ఆ ఇద్దరు ఇమడగలరా?!

Those two Can you do it?!– టీ20 జట్టులో రోహిత్‌, కోహ్లి
–  ప్రపంచకప్‌ బృందంలో చోటు ఖాయమే
–  పొట్టి ఫార్మాట్‌లో స్టార్స్‌ ప్రభావంపై చర్చ
విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ. ఇద్దరూ భారత క్రికెట్‌ సూపర్‌స్టార్స్‌. ప్రపంచ క్రికెట్‌ మేటి క్రికెటర్లుగా ఎదిగినా.. ఐసీసీ ప్రపంచకప్‌ అందుకునే కల తీరలేదు. 2023 ఐసీసీ ప్రపంచకప్‌ వేటలో ఆఖరు అడుగు తడబాటుతో రోహిత్‌ శర్మ నైరాశ్యంలో పడిపోయాడు. కోహ్లి 2011 ప్రపంచకప్‌ నెగ్గినా.. భారత్‌కు మరో కప్పు అందించాలనే పట్టుదల ఎక్కువగా ఉంది. మరో వన్డే వరల్డ్‌కప్‌కు రోహిత్‌, కోహ్లి అందుబాటులో ఉండేది లేనిది అనుమానమే. అందుకే 2024 టీ20 ప్రపంచకప్‌లో మరోసారి వేట మొదలెట్టేందుకు ఇద్దరూ సిద్ధమవుతున్నారు. కుర్రాళ్లతో కుదురుకున్న టీ20 జట్టులో విరాట్‌, రోహిత్‌లను చేర్చటం మంచి నిర్ణయమేనా? అనే చర్చ నడుస్తుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం

2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌. ఇంగ్లాండ్‌తో చివరగా టీ20 మ్యాచ్‌ ఆడేసిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు పొట్టి ఫార్మాట్‌కు ఏడాది పాటు దూర మయ్యారు. 2024 టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తుండగా.. భారత క్రికెట్‌ సూపర్‌ స్టార్స్‌ ఇద్దరూ టీ20 జట్టులో అడుగుపెట్టారు. దక్షిణాఫ్రికాతో వైట్‌బాల్‌ సిరీస్‌కు అందుబాటులోని ఉండని రోహిత్‌, కోహ్లి.. స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. పునరాగమనంలో రోహిత్‌ శర్మ నాయకత్వ పగ్గాలు అందుకోగా.. విరాట్‌ కోహ్లి టాప్‌ ఆర్డర్‌లో నం.3 బ్యాటర్‌ స్థానం దక్కించుకోనున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత్‌ మళ్లీ ఆ ట్రోఫీ సాధించలేదు. 2014లో చేరువైనా.. లంక చేతిలో నిరాశే ఎదురైంది. 2024లో పొట్టి కప్పు కొట్టాలనే గట్టి పట్టుదలతో కుర్ర జట్టును సిద్ధం చేసింది బీసీసీఐ. కానీ వేటకు ఆరు నెలల ముంగిట అనూహ్యంగా ఇద్దరు సీనియర్‌ క్రికెటర్లను జట్టులోకి తీసుకొచ్చింది. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ రాక టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ మేలు చేయగలదా? కుర్రాళ్లతో దూసుకెళ్తోన్న ఈ ఫార్మాట్‌లో ఈ ఇద్దరు ఇమడగలరా? ఇది పురోగమన చర్య అవుతుందా? ఈ ప్రశ్నలకు బదులిచ్చేందుకు బీసీసీఐ ఏమాత్రం సిద్ధంగా లేదు. అఫ్గాన్‌ సిరీస్‌కు జట్టు ప్రకటన అనంతరం సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ప్రెస్‌మీట్‌కు దూరంగా ఉండటం ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.
