– 8 నుంచి అసెంబ్లీ
– కులగణనకూ ఓకే…
– వాహన రిజిస్ట్రేషన్లు ‘టీజీ’గా మార్పు
– తెలంగాణతల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు
– రాష్ట్రగీతంగా అందెశ్రీ రాసిన ‘జయజయహే తెలంగాణ’
– సత్ప్రవర్తన ఖైదీలకు క్షమాభిక్ష
– సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ కీలక నిర్ణయాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాల అమలును మంత్రివర్గం ఆమోదించింది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. పై రెండు హామీల అమలును అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రకటిస్తారు. దానితో పాటు పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. 8 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత ధన్యవాద తీర్మానం ఉంటాయి. మరుసటి రోజు ఆర్థిక మంత్రి శాసనసభలో ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధరబాబు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందనీ, దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రస్తుత మంత్రివర్గ సమావేశంలో బీజం పడిందనీ, వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న విస్తరణ అధికారుల (ఏఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. గత పాలనలోని రాచరిక పోకడలను తుడిచేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయించామన్నారు. వాహన రిజిస్ట్రేషన్ల కోసం గతంలో కేంద్రం ప్రకటించిన గెజిట్ ప్రకారం ఇకపై ‘టీజీ’ పేరుతో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పారు. కేంద్ర గెజిట్‌ను ఉల్లంఘిస్తూ గత ప్రభుత్వం ‘టీఎస్’ పేరుతో రిజిస్ట్రేషన్లు చేసిందన్నారు. రాష్ట్ర అధికారిక గీతంగా ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రకటించారు. కొడంగల్ ప్రాంత అభివద్ధి సంస్థను ఏర్పాటు చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్ర నూతన హైకోర్టు భవన నిర్మాణం కోసం వంద ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్‌డేట్ చేసేందుకు ఆమోదం లభించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలనే నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది.