాపూర్‌, కుంద ర్కి, ఘజియాబాద్‌, కర్హాల్‌, సిషామౌ, ఫుల్‌పూర్‌, కతేహరి, మజావాన్‌ ఉన్నాయి.