బీఆర్‌ఎస్‌కు ‘చింతనిప్పు’ బైబై

– యువజన విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ కష్ణచైతన్య రాజీనామా
– కేసీఆర్‌ కు లేఖ.. పార్టీ జిల్లా అధ్యక్షుడు మధుకు కూడా.
– తనకు సహకరించిన వారికీ ధన్యవాదాలు అని లేఖలో ప్రస్తావన
– కాంగ్రెస్‌ లో చేరేందుకు సన్నాహాలు..
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కష్ణచైతన్య ఆపార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, యువజన విభాగం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు శనివారం లేఖ రాశారు. దాని ప్రతిని జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌ కూ పంపారు. తనకు సహకరించిన వారందరికీ లేఖలో ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రెండు, మూడు రోజుల్లో హస్తం గూటికి చేరతానని ‘నవతెలంగాణ’తో చెప్పారు.
టీడీపీ నుంచి ప్రస్థానం…
కష్ణ చైతన్య రాజకీయ ప్రస్థానం టిడిపి నుంచి మొదలైంది. అప్పట్లో టీడీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడుగా వ్యవహరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బీఆర్‌ఎస్‌ లో చేరారు. టీడీపీలో ఆయన తుమ్మల వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణకు అనుచరుడిగా ఉండేవారు. దశాబ్దకాలంగా కష్ణ చైతన్య బీఆర్‌ ఎస్‌ లో చురుకైన నాయకుడిగా వ్యహరించారు.
మూడేళ్ల క్రితం యువజన విభాగం బాధ్యతలు..
కష్ణ చైతన్య చురుకుదనం చూసి బీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా జిల్లా అధ్యక్షుడిగా మూడేళ్ల క్రితం బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల్లో ఆయన సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పరిణామాల్లో కష్ణ చైతన్య కూడా బీఆర్‌ఎస్‌ వీడాలని నిర్ణయించు కున్నారు. మొదటి నుంచి ఆయన బాలసాని లక్ష్మీనారాయణ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాలసానితోపాటు పార్టీ వీడతారని అనుకున్నా.. అయన మాత్రం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగారు. మంత్రి పొంగులేటితో కష్ణ చైతన్యకున్న సత్సంబంధాలు, తుమ్మల, బాలసానితో అనుబంధం రీత్యా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారు.