నవతెలంగాణ-కంఠేశ్వర్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్టు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. వీలైనంత త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. దసరా కానుకగా జిల్లాకు త్వరలోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కళాశాల మంజూరు చేయించనున్నట్టు తెలిపారు. మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 50వేల వరకు ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. రుణ మాఫీ విషయంలో ప్రతిపక్షాలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సోషల్ మీడియాని సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారని, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తాత్కాలిక ఆనందం ఇచ్చినా దీర్ఘకాలికంగా బీఅర్‌ఎస్‌కు నష్టం జరుగుతుందన్నారు. జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై త్వరలో సీఎంతో చర్చిస్తామని తెలిపారు. ప్రాణహిత 20, 21వ ప్యాకేజీ పనులు వేగవంతం చేయిస్తామన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల ఆవశ్యకత ఉందని, స్టేడియం నిర్మాణానికీ ప్రయ త్నం చేస్తున్నట్టు చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజలను మభ్యపెడుతున్నాయ ని, ఆర్‌వోబీ విషయంలో కేంద్రం నిర్లక్షంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్ స్మార్ట్ సిటీ కావాల్సిన అవసరం ఉందని, ఎంపీ అరవింద్ ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మెన్ మానాల మోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తహెర్ బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, నుడా చైర్మెన్ కేశ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.