చెరుకు రైతులకు ‘తీపి’ అందేనా?

చెరుకు రైతులకు 'తీపి' అందేనా?– కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుతో ఆశలు
– చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఎదురుచూపు
– తుప్పు పడుతున్న యంత్రాలు
– అధికారంలోకి రాగానే తెరుస్తామన్న రాహుల్‌గాంధీ
నవతెలంగాణ-మల్లాపూర్‌
కొత్త ప్రభుత్వంలో తీపి కబురు కోసం చెరుకు రైతులకు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఖ్యాతి పొందిన తెలంగాణ నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ చక్కెర కర్మాగారం పునరుద్ధరణపై కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. అంతేకాకుండా వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో కూడా చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణపై హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో రైతుల చిగురించాయి.
ఎన్‌డీఎస్‌ఎల్‌ మూతపడి 8ఏండ్లు
రాష్ట్రంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌) కర్మాగారం మూతపడి ఈనెల 22తో 8 ఏండ్లు పూర్తవుతోంది. 2015 డిసెంబర్‌ 22న అర్ధరాత్రి ఎన్‌డీఎస్‌ఎల్‌ యాజమాన్యం లేఆఫ్‌ ప్రకటన చేసిన మరుసటి రోజు గేటుకు సీల్‌ వేశారు. నాటి నుంచి కర్మాగారాలు తెరుచుకోలేదు. చెరుకు రైతులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ముత్యంపేట చక్కెర కర్మాగారంలో సుమారు 36 ఏండ్లపాటు నడిచింది. ఎన్‌డీఎస్‌ఎల్‌ చక్కెర కర్మాగారం పరిధిలో సుమారు 500 మంది పర్మినెంట్‌ సీజనల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్లు పని చేసేవారు. ఇందులో సుమారు 300 మంది సీజనల్‌, 200 మంది కాంట్రాక్ట్‌ వర్కర్లు ఉండేవారు. 150 లారీల చెరుకును కర్మాగారానికి చేర్చేవారు. మహారాష్ట్రతో పాటు మెదక్‌, నల్లగొండ జిల్లాలకు చెందిన సుమారు 3000 మంది ఇతర కార్మికులు ముత్యంపేట చక్కెర కర్మాగార పరిధిలో పని చేసేవారు. ప్రతి ఏటా కోట్లలో లావాదేవీలు జరుగుతుండేది. పరిశ్రమ మూత పడటంతో వారంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు.
కర్మాగారాలకు అంకురార్పణ..
1931లో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంతో నిజామాబాద్‌ జిల్లాలో పంటల సాగుకు అంకురార్పణ జరిగింది. వరితో పాటు చెరకు సాగును ప్రోత్సహించాలని భావించిన నిజాం 1938లో బోధన్‌లో నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని నిర్మించారు. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మల్లాపూర్‌ మండలం ముత్యంపేట, మెదక్‌ జిల్లా మంబోజిపల్లిలో కొత్త యూనిట్లను ప్రారంభించారు. అప్పటి నుంచి 2015 వరకు ఆ ఫ్యాక్టరీలు నిర్విరామంగా కొనసాగాయి. లే ఆఫ్‌ విధించాక రూ.కోట్ల విలువ చేసే యంత్రాలు నిర్వహణ లేక తుప్పు పడుతున్నాయి. కంపెనీలో 49శాతం వాటాను కలిగి ఉన్న ప్రభుత్వంగానీ, 51 శాతం వాటా కలిగి ఉన్న డెల్టా యాజమాన్యంగానీ దీనిని పట్టించుకోవడం లేదు. ఎన్‌డీఎస్‌ఎల్‌ మూసివేతతో చెరుకు రైతులే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కర్మాగారంపై ఆధారపడిన కుటుంబాలెన్నో ఉపాధి లేక కష్టాలు పడుతున్నాయి.
ముచ్చటగా మూడు కమిటీలు..
టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రయివేటీకరణపై పలు ఆరోపణలు రావడంతో అప్పటి వైఎస్సార్‌ ప్రభుత్వం 2005లో దేవాదాయశాఖ మంత్రి, బుగ్గారం శాసన సభ్యుడు జువ్వాడి రత్నాకర్రావు చైర్మెన్‌గా ఎన్‌డీఎస్‌ఎల్‌పై శాసన సభా సంఘం ఏర్పాటు చేసి నివేదిక కోరింది. 2013లో అప్పటి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ఎన్‌డీఎస్‌ఎల్‌ నిర్వహణపై కమిటీ వేసి సిఫార్సులు ఇవ్వాలని కోరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఎన్‌డీఎస్‌ఎల్‌పై మళ్లీ కమిటీ వేశారు. ఫ్యాక్టరీల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కర్మాగారాలను సహకార పద్ధతిలో నడిపిస్తామని శాసనసభలో కేసీఆర్‌ ప్రకటించినా, ముందుకు సాగలేదు. ఎనిమిదేండ్లుగా సమస్య అలాగే ఉండిపోయింది. తాజాగా కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడటంతో ఫ్యాక్టరీలు తెరచుకుంటాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కర్మాగారాన్ని ప్రారంభిస్తే రైతులకు లాభం..
ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రారంభిస్తే రైతులకు లాభం చేకూరుతుంది. ఇక్కడ పండిన పంటను ఇతర జిల్లాల్లో ప్రయివేటుగా అమ్మడం ద్వారా రైతులకు నష్టం జరుగుతోంది. ప్రభుత్వం త్వరలోనే కర్మాగారాన్ని పున్ణప్రారంభిస్తుందని ఎదురు చూస్తున్నాం.
న్యవనంది లింబారెడ్డి- చెరుకు రైతు
చక్కెర కర్మాగారాలపై త్వరలో కమిటీ
చక్కెర కర్మాగారాలపై రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం.. ఇటీవల పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడగా సానుకూలం గా స్పందించారు. ప్రత్యేక కమిటీ వేసి చక్కెర కర్మాగారాల స్థితిగతులపై ప్రభుత్వం ప్రత్యేక నివేదిక తయారు చేస్తుందని చెప్పారు. గతంలో చక్కెర కర్మాగారంపై ఎన్నో పోరాటాలు చేశా. చక్కెర కర్మాగారం ప్రారంభమైతే ఈ ప్రాంత రైతులు అభివృద్ధి చెందుతారు.
కిసాన్‌ కాంగ్రెస్‌ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు వాకిటి సత్యనారాయణ రెడ్డి