ప్రశాంతంగా నిమజ్జనం 80 శాతం పూర్తి : డీజీపీ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో గణేశ్‌ ప్రతిమల నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరుగుతున్నదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ గురువారం రాత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల గణేశ్‌ మండపాలు వెలిశాయని ఆయన అన్నారు. చివరి 11వ రోజున హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండతో పాటు నిజామాబాద్‌, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ ఎత్తున విగ్రహాలు నిమజ్జనానికి తరలాయని తెలిపారు. లక్షలాది మంది ప్రజలు నిమజ్జనోత్సవ వేడుకలను తిలకించటానికి ట్యాంక్‌బండ్‌తో పాటు ఇతర చెరువులు, తటాకాల వద్దకు చేరుకొని వీక్షించి ఆనందించారని ఆయన అన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిమజ్జనోత్సవం సాగిందని ఆయన అన్నారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగటానికి అన్ని వర్గాల ప్రజలు ఎంతగానో సహకరించారనీ, అలాగే గణేశ్‌ మండపాల నిర్వాహకులు సైతం పోలీసులకు తగిన సహకారాన్ని అందించారని ఆయన అన్నారు.
మంత్రులతో ఏరియల్‌ సర్వే
మూడు కమిషనరేట్ల పరిధులలో సాగిన నిమజ్జనోత్సవాన్ని హెలికాప్టర్‌లో రాష్ట్ర హౌం మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు తాను, నగర పోలీసు కమిషనర్‌ సి.వి ఆనంద్‌లు ఏరియల్‌ సర్వేను నిర్వహించటం జరిగిందని డీజీపీ తెలిపారు. లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న నిమజ్జనోత్సవం ఎలాంటి విఘాతం లేకుండా సాగటానికి పోలీసు, విద్యుత్‌, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో చేసిన కృషి, ఏర్పాట్లు సత్ఫలితాలను ఇచ్చాయని ఆయన అన్నారు. అర్ధరాత్రి నాటికి 90 శాతానికి పైగా నిమజ్జనోత్సవం పూర్తవుతుందనీ, మిగిలినవి శుక్రవారం ఉదయానికి పూర్తవుతాయని తెలిపారు. ప్రశాంతంగా నిమజ్జనం సాగటానికి ఐపీఎస్‌ అధికారులు మొదలుకొని కానిస్టేబుల్‌, హౌంగార్డుల వరకు శ్రమించారనీ, అందుకు వారందరికి అభినందనలు తెలుపుతున్నట్టు అంజనీకుమార్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనోత్సవం పూర్తయ్యేంత వరకు బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ నుంచి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేలాది సీసీ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించటం జరుగుతున్నదని ఆయన వెల్లడించారు.