ఎన్నికల కోడ్‌కు ముందే సీఏఏ ?

CAA before Election Code?– ఇస్లామిక్‌ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం
– మతాన్ని నిరూపించే పత్రాన్ని సమర్పించాలి
– మతపరమైన వేధింపులపై ఆధారాలు అవసరం లేదు
– 15 రోజుల్లో నిబంధనలు నోటిఫై అవుతాయి : హోం శాఖ వర్గాలు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించిన నిబంధన ల ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని 2019లోనే పార్లమెంట్‌ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమ య్యాయి. రానున్న పదిహేను రోజుల్లోనే సీఏఏ అమలు నిబంధనలను నోటిఫై చేయవచ్చునని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ‘నేను కచ్చితమైన తేదీని చెప్పలేను. కానీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే నిబంధనలను నోటిఫై చేస్తాము’ అని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఎన్నికల తేదీలను ప్రకటించిన వెంటనే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. సీఏఏను నాలుగు సంవత్సరాల క్రితమే ఆమోదించినప్పటికీ నిబంధనలను నోటిఫై చేయకపోవడంతో అది అమలుకు నోచుకోలేదు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుండి వలస వచ్చిన ముస్లిమేతరులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు అయి ఉండాలి. పైన తెలిపిన మూడు ఇస్లామిక్‌ దేశాల్లో ఈ మతాలకు చెందిన వారు వేధింపులకు గురవుతున్నారని అభిప్రాయపడుతున్న ప్రభుత్వం వారికి పౌరసత్వం మంజూరు చేయాలని భావిస్తోంది.
దరఖాస్తుదారులు 2014 డిసెంబర్‌ 31వ తేదీకి ముందు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుండి భారత్‌కు వలస వచ్చారని ధృవీకరించేందుకు ఏయే పత్రాలు అవసరమవుతాయన్న విషయాన్ని నిబంధనల్లో నోటిఫై చేస్తారు. ఆ పత్రాన్ని భారత ప్రభుత్వం జారీ చేసి ఉండాలి. అది 2014 డిసెంబర్‌ 31 లోగా పొంది ఉండాలి. ‘ఉదాహరణకు ఎవరైనా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారని అనుకోండి. అతను తన మతాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఎవరైనా 2014 డిసెంబర్‌ 31వ తేదీకి ముందు ఆధార్‌ పొంది ఉండి, చట్టంలో ప్రభుత్వం నిర్దేశించిన ఆరు మతాలలో ఏదైనా ఒక దానికి తాను చెంది ఉన్నానని ప్రకటించి ఉంటే దానిని కూడా అంగీకరిస్తారు. అదే విధంగా మతాన్ని సూచించే ఏ పత్రమైనా ఆమోదయోగ్యమే’ అని హోం శాఖ వర్గాలు వివరించాయి.
సీఏఏ కింద దరఖాస్తులు సమర్పించడానికి కాలపరిమితి నిర్ణయించాలన్న అసోం డిమాండ్‌ను కూడా అంగీకరించవచ్చునని హోం శాఖ వర్గాలు తెలిపాయి. దరఖాస్తు చేసుకునేందుకు మూడు నెలల గడువు ఇస్తే సరిపోతుందని అసోం అభిప్రాయపడుతోంది. మతపరమైన వేధింపులకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని నిబంధనల్లో పొందుపరచకపోవచ్చు. ఎందుకంటే దేశంలోకి వలస వచ్చిన వారందరూ వేధింపులకు గురైన వారేనని లేదా వేధిస్తారేమోనన్న భయంతో వచ్చిన వారేనని ప్రభుత్వం భావిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల లోగానే సీఏఏను అమలు చేస్తామని పలువురు కేంద్ర మంత్రులు ఇటీవలి కాలంలో ప్రకటిస్తు న్నారు. పశ్చిమ బెంగాల్‌లో గత సంవత్సరం డిసెంబర్‌ 26న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘సీఏఏపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వలసవాదులను తరచుగా తప్పుదోవ పట్టిస్తున్నారు. మీకు స్పష్టం చేస్తున్నాను. సీఏఏను అమలు చేసి తీరతాం. దానిని ఎవరూ ఆపలేరు. ప్రతి వారికీ పౌరసత్వం లభిస్తుంది. అందుకు మా పార్టీ కట్టుబడి ఉంది’ అని చెప్పారు.