– శాంతిని నెలకొల్పండి : ఈస్టర్ సందర్భంగా పోప్ పిలుపు
– శాశ్వత కాల్పుల విరమణకు మూడు దేశాల పిలుపు
గాజా : ఇజ్రాయిల్, హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు ఈజిప్ట్ రాజధాని కైరోలో ఆదివారం చర్చలు పునరుద్ధరించారు. ఇజ్రాయిల్ గాజాలో కాల్పుల విరమణపై కైరోలో చర్చలు ప్రధాని బెంజామిన్ నెతన్యాహు అంగీకరించిన కొద్ది రోజుల తర్వాత ఆదివారం చర్చలు ప్రారంభమయ్యాయని ఈజిప్ట్ భద్రతా వర్గాలు ధ్రువీకరించాయి. జర్నలిస్టుల శిబిరంపై ఇజ్రాయిల్ బలగాలు జరిపిన దాడిలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు గాజాలో 32,782మంది మరణించగా, 75,298మంది తీవ్రంగా గాయపడ్డారు.
శాంతిని నెలకొల్పండి : పోప్
యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో తక్షణమే శాంతి నెలకొనాలని, కాల్పుల విరమణ పాటించాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. ఈస్టర్ సందర్భంగా ఆయన ఈ సందేశం ఇచ్చారు. సెయింట్ పీటర్స్ బసిలికాలో సెంట్రల్ బాల్కనీ నుండి ఆయన నగర, ప్రపంచ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా శాంతిని నెలకొల్పడంపైనే దృష్టి పెట్టాలని కోరారు. ఇంకా చిన్నారుల కళ్లలో కష్టాలను, దైన్యాన్ని ఎన్నాళ్లు చూడాలి? అని ఆయన ప్రశ్నించారు. యుద్ధ ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లలు నవ్వడం మరిచిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎందుకు ఈ మరణాలు? ఎందుకు ఈ విధ్వంసం? అని వారు మనల్ని ప్రశ్నిస్తున్నారు. యుద్ధం అనేది ఎల్లప్పుడూ అసంబద్ధమేనని’ అన్నారు.
గాజాలో శాశ్వత కాల్పుల విరమణకై పిలుపు
గాజాలో తక్షణమే, శాశ్వత కాల్పుల విరమణ జరగాలని ఈజిప్ట్, ఫ్రాన్స్, జోర్డాన్ పిలుపునిచ్చాయి. హమాస్ చెరలో వున్న బందీలందరినీ విడుదల చేయాలని కోరాయి. కైరోలో శనివారం ఈ మూడు దేశాల దౌత్యవేత్తలు సమావేశమయ్యారు. అనంతరం వారు ముగ్గురు సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఈ యుద్ధానికి రాజకీయ పరిష్కారంగా తమ ప్రభుత్వం భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ స్టెఫాన్ సెజర్న్ తెలిపారు. రెండు దేశాల పరిష్కార మార్గానికి అవసరమైన అన్ని ప్రామాణికాలను ఇందులో పొందుపరచనున్నట్లు తెలిపారు.