కార్చిచ్చు

 Sampadakiyamకాలిఫోర్నియా గాలిలో బలంగా వ్యాపిస్తోన్న ఘాటైన కవురు వాసన. అంతులేని కార్చిచ్చుల వల్ల పెరుగుతున్న ఆందోళన. కేవలం క్షణికమైన విపత్తు కాదు. భవిష్యత్‌ను కలవరపెట్టే అంశం. కాలిఫోర్నియా, లాస్‌ఏంజెల్స్‌లో ప్రకృతి దృశ్యం మండుతున్న నారింజ, బూడిద రంగులతో కూడిన భయంకరమైన వస్త్రం కప్పినట్లుగా కనిపిస్తోంది. ఇండ్లు, పొగమంచు శిథిలాలుగా మారాయి. పర్యావరణం నాశనమైంది. ఆర్థిక నష్టం, నిరాశ్రయ కుటుంబాల భావోద్వేగం వారి జీవితాలను మార్చలేనంతగా కమ్మేసింది. గత కొన్ని దశాబ్దాలుగా కార్చిచ్చులు, భూకంపాలు వంటి విపత్తులకు మానవులు కూడా సమాన బాధ్యులే. లాస్‌ ఏంజెల్స్‌లో రగిలిన కార్చిచ్చు చెట్టు పుట్టను కబళించడమే కాదు, ఈ ప్రాంతంలోని అత్యంత ఖరీదైన ఇండ్లను బూడిద కుప్పలుగా మార్చింది. పదహారు మంది మృతిచెందగా,డెబ్బయి వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు. ఈ కార్చిచ్చు మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని, వ్యాధి నిరోధక శక్తిపై దాడి చేయడమే కాకుండా శ్వాస సంబంధ వ్యాధులను, ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాలిఫోర్నియా, లాస్‌ఏంజెల్స్‌లో సంభవించిన కార్చిచ్చు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శాస్త్రవేత్తలను సైతం నిర్ఘాంతపరుస్తోంది. మంటలు ఇంత వేగంగా వ్యాపించడం మునుపెన్నడూ చూడలేదని, వాతావరణ పరిస్థితులే దీనికి కారణమని అగ్నిమాపకాధికారులు చెబుతున్నారు. మానవ తప్పిదాల వల్ల మున్ముందు ఇలాంటి విపత్తుల ముప్పు మరింత పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ కార్చిచ్చు ఒక్క అమెరికాకే పరిమితమైంది కాదు. నేడు ప్రపంచమంతా ఈ ముప్పు ముంగిట వుంది’ అని తేల్చి చెబుతున్నారు. భారత్‌లోనూ కార్చిచ్చుల బెడద క్రమంగా పెరుగుతోంది. హిమాలయాల జీవవైవిధ్యానికి అడవీ మంటలు ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన చెందుతోంది. ఉత్తర భారతంలోని అడవుల్లో ఇటీవల పెరుగుతున్న అగ్నిప్రమాదాలే దీనికి కారణం. 36 శాతం మేరకు అడవులు దావాలనాల బారిన పడుతున్నాయి. చిత్తడి ప్రాంతాల్లోనూ వాటి విజృంభణ సర్వసాధారణమైంది. ఈ ఏడాది తొలిరోజునే కులులోని తాండి గ్రామాన్ని భీకర అగ్నిప్రమాదం బూడిద కుప్పగా మార్చింది. ఈ దృశ్యానికి చలించిన సిమ్లాకు చెందిన యువ రచయిత సౌరభ్‌ చౌహాన్‌ ‘నిశ్శబ్దం తన గీతాన్ని అల్లిన కొండల దగ్గర/ క్రూరమైన మంట మసకబారింది/ శీతాకాలపు పట్టులో, అక్కడ మంచు పట్టుకుంటుంది/ కలలు కాలిపోయాయి,హృదయాలు చల్లగా మారాయి/ అగ్ని గర్జించింది, దాని నాలుక దయలేనిది/ ఏ ఆశను వదలని మృగం/ ఇళ్లు కూలిపోయాయి, రాయి నుండి ధూళి వరకు/ మండుతున్న గాలులకు జ్ఞాపకాలు కోల్పోయాయి’ అంటాడు భావోద్వేగంతో.
ముఖ్యంగా పర్యావరణ మార్పుల వల్ల సంభవించే వేడి, పొడి వాతావరణ పరిస్థితులే కార్చిచ్చు వేగంగా వ్యాప్తి చెందడానికి కారణ మౌతుంది. దీనివల్ల ఆ ప్రాంత జీవవైవిధ్యం దెబ్బతింటోంది. మొక్కలతో పాటు జంతుజాలానికి, సూక్ష్మజీవులు, క్రిమి కీటకాలు, ఉభయచరాలు, సరీసృప జాతుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. గడ్డి, ఇతర మొక్క జాతులు కాలిపోతున్నాయి. మరోవైపు మనుషుల ఆరోగ్యంపైనా కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపుతోంది. దట్టమైన పొగ అస్థిరమైన కర్బన సమ్మేళనాలు, ఓజోన్‌, విష వాయువులు, సూక్ష్మజీవులు కలిసి వుంటాయి. ఇవి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పాటు ఆస్తమాను కలిగించవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పొడి నేలల్లో ఉండే కోక్సిడియోయిడ్స్‌ ఇమ్మిటిస్‌, కోక్సిడియోయిడ్స్‌ పోసాడాసి వంటి బ్యాక్టీరియా, దుమ్ము, పొగతో మనుషుల్లోకి చొరబడతాయి. ఇవి జ్వరం, ఫ్లూ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ కలిగిస్తాయని కాలిఫోర్నియాలో వైల్డ్‌ల్యాండ్‌ అగ్నిమాపక సిబ్బందిపై జరిపిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ కార్చిచ్చులను నిలువరించాలంటే పర్యావరణ మార్పులకు కారణమౌతోన్న శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. వాతావరణ మార్పులను నిలువరించేందుకు, పర్యావరణాన్ని సంరక్షించేందుకు ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా కృషిచేయాలి. కార్చిచ్చుల వల్ల నాశనమైన అడవులను పునరుద్ధరించడంపై దృష్టి సారించాలి.