యాంటీ బయోటిక్స్‌ను నిరోధించలేమా?

మనిషికి ఔషధాలు ప్రాణావసరం. తయారీదారులకు ఇవి కామధేనువులు. వైద్యులకు కల్పతరువులు. ప్రజారోగ్య పరిరక్షణలో ఔషధ తయారీ పరిశ్రమలు, వైద్య, ఆరోగ్య సిబ్బంది కీలకపాత్ర పోషించాలి. ఔషధ నియంత్రణలో ప్రమాణాలన్నింటినీ నిర్దిష్టంగా పాటించాలి. అప్పుడే ప్రజారోగ్యానికి భద్రత. ఈ మూడింటి మధ్య అనుసంధానంలో ఎక్కడ లింకు తెగినా, అంతరాయాలేర్పడినా, వారు కట్టుదాటినా అది ప్రజారోగ్య వ్యవస్థనే కుప్పకూలుస్తుంది. అలాంటి పరిస్థితులిప్పుడు ఫార్మా రంగ ప్రమాదకర పోకడల వల్ల ఏర్పడుతోంది. ఇండియా, ఖతార్‌, యూకేలకు చెందిన నూతన అధ్యయన బృందం ప్రచురించిన ఒక నివేదికలోని అంశాలు భారత్‌ ఫార్మా రంగంలోని ప్రమాదకర పోకడలను తేటతెల్లం చేసింది. భారత్‌లో అనుమతులు లేని, నిషేధించిన ‘స్థిర మోతాదు మిశ్రమం’ (ఫిక్స్‌ డోస్‌ కాంబినేషన్‌-ఎఫ్‌ఎసీ)తో కూడిన యాంటీబయోటిక్స్‌ అమ్మకాలు అపరిమితంగా ఉన్నాయని ఆ పరిశోధనా బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఫార్మా ఎన్టీసీ డేటా ప్రకారం 2020లో 60.5 శాతం ఎఫ్‌ఎసీ బయోటిక్స్‌ (239 ఫార్ములేషన్‌) అనుమతులు లేనివి. మరో 9.9 శాతం (39 ఫాడ్యులేషన్‌) నిషేధించినప్పటికీ.. అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో అతి ప్రమాదకరమైన యాంటీ బయాటిక్స్‌, వీటిలో అధిక మోతాదులో యాంటీ బ్యాక్టీరియల్‌ మైక్రో బయోలైన్‌ నిరోధకాలు (ఏఎంఆర్‌) ఉన్నాయి. ఈ ఎఫ్‌ఎసీ అనేది ఒకటికి మించిన స్థిర మోతాదు మిశ్రమం. ఇలాంటి సమ్మిళిత ఔష ధాలవల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కారణంగా ఎఫ్‌ఎసీల ఉత్పత్తికి శాస్త్రీయ, నిర్ణీత అనుమతుల ప్రక్రియ సంక్లిష్టం అవుతున్నది. అయితే, మనదేశంలో ఈ పరిశ్రమకు ఈ ఎఫ్‌ఎసీ ఎంతో ఇష్టమైంది. కాసులు కురిపించే కల్పతరువు. ప్రజారోగ్యాన్ని ఆ పరిశ్రమలు పెద్దగా పట్టించుకోవు. ఔషధాల ఉత్పత్తి ధరల నియంత్రణలో విధానాలు, లోపాలు పరిశ్రమల యాజమాన్యాలకు తెలుసు. మనదేశంలో డ్రగ్‌ ఫ్రైస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ అనే చట్టం మందుల ధరలను నిర్దేశిస్తుంది. డీపీసీఓ పరిధిలో ఈ ‘స్థిర డోస్‌ కాంబినేషన్‌’ లేదు. ఈ అవకాశాన్ని ఈ రంగం ఉపయోగించుకుంటోంది. తమకు తోచిన కాంబినేషన్లలో ఎఫ్టీసీలను ఉత్పత్తి చేసి మార్కెట్‌ లోకి జొప్పిస్తోంది. ఎంత ముప్పు ఏర్పడినా విచారణకు ఆస్కారం ఉండదు. డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ యాక్ట్‌ 1940 ఉన్నప్పటికీ, మహా అయితే మార్కెట్లో శాంపిల్స్‌ తీస్తే వాటిని నాణ్యత పరీక్షల కోసం తిరిగి తయారీదారులకే పరీక్ష నిమిత్తం పంపుతారు. ఏతావాతా వారి ఉత్పత్తులకు వాళ్లే తయారీ, పంపిణీ, శాంపిల్స్‌ తనిఖీ ప్రమాణాలన్నిటికి వారే సర్వాధికారులు. ఈ ఎఫ్‌ఎసీల ఉత్పత్తివల్ల ఆయా పరిశ్రమలకు మరో ప్రయోజనం ఉంది. వాటి ధరలను ఆయా సంస్థలు తమ ఇష్టానుసారం నిర్ణయించుకోవచ్చు. దండుకోవచ్చు. ఇలా రోగులను ఆరోగ్యపరంగానూ, ఆర్థికంగానూ పీల్చిపిప్పి చేస్తున్నారు.
