బెంగళూర్‌ పుంజుకునేనా?

బెంగళూర్‌ పుంజుకునేనా?– నేడు లక్నోతో ఆర్సీబీ పోరు
బెంగళూర్‌ (కర్ణాటక) : ఐపీఎల్‌లో సీజన్లు మారుతున్నా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ కథ మారటం లేదు. ఎప్పటిలాగే స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తుండగా.. సహచరుల నుంచి కనీసం మద్దతు లభించటం లేదు. దీంతో ఐపీఎల్‌17లో ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట బెంగళూర్‌ ఓటమి పాలైంది. ప్రతి జట్టు సొంతగడ్డపై విజయాలు సాధించగా.. ఆర్సీబీ మాత్రమే ఓటమి చవిచూసింది. తాజాగా నేడు సీజన్లో నాల్గో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో డుప్లెసిస్‌ సేన తలపడనుంది. రెండు మ్యాచుల్లో ఓ విజయంతో లక్నో సూపర్‌జెయింట్స్‌ మంచి ఊపుమీదుంది. చిన్న బౌండరీల చిన్నస్వామి స్టేడియంలో నేడు భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఆ ముగ్గురు మెరిస్తేనే : రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు విదేశీ క్రికెటర్లు డుప్లెసిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కామెరూన్‌ గ్రీన్‌ కీలకం. ఈ ముగ్గురు అంచనాల మేరకు రాణించటం లేదు. దీంతో ఆ జట్టు ఆశించిన పరుగులు సాధించటంలో తేలిపోతుంది. బ్యాటింగ్‌ లైనప్‌లో విరాట్‌ కోహ్లి ఒక్కడే పోరాటం చేస్తున్నాడు. డెత్‌ ఓవర్లలో దినేశ్‌ కార్తీక్‌ ధనాధన్‌ మెరుపులతో అదిరే ముగింపులను అందిస్తున్నాడు. కానీ ఇతర బ్యాటర్లు నిరాశపరుస్తున్నారు. సీజన్లో నాల్గో మ్యాచ్‌ ఆడుతున్న బెంగళూర్‌ బ్యాట్‌, బంతితో రాణించకపోతే కోలుకోవటం మరింత కష్టమవనుంది.