సీఏఏ ప్రక్రియ షురూ

సీఏఏ ప్రక్రియ షురూ–  పౌరసత్వం కోసం ఇప్పటికే ప్యానెల్స్‌ ఏర్పాటు
– ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ ప్రారంభం
న్యూఢిల్లీ: సీఏఏ కింద నిబంధనలను నోటిఫై చేసిన ఒక రోజు తర్వాత.. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్యానెల్స్‌, ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. సీఏఏ, 2019 కింద అర్హత ఉన్న వ్యక్తులు ఈ పోర్టల్‌లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర హౌం శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అప్లికేషన్లను సులభతరం చేయటానికి త్వరలో మొబైల్‌ యాప్‌ కూడా ప్రారంభించనున్నారు. పౌరసత్వం మంజూరుపై నిర్ణయం తీసుకోవటానికి మంత్రిత్వ శాఖ ఒక అధికార ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అలాగే పత్రాలను ధృవీకరించే జిల్లా స్థాయి కమిటీలను సైతం ఏర్పాటు చేసింది.
సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు
సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో ‘సర్బత్మక్‌ హర్తాల్‌’ (సంపూర్ణ సమ్మె)కు కాంగ్రెస్‌ నేతృత్వంలోని 16 పార్టీల యునైటెడ్‌ ప్రతిపక్ష ఫోరమ్‌ పిలుపునిచ్చింది. అయితే, ఈ ఫోరమ్‌ నాయకులకు గువహతి డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ లీగల్‌ నోటీసు జారీ చేయటం గమనార్హం.హర్తాళ్‌తో రోడ్డు దిగ్బంధనం, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు బలవంతంగా మూసివేయటం, ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్తులకు నష్టం జరిగే అవకాశం ఉన్నదని నోటీసులో పేర్కొన్నారు. ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌, 30 రాజకీయేతర సంస్థలు, అసోమ్‌ జాతీయతబడి యుబా చత్ర పరిషత్‌, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, రైజోర్‌ దళ్‌లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు చేపట్టాయి. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి పదుల సంఖ్యలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
‘రాజ్యాంగ విరుద్ధం..వివక్షపూరితం’
సీఏఏ అమలుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు పలుకుతున్నారు. నోటిఫై చేసిన నియమాలు ”రాజ్యాంగ విరుద్ధమైనవి..వివక్షపూరితమైనవి” అని అన్నారు.