బాల సాహిత్యంలో ‘బైరోజు’ సోదర కవులు

'Byrozu' brother poets in children's literatureబాల సాహిత్యంలో ఇటీవల కొత్త సంతకాలెన్నో కనిపిస్తున్నాయి. తనదైన ముద్రను వేస్తున్నాయి. ఇటివల ఉమ్మడి పాలమూరు నుండి గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో బాల సాహితీవేత్తలు రావడం శుభపరిణామం. అనేక రూపాలు, ప్రక్రియల్లో ఇక్కడి కవులు, రచయితలు తమ రచనలు వెలువరించి తెలుగు బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. వారిలో కవిత్వం, వచనం, గేయం, పద్యం, వ్యాఖ్యాన రంగాల్లో రాణిస్తూనే బాల సాహిత్యాకాశంలోనూ కొత్తసంతకం చేసిన సోదర కవులు బైరోజు చంద్రశేఖర్‌, బైరోజు రాజశేఖర్‌లు. బైరోజు చంద్రశేఖర్‌ 6 జూన్‌, 1970 న జన్మించారు. బైరోజు రాజశేఖర్‌ 20 జులై, 1974 న జన్మించారు. నేటి కొల్లాపూర్‌ జిల్లా కొల్లాపూర్‌ తాలూకాలోని పెంట్లపల్లి బైరోజు సోదరుల స్వస్థలం. శ్రీమతి బైరోజు వేదవతి – శ్రీ బైరోజు దామోదరాచార్య స్థపతి వీరి తల్లిదండ్రులు. సంగీతం, సాహిత్యం, లలితకళల్లో అభినివేశనం తండ్రి నుండి వారసత్వంగా పొందారీ సోదరులు. వృత్తిరీత్యా వీరిద్దరూ ఉపాధ్యాయులు.

