– దేశాన్ని వీడకుండా లుక్‌ఔట్ నోటీసులు
– ఫెమా ఉల్లంఘనలపై ఇడి తీవ్ర చర్యలు
న్యూఢిల్లీ : ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్‌ను ఏర్పాటు చేసి కరోనా కాలంలో అత్యంత గుర్తింపు పొందిన ఆ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ పరిస్థితి తారుమారైంది. విదేశీ మారకం ద్రవ్యం చట్టం (ఫెమా) నిబంధనలు ఉల్లఘించిన ఆరోపణల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీవ్ర చర్యలకు దిగింది. విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తూ రవీంద్రన్‌కు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో ఇడి సోదాలు జరిపింది. దాదాపు రూ.9,362 కోట్ల లావాదేవీల విషయంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే రవీంద్రన్‌పై ఆన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్య్కూలర్ అమల్లో ఉంది. విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇడికి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్ సర్క్యులర్ జారీ అవడంతో ఇకపై దేశం విడిచి వెళ్లడానికి ఆస్కారం ఉండదు.
ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బైజూస్‌కు తాజా ఇడి చర్యలు మరింత ప్రతికూలతను పెంచనున్నాయి. నగదు లభ్యత సమస్యలతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి దిగజారింది. ఏడాది క్రితం బైజూస్ విలువ రూ.1.80 లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఇది రూ.16,500 కోట్లకు పడిపోయింది. మరోవైపు రవీంద్రన్‌ను తొలగించడానికి కొందరు ఇన్వెస్టర్లు అసాధారణ స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త బోర్డు ఏర్పాటు కోసం ఈ నెల 23న ఈ బోర్డు సమావేశం కావాల్సి ఉంది. దీన్ని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో బైజూస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం బోర్డు సమావేశానికి అనుమతించింది. అయితే.. తదుపరి విచారణ వరకు బోర్డు నిర్ణయాలను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇడి తాజా లుక్‌ఔట్ నోటీసుల పరిణామంతో బోర్డులో రవీంద్రన్‌కు మరింత ప్రతికూలత ఎదురుకానుంది.