– నిరుత్సాహపర్చిన మోడీ రోడ్డు షో
– దాదాపు మూడు గంటలు వేచి ఉన్న బీజేపీ శ్రేణులు
– మాట్లాడకుండా కేవలం అభివాదం చేస్తూ వెళ్లిపోయిన ప్రధాని
– ఎందుకు వచ్చారు.. ఎందుకు వెళ్లారు.. అంటూ నైరాశ్యంలో రాష్ట్ర నేతలు
– మోడీ మౌన రోడ్ షో అంటూ పెదవి విరుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరిలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిరాశపర్చింది. మోడీ రాక కోసం దాదాపు మూడు గంటల వరకు వేచి ఉన్న మహిళలు ఆయన ఎందుకు వచ్చారు.. ఎందుకు వెళ్లారు.. అంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 6.15కు ప్రారంభమైంది. మిర్జాలగూడ చౌరస్తా నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు దాదాపు 1.3 కిలో మీటర్లు మోడీ రోడ్ షో కొనసాగింది. గోషామహల్తో సహా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ శ్రేణులను మూడు గంటల ఆలస్యం ఇబ్బందులకు గురిచేసింది. ప్రధాని మోడీ జిల్లాకు ఏమైనా వరాల జల్లు కురిపిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. అయితే రోడ్ షోలో నాయకులు, కార్యకర్తల హడావుడి జోరుగా కనిపించింది.
బారికేడ్లు ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బందులు..
మోడీ పర్యటనను పురస్కరించుకుని బందోబస్తు పేరిట మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని పలు ప్రాంతాలను, ప్రధాన రోడ్లను దిగ్బంధించారు. ట్రాఫిక్ అంక్షలూ విధించారు. బారీకేట్లు ఏర్పాటు చేసి రహదారులపై ప్రత్యేక నియంత్రణా చర్యలు చేపట్టారు. మల్కాజిగిరి పరిసర ప్రాంతాల్లో మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్ బాగ్, జెడ్ టీఎస్, మిర్జాల్ గూడ, గౌతంనగర్, మినీ ట్యాంక్ బండ్, నేరేడ్ మెట్ ప్రాంతాల్లోని ట్రాఫిక్ మళ్లించారు. అలాగే ప్రధాన రహదారి పక్కన వాణిజ్య సముదాయాలను మూసివేశారు. దాంతో వివిధ పనులు, హాస్పిటల్స్, రోజువారీ కార్యక్రమాల కోసం బయటికి వెళ్లే బస్తీవాసులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల బందోబస్తు పేరిట నాయకులు ఓవర్ యాక్షన్ చేసినట్టు తెలిసింది. కొందరు నాయకులు మల్కాజిగిరి చౌరస్తా ప్రాంతంలో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేయడంతో మోడీని దగ్గర నుంచి చూడాలనుకున్న ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బీజేపీ శ్రేణుల కంటే ప్రధాని మోడీని చూడాలనే ఉద్దేశంతో చాలా మంది రోడ్ షోకు వచ్చారు.
ఉలుకు లేదు.. పలుకు లేదు..
రోడ్ షోలో ప్రధాని మోడీని అతిగా ఉహించుకున్న పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు నిరాశే మిగిలింది. రోడ్ షోలో మోడీ అభివాదమే తప్ప. ఉలుకు, పలుకు లేకుండా మౌనంగా రోడ్ షో ముగించటం పట్ల ప్రజలు అసహనానికి గురయ్యారు. ఈ రోడ్ షోలో ప్రధాని మోడీ వెంట బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్, సికింద్రాబాద్ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు, బీజేపీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రూరల్ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.