బై అంటావా.. బైబై అంటావా…

బై అంటావా.. బైబై అంటావా...”సుస్వాగతం అన్న నోటితోనే ఇక సెలవ్‌ అంటారు ఈ ప్రజలు. వీళ్ళకు ఒకసారి ఉన్న సెంటి మెంట్లు ఇంకోసారి ఉండవ్‌, నేనున్నన్ని రోజులూ ఎంత సేవ చేశాను, ఎంత బాగా చూసుకున్నాను!! నేనుండను అన్న విషయం తెలిసి కూడా వాళ్ళకు కావలసింది ఇచ్చాను”
ఇలా అన్నది ఏ రాజకీయ పార్టీ అధిపతో కాదు, ఏ బడా వ్యాపారో కాదు, ఏ సినిమా హీరోనో హీరోయినో కాదు మరెవరు అని కోప్పడవద్దు, కాస్త ఓపిక పట్టండి, కాస్త సహనం అలవర్చుకొండి.
”పడతాము, అలవర్చుకొంటాము గాని అసలామాట అనిందెవరో చెప్పం డి, తరువాత మాకు బొచ్చెడు పనులు న్నాయి, వాట్సప్‌లో మెసేజిలు చూసుకో వాలి, స్టేటస్‌ అప్డేట్‌ చేయాలి, ముఖ పుస్తకంలో నేను పెట్టిన పోస్టుకు ఎన్ని ఇష్టాలు, ఎన్ని పంచుకోవడాలు, ఎన్ని వ్యాఖ్యలు అంటే ఎన్ని లైకులు, ఎన్ని షేర్లు, ఎన్ని కామెంట్లు చేశారో చూసుకోవాలి, నాకస్సలే టైం లేదు.”
ఐతే మీరు తప్పక తెలుసుకోవాలి, అలా అనింది ఎవరో. అలా అనింది మీరు లేదంటున్న టైమే, అంటే కాలమే. అలా అనింది పాత సంవత్సరం. ఇప్పుడు చెప్పండి ఆ పాత సంవత్సరాన్ని ఎలా వాడుకున్నారు? అంటే ఇంకా ఒకరోజు మిగిలే ఉంది కాని అప్పుడే దాన్ని పాతదంటే కోప్పడుతుంది, బాధ పడుతుంది. దానికీ సెంటిమెంట్లు ఉంటాయి మనుషుల్లాగా. తానుం డనని, వెళ్ళిపోతున్నానని చెబుతోంది కూడా.
ఐనా మీరు వాడుకోవడమేమిటి, అదే మిమ్మల్ని వాడుకుంటుంది. కొందరినైతే చెరుకు రసం మిషనులో లాగ రెండుమూడు సార్లు తిప్పి, తిప్పి మరీ పిప్పి చేస్తుంది. అలా పిప్పి కావడం కోసమే మేమంత కష్ట పడేది, కొత్త సంవత్సరమొచ్చాక మళ్ళీ కొత్త చెరకు గడలా నిండుగా నిగనిగలాడుతూ ఉంటాము మేము అని ఎవరు చెబుతారో వాళ్ళు ఎలా చెబితే అలా విం టుంది కాలం. వాళ్ళకు దాసోహమంటుంది కాలం. ఇంతకీ కాలమంటే ఏమిటి? గడి యారమా, వాచీనా, టైమెంతో చూపించే సెల్లుఫోనా, రోజులను చూపెట్టే క్యాలెం డరా, లేక ఎప్పుడూ రాయకుండా కొత్తగా ఉండే డైరీనా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరు చదవాలి. పుస్తకాల్ని చదవాలి, కాలాన్ని చదవాలి.
