శాంతించిన గోదావరి

– భద్రాచలం ఏజెన్సీలో తగ్గుముఖం
– ఊపిరి పీల్చుకున్న ఏజెన్సీ వాసులు
– పునరావాస కేంద్రాల్లోనే వరద బాధితులు
– రాకపోకలు పునరుద్ధరణ
నవతెలంగాణ – భద్రాచలం
ఉరుకులు, పరుగులతో ఏజెన్సీ వాసులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసిన గోదారమ్మ ఎట్టకేలకు శాంతించింది. శనివారం అర్ధరాత్రి నుంచి గోదావరి తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద 53 అడుగులు దాటి గోదావరి ప్రవహించడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన విషయం విదితమే. 56 అడుగుల పైగా గోదావరి ప్రవహించింది. కానీ ఆదివారం ఉదయం 9 గంటలకు 54.70 అడుగులు ఉన్న గోదావరి, మధ్యాహ్నం ఒంటిగంటకు 53.10, 6 గంటలకు 50.90 అడుగులకు చేరి రాత్రి 7 గంటలకు 54.40 అడుగులకు తగ్గింది. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో పలు ప్రధాన రహదారులపైకి చేరిన వరద నీరు తొలగడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాకపోకలకు వీలు కలిగింది. వరద బాధితులు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు.
పూర్తిస్థాయిలో గోదావరి తగ్గుముఖం పట్టే వరకు, పరిశుభ్రత చర్యలు చేపట్టే అంతవరకు ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. పూర్తిస్థాయిలో గోదావరి తగ్గుముఖం పట్టిన అనంతరం ఎవరెవరి ఇండ్లు ముంపుకు గురయ్యాయో, పంట నష్టంపై అధికారులు సర్వే జరిపి త్వరలోనే అంచనాలు వేయనున్నారు.
బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీలో పునరావాస కేంద్రాన్ని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సందర్శించి బాధితుల సమస్యలు తెలసుకున్నారు. బూర్గంపాడు జెడ్పీటీసీ మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు బాధితులకు నిత్యావసర సరకుల పంపిణీ చేశాయి. భద్రాచలం, బూర్గంపాడు మండలంలోని పలు గ్రామాలకు రోడ్లపై వరద నీరు తగ్గడంతో రాకపోకలు కొనసాగిస్తున్నారు. మున్నేరు ముంపు ప్రాంతాలైన ఖమ్మం నగరంలోని మోతీనగర్‌, దంసలాపురం, అగ్రహారం, బొక్కల గడ్డ, ఖమ్మం రూరల్‌ మండలం జలగంనగర్‌, పెద్ద తండాలో పట్టణానికి చెందిన పల్లా కిరణ్‌కుమార్‌ నిత్యావ సరాలు, దుస్తులు పంపిణీ చేశారు. అశ్వాపురం మండలంలోని ముంపు ప్రాంతాల్లో టీపీసీసీ సభ్యులు పోలేబోయిన శ్రీవాణి పర్యటించారు.