దీనిపై 1978లోనే మొదటి ప్రభుత్వ అధ్యయన కమిటీ అధ్యయనం చేసి సమస్య ఉన్నట్లు అంగీకరించింది. డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ యాక్ట్‌ 1940 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి డ్రగ్స్‌ భద్రత, నాణ్యతకు సంబంధించి ఇండియాలో అమ్మకాలపై 1982 వరకూ ఎలాంటి నియంత్రణా లేదు. స్టేట్‌ డ్రగ్‌ కంట్రోలర్స్‌ ఆధీనంలో ఆయా రాష్ట్రాల్లో డ్రగ్స్‌ తయారీ లైసెన్స్‌, నాణ్యత ప్రమాణాలు వగైరాలు ఉండేవి. అయితే 1982లో మన పార్లమెంటు చట్టం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు సంక్రమించాయి. అవి రోగ నివారణలో (థెరపీయూటిక్‌ వాల్యూ) న్యాయబద్ధంగా లేకుంటే వాటి తయారీని బహిష్కరించాలనేది. అనంతరం 1988లో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించింది. నూతన డ్రగ్స్‌ తయారీలో కావలసిన, ఉండాల్సిన అవసరమైన షరతులు విధించింది. దీని పరిధిలోకి ఎఫ్‌ఎసీలను తెచ్చింది. భద్రతకు సంబంధించిన ఆధారాలు, డ్రగ్స్‌ లోని మూలకాల పనితీరులాంటి వివరాలను ‘డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’ (డీజీసీఐ)కి సమర్పించాలి. దీని ప్రకారం స్టేట్‌ డ్రగ్‌ కంట్రోలర్స్‌ కొత్త డ్రగ్స్‌ తయారీ లైసెన్సు ఇవ్వరాదు. అవి డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వారి భద్రత, నిర్దేశిత ప్రయోగాల అనంతరం సత్ఫలితాల్ని బట్టి డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ప్రమాణాల అనుమతి మేరకే ఉత్పత్తి చేయాలి. చట్టం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తయారీ లైసెన్సులివ్వనప్పటికీ, స్టేట్‌ డ్రగ్స్‌ కంట్రోలర్స్‌ లైసెన్సులు ఇవ్వడం ఆశ్చర్యకరం.. వాస్తవానికి ఆయా చట్టాలను, నియమాలను ఉల్లంఘించినప్పుడు. డీసీజీఐ అనుమతి పొందకుండా ఉత్పత్తి చేసిన పరిశ్రమలను సాంకేతికంగా విచారించవచ్చు. ఈ క్రిమినల్‌ నేరాలన్నింటినీ. విచారించడానికి, తగు రీతిలో శిక్షించడానికి బదులు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.. పైపెచ్చు చట్టంలోని సెక్షన్‌ 26వ సెక్షన్‌ అడ్డం పెట్టుకుని వీటి తయారీ బహిష్కరణకు అడ్డు తగులుతున్నది. వాస్తవానికి 2020లో 239 ఎస్జీసీ ఔషధాలకు అనుమతి లేకుండానే ఉత్పత్తి చేసినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ఈ సమస్య ఆరంభమైన 42 సంవత్సరాల తర్వాత కూడా డ్రగ్‌ నియంత్రణ చట్టం నిరుపయోగంగా ఉండటం బాధాకరం. ఇప్పటికైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలి, ఆంక్షలు, నిబంధనల బంధనాలు వేయాలి. ప్రజారోగ్యం రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు తగినట్టుగా చట్టాలను కఠినతరం చేయాలి.
– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