సమయాన్ని బాగా వాడుకోవడమంటే జీవితంలోని నవరసాల్ని ఆస్వాదించాలి. ఎప్పుడూ సీరియస్సుగా ఉండడం అంత మంచిది కాదు. కూసింత కళాపోషణ అవసరం. నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి. నవ్వించేవారిని దగ్గరకు తీయాలి, దాని విలువ తెలుసుకుంటే మిగతా ఎనిమిది రసాలు వాటంతట అవే వస్తాయి, ఎవ్వరూ చెప్పకుండానే మీరు ఆస్వాదిస్తారు వాటిని. కష్టపడి చదవకండి, ఇష్టపడి చద వండని బీవి పట్టాభిరాం లాంటి హిప్నో టిస్టులు చెప్పినా, పుస్తకాలు రాసినా వాటిని తెచ్చుకొని చదివినా ఈ కష్టం, ఇష్టం, సమయం ఇలా కొన్ని విషయాలు మనకు అర్థమే కావు ఎన్నాళ్ళకీ. అలాగని అర్థం చేసు కోవడానికి ఎంత ప్రయత్నించినా మీరు దాన్ని అందుకోలేదని అనుకుంటే ఒక సలహా. ఉదయం లేచినప్పటినుండీ ఏదో ఒకటి చేస్తూ ఉండండి. కొన్నిరోజులకు మీకిష్టమైనదేదో తెలిసి పోతుంది. రోజూ ముచ్చు మొహం అని ఎవరినైతే తిట్టుకుంటారో వారికి ఫోను చేయండి, సరిగా మాట్లాడకుంటే మళ్ళీ చేయండి, మళ్ళీ మళ్ళీ చేయండి. అలా చేసి చేసి విసుగు తెప్పిం చినాక ఏదో ఒక రోజు మీరు చేసేలోగా ఆ సో కాల్డ్‌ మనిషి నుండి మీకు కాల్‌ వస్తుంది. అదే టైమంటే. మీరు దాన్ని సరిగా వాడుకున్నట్టే.
ఏవో ఛానల్సు తిప్పుతుంటే టీవీలో పాట వస్తోందొకరోజు. ఇద్దరు ప్రేమికులు పాడుకుంటున్నారు, దినం దినం మనోహరం అని, రోజూ కొత్తగా ఉందామని ఇలా కవి రాసినట్టు, సంగీత దర్శకుడు ట్యూను కట్టినట్టు, కోరియో గ్రాఫర్‌ చెప్పినట్టు చేస్తున్నారు వాళ్ళు. నిజంగా కవి తాను యవ్వనంలో ఉన్న రోజుల్లోకి పోయి రాసినట్టున్నాడు. ఏదో అల వాటుగా వినడం, వదిలేయడం మనకలవాటైంది కాని కొద్దిగా చెవులు అటువైపు పెట్టి వింటే ఇలాంటివెన్నో. ఇంతకీ రోజురోజుకు తేడా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అని మనకు వేరేవాళ్ళు చెప్పాలా? మనకు మనం తెలుసు కోలేమా అని పించింది. మనకు తెలిసినవే పాటించము, కొత్తవి తెలుసు కొని ఏమి పాటిస్తాము అని ఎవరైనా అను కుంటే దాల్‌ లో పావ్‌ వేసినట్టే. మనం అన్నీ చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కాని మనకు నిజంగా అవసరమైనవి కొన్ని పాటించం.
అసలైన విషయం ఒకటుంది. కాలమంటే శ్రమ. కాలమంటే కష్టం చేయడం. కోతులుగా మొదలైన ప్రయాణం కాలం కరిగే కొద్దీ, జరిగే కొద్దీ నిదానంగా మనుషులై కూచున్నారు. ఒక్కోరోజు గడిచే కొద్ది తెలివి పెంచుకున్నారు. రాణులు, రాజులు పోయి తమను తామే ప్రజాస్వామ్యమని ఏలుకుంటు న్నారు. ఎప్పుడూ బలమైనోళ్ళే ఏలుతున్నారు దానికి రకరకాల పేర్లు పెడుతున్నారు. అలా కాలం గడిచే కొద్దీ తమను తాపు పాలిం చుకోవడమే కాదు, తామందరూ సమానంగా పంచుకునే రోజులొస్తాయి. భూమి అందరిది, పనిముట్లు అందరివి, పని అందరిది, శ్రమ అందరిది, ఉత్పత్తి అందరిది, సంపాదన కూడా అందరిది, ఆస్తులు అందరివి. ఇలా కాలం గడిచే కొద్దీ మనుషుల్లో వచ్చే మార్పే అది. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని మహా కవి అందుకే చెప్పాడు. అప్పుడు పాత కాలానికి బై బై చెప్పి కొత్త కాలానికి వెల్‌కమ్‌ అంటూ స్వాగతం పలుకుతారు. కాలమంటే మార్పు అని అప్పుడు అందరూ తెలుసుకుంటారు మరి. ఆ కాలం వైపు పరిగెత్తడానికి మరో సంవత్సరం వస్తోంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్‌…
జంధ్యాల రఘుబాబు
9849753298