– రవీంద్రన్‌ను మార్చాలని ఇన్వెస్టర్ల డిమాండ్
న్యూఢిల్లీ: ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ అయినా బైజూ రవీంద్రన్‌పై ఇన్వెస్టర్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టమ వుతోంది. రవీంద్రన్‌ను సంస్థ సారథి నుంచి తొలగించాలని పట్టుబడు తున్నారని సమాచారం. ఇందుకోసం ఇన్వెస్టర్లు అందరూ ఏకమై తక్షణ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి గురువారం నోటీసును ఇచ్చారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న ఆ సంస్థ, రవీంద్రన్‌కు తాజా పరిణామం మరిన్ని చిక్కుముడులకు కారణం కానుంది. బైజూస్‌కు నోటీసులు ఇచ్చిన వాటిలో జనరల్ అట్లాంటిక్, ప్రోసస్ వెంచర్స్, పీక్ ఎక్స్‌వి, చాన్ జుకర్ బర్గ్ ఇన్షియే టివ్ తదితర ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఉన్నాయి. నోటీసు జారీ చేసిన సంస్థలకు బైజూస్‌లో 30 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ బోర్డును పునర్‌వ్య వస్థీకరించాలని, సంస్థ సిఇఒగా ఉన్న రవీంద్రన్‌ను తొలగించాలని భావిస్తు న్నాయని సమాచారం. కాగా.. కంపెనీ సిఇఒగా రవీంద్రన్‌కు వ్యతిరేకంగా ఇన్వెస్టర్ సంస్థలు ఒక్కటి కావడం ఇదే తొలిసారి. దీనికి రవీంద్రన్‌కు, బోర్డు సభ్యులకు మధ్య విభేదాలు నెలకొనడమే కారణమని తెలుస్తోంది. గతేడాది జూన్ నెలలో ప్రొసస్, పీక్ ఎక్స్ వి పార్టనర్స్, చాన్ జుకర్‌బర్గ్ ఇన్షియేటివ్ కంపెనీల ప్రతినిధులు బైజూస్ బోర్డు నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కాలంలో రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్ నాథ్, సోదరుడు రిజు రవీంద్రన్ మినహా మిగతా బోర్డు సభ్యులంతా తప్పుకున్నారు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న బైజూస్ భవితవ్యంపై పెట్టుబడి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంస్థలో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఇన్వెస్టర్లు ఆగ్రహంగా ఉన్నారు.