కలకత్తా, నన్ను వెలివెరు

Get me out of Calcuttaకలకత్తా, నువ్వు నన్ను బహిష్కరించేట్టయితే
నేను వెళ్లేలోగా నా పెదాలను గాయపరుచు
కేవలం పదాలు మాత్రమే మిగిలి వున్నాయి
నా పెదవులపై నీ మదవైన
చేతివేళ్ల స్పర్శతో పాటు
కలకత్తా, నేను రాత్రిలోకి జారుకునేలోగా
నా కళ్లను తగులబెట్టెరు

ధాకురియా పక్కసందులో తలలేని శవం
దెబ్బతిన్న యువకుడు
తన మెదడును వెదజల్లాడు
పొంచి వున్న నిశ్శబ్దం
నిన్ను పాతల్‌ డంగా దారిలోకి తీసుకెళ్తుంది
అక్కడ, నీపై పగ ద్వేషం లేకపోయినా
వాళ్లు తుపాకీతో కాల్చి పారేస్తారు

కలకత్తా, నువ్వు నన్ను
బహిష్కరించేట్టయితే
నేను వెళ్లేలోగా నా కళ్లను కాల్చు
వాళ్లు నిన్ను అక్టెర్లోనీ
స్మారక స్ఠూపం నుంచి కిందకు లాగి
ఉబికిన వక్షోజాల క్రిందనున్న
ప్రతి పక్క టెముకనీ విరగ్గొడతారు
ఆగ్రహంతో పెల్లుబికిన
నీ కళ్ల నుంచి వేదనను పెకలిస్తారు
తొడల మధ్య బొయోనైట్‌ దించుతారు

కలకత్తా, వారు నిన్ను
జరాసంధుడినిలా చీలుస్తారు
వాళ్లు నీ చేతులను ఇరువైపులా కట్టి
పదాలు లేని శిలువకు నిన్ను వేళాడదీస్తారు
నీ మౌనం నిరసన తెలిపినప్పుడు
వాళ్లు అన్ని పదాలనూ ఉరి తీస్తారు
అలా మీరు కలకత్తాను కలిసి,
కలగలిసిపోతారు
అప్పుడే వాళ్లు నిన్ను తగులబెట్టేస్తారు

కలకత్తా, నీ తొడలలో
దాచుకున్న ప్రతీకారాన్ని
నిశ్శబ్దంగా మాంసం
కనబడకుండా తగలడిపోనీ
నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే
రిక్షా ఎక్కి సోనాగచ్చివెళ్లు

చావడానికి సిద్ధంగా వున్న ఆడవాళ్ల కళ్లల్లో
నీ గర్వాన్ని చల్లార్చుకో
ఉజ్జల థియేటర్‌ బయట
నా కోసం వేచివుండు
తన గాయాలను మత్యువు, ఆకలి
సోకక ముందే పిచ్చివాడైన
చేతుల్లేని కుష్టువాని నెత్తురు
నీ కోసం తీసుకొస్తాను

కేవలం విసుగెత్తిపోయి
చిత్పూర్‌ దగ్గర మరణించిన
ఆమె అలసటను చూపిస్తాను

ఎప్పుడూ రాని శంగార రహిత యుద్ధం కోసం
బుర్రాబజార్‌ బోనులలో
ముడతలుపడ్డ ముఖాలలో
మోహాన్ని దాచేసుకున్న
వద్ధ కన్యలను చూపిస్తాను
శీతాకాలం వారి తొడల మధ్య
ప్రవేశించిన తరువాత
వారి కళ్లలో మిగిలిన కామాన్ని చూపిస్తాను

కలకత్తాను కళ్లలో పొదవుకుని మరణించిన
వీధి వ్యాపారిని కూడా చూపిస్తాను
కలకత్తా, నువ్వు నన్ను బహిష్కరించేట్టయితే
నేను వెళ్లేలోగా నా చిత్తశుద్ధిని తగలెట్టెరు

(ఈ నెల 8వ తేదీన కార్డియాక్‌ అరెస్ట్‌తో కన్నుమూసిన ప్రముఖ కవి, చిత్రకారుడు, జర్నలిస్ట్‌, ఫిల్మ్‌ మేకర్‌, రాజకీయవేత్త ప్రీతిష్‌ నందికి నివాళి)

ఇంగ్లీష్‌ : ప్రితిష్‌ నంది
తెలుగు : దేశరాజు