పద్యాన్ని అత్యంత ప్రతిభావంతంగా రాసే ఈ సోదర కవులు తమ రచనలను పుస్తకాలుగా వెలువరించారు. ‘శ్రీ చతుర్భాహుమాత! సర్వేశుపత్ని!/ శక్తి రూపిణి! శివదేవి! శరణుమనుచు/ నిన్ను గీర్తింపబూనితి నీరజాక్షి!/ జోతలందుకో మాయమ్మ! జోగులాంబ’, ‘తుంగభద్రమ్మ ఉరకల త్రుళ్ళిపడుచు/ నీదు పాదాల దాకంగ మోదమంది/ నిండు దీవెనలిచ్చెడు నిమిషమాంబ!/ జోతలందుకో మాయమ్మ! జోగులాంబ’ అంటూ రాజశేఖర్‌ తేటగీతులను అందంగా రాశాడు. ‘శ్రీకరంబగు నాదు తెలంగాణ సీమలో/ శ్రీవాణి శిరమెత్తి నిలిచినాది/ రసరమ్య కావ్యముల్‌ ప్రభవించే నీ చోట/ ఘనతరంబగు కవుల, కలవులందు’ అంటూ కవులకు చంద్రశేఖర్‌ కైమోడ్పులు అందిస్తాడు. అనేక పురస్కారాలు, సత్కారాలు, గౌరవాలతో పాటు 2015 లో ఉత్తమ సాహితీవేత్తగా, ఉత్తమ శిల్పిగా రాజశేఖర్‌ పురస్కారాలు అందుకున్నారు. చంద్రశేఖర్‌ కూడా ఉపాధ్యాయులుగా, కవిగా సత్కారాలు పొందారు. ‘చిరుజల్లు’, ‘వసంతవ’, ‘సారథి’ రాజశేఖర్‌ అచ్చయిన రచనలు. ఈ సోదరకవులు స్వీయ రచనలు చేడమే కాక తాము పనిచేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థులతో రచనలు చేయించారు. చిత్రబంధ కవిత్వానికి చిత్రాలు గీయడంలో ఈ కవి సోదరులు సిద్ధహస్తులు.
కవితలు, భావగీతాలు, పద్యాలు, వ్యాసాలు, దేశభక్తి గేయాలు, పాటలతో పాటు బాల గీతాలు రాస్తున్నారీ అన్నదమ్ములు. ఇటీవల ఈ సోదర కవులు జంటగా వెలువరించిన పిల్లల పాటల సంపుటి ‘బాల గేయాలు.’ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, తెలుగు సాహిత్యంలో సోదర కవులు, జంట కవులు గురించి మనం చదువుకున్నాం. అయితే బాల సాహిత్యంలో జంటకవులు తక్కువగా కనిపిస్తారు. వారిలో ఈ సోదరకవులు ఒకరు. ‘చిన్ని పిల్లలం వాడని మల్లెపువ్వులం/ చెంగు చెంగున ఎగురుకుంటూ లేగ దూడను ఓడిస్తాం/ ఆటలెన్నో ఆడుతాం-పాటలు బాగా పాడుతాం/ ఎరకలు వేసే లేడి పిల్లలను పరుగులు తీసి ఓడిస్తాం’ అంటూ చిన్న పిల్లల పోటీ తత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచే ఈ చక్కని పాటను ఈ సోదరులే కూర్చారు. బాలగేయాల ఈ సంపుటిలోని ఒక్కో గేయం ఒక్కో విషయాన్ని వినూత్నంగా చెబుతుంది. అమ్మ పట్నం వెళ్లినా, పొరుగూరు వెళ్లినా పిల్లల సంతోషం చెప్పలేనిది. దీన్నే తమ గేయంలో ‘అమ్మ పట్నం వెళ్లింది ఆట బొమ్మలు తెచ్చింది’, ‘అమ్మ పట్నం వెళ్లింది తియ్యని పండ్లు తెచ్చింది/ నోరూరించే జామ పండ్లను ఒక్కొక్కటిగా ఇచ్చింది’ అంటూ చెబుతారు. అమ్మ గురించి, పిల్లల గురించి ఎవరు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అది అద్భుతంగా ఉంటుంది. ‘పిల్లలం మేం పిడుగులం/ మల్లెలం వాడని పువ్వులం/ కల్లా కపటం ఎరుగని వాళ్లం/ తెల్లని మనసు కలిగిన వాళ్లం/ చదువులు బాగా చదువుతాం/ అమ్మానాన్నకు పేరును తెస్తాం’ అంటున్నారు. పిల్లలు, వాళ్ళ నువ్వుల గురించి ఇలా చెబుతారు- ‘బాపూజీకి మా నవ్వులు ఇష్టం/ నెహ్రూజీకి మేమంటేనే ఇష్టం’ అంటూ. ఒక పాటలో పక్షుల కూతలు, అరుపులను పిల్లలకు చెబితే, మరో గీతంలో గణితాల గమ్మత్తును పాటగా చెబుతారు. ‘… బిందుబిందువులన్నింటిని కలిపితే… అది రేఖవుతుంది/ అంత్య బిందువులు కలిగించిందంటే రేఖా ఖండంమవుతుంది’ అని సాగుతుందా లెక్కల పాట. పద్యం పైన, మాత్రా ఛందస్సుపైన ఈ సోదరులకున్న సాధికారత గేయాలను లయాత్మకంగా మలిచాయి. ‘బుడిబుడి నడకల బుడ్డోడు/ కిలకిల నవ్వుల చిన్నోడు/ వడివడి అడుగుల మొనగాడు/ గలగల మాటల పిల్లోడు’ వంటి గేయం అటువంటిదే. ఇందులో ‘పలక’ గురించి చక్కని గేయం ఉంది. ‘నా చిట్టి పలక/ నల్లని పలక/ ఓనమాలు నాకు/ నేర్పిన పలక … పలక బలపం ఉంటే/ చదువుకు ప్రాణం/ లక్ష్యాన్ని చేరేటి/ సులువైన మార్గం’. బాలల కోసం చక్కని గేయాలను అందించడమేకాక, బాల సాహిత్య వికాస కార్యకర్తలుగా కూడా పిల్లలతో రచనలు చేయిస్తున్నారీ సోదరులు. మొన్న పుట్టినరోజు జరుపుకున్న చంద్రశేఖర్‌కు, వచ్చేనెల జరుపుకోనున్న రాజశేఖర్‌కు పుట్టినరోజు జేజేలు.

– డా|| పత్తిపాక మోహన్‌
9966229548