విరాట్‌కు సవాల్‌
ఆధునిక క్రికెట్‌ అత్యుత్తమ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి. వన్డేలు, టెస్టులు సహా టీ20ల్లోనూ కోహ్లి గణాంకాలు అమోఘం. 35 ఏండ్ల విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ స్థాయి సైతం వివాదరహితం. 113 టెస్టుల్లో 49.15 సగటుతో 8848 పరుగులు.. 292 వన్డేల్లో 58.67 సగటుతో 13848 పరుగులు చేశాడు. టీ20ల్లో సైతం 115 మ్యాచుల్లో 52.74 సగటుతో 4008 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో కోహ్లి అగ్రగణ్యుడు. 37 అర్థ సెంచరీలు, ఓ సెంచరీ ఇన్నింగ్స్‌ సైతం ఉన్నాయి. విరాట్‌ కోహ్లి స్ట్రయిక్‌రేట్‌ 137.96. ఈ ఫార్మాట్‌లో సగటు కంటే స్ట్రయిక్‌రేట్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. కోహ్లి ఇక్కడ కాస్త వెనుకంజ వేశాడు. గత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో సంచలన ఇన్నింగ్స్‌ నమోదు చేసిన కోహ్లి.. అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని షాట్లు ఆడాడు. గత సీజన్‌ ఐపీఎల్‌లో కోహ్లి స్పిన్‌ ఆడటంలో ఇబ్బంది పడ్డాడు. ప్రత్యర్థి జట్లు కోహ్లి కోసం నాణ్యమైన స్పిన్నర్‌ను అట్టిపెట్టుకునేవి. స్పిన్‌పై 124 బంతులు ఆడిన కోహ్లి.. స్ట్రయిక్‌రేటు 110 మాత్రమే సాధించాడు. కేవలం 32 సార్లు మాత్రమే బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఇక ఇదే అంశంలో సూర్యకుమార్‌ యాదవ్‌ స్పిన్‌పై 148 బంతులు ఎదుర్కొని 59 సార్లు బౌండరీ కోసం బ్యాట్‌ ఝులిపించాడు. ఐపీఎల్‌లో సగటును ప్రతి 3.43 బంతులకు ఓ బౌండరీ ప్రయత్నం చేస్తే.. విరాట్‌ కోహ్లి సగటు 3.88 బంతులు. భారత టీ20 జట్టులో విరాట్‌ నం.3 స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే.. అతడి ప్రధాన పాత్ర మిడిల్‌ ఓవర్లలో పోషించాల్సి ఉంటుంది. ఆరంభంలో నెమ్మదిగా ఆడే కోహ్లి.. ఆ తర్వాత వేగం పుంజుకుంటాడు. కానీ ఈ ఫార్మాట్‌లో అది కుదరదు. కుదురుకోవటం, పుంజుకోవటం ఏకకాలంలో జరగాల్సిందే. పవర్‌ప్లే ముగిసిన అనంతరం బౌండరీలు రాబట్టడం అంత సులువు కాదు. మ్యాచ్‌ గతిని నిర్దేశించే దశ ఇదే. ఈ ఓవర్లలో రన్‌రేట్‌ను నిలుపుకుంటే సరిపోతుంది. కోహ్లి ఓపెనర్‌గా వచ్చినా.. ప్రత్యర్థులు స్పిన్‌తోనే పరీక్ష పెడతారు. కుర్ర జట్టులో కోహ్లి కోసం కఠిన సవాల్‌ ఎదురు చూస్తోంది.
రోహిత్‌కు పరీక్ష
భారత క్రికెట్‌లో ఎం.ఎస్‌ ధోని తర్వాత మేటి సారథిగా రోహిత్‌ శర్మ ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లతో సత్తా చాటాడు. భారత క్రికెట్‌ పగ్గాలు కోహ్లి నుంచి రోహిత్‌కు అందటానికి సైతం ఐపీఎల్‌లో అతడు సాధించిన సక్సెసే కారణం. ఐపీఎల్‌ జట్టును, జాతీయ జట్టును నడిపించటం ఒకటి కాదని తెలిసేందుకు రోహిత్‌కు పెద్దగాస సమయం పట్టలేదు. నాకౌట్‌ మ్యాచుల్లో భారత జట్టు ఒత్తిడిని తట్టుకుని నిలబడటం కష్టంగా మారింది. రోహిత్‌ శర్మ ఈ అంశంలో మార్పు తీసుకు రావటంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్‌ అందుకోవాలనే తపిస్తున్న రోహిత్‌ శర్మ.. 2024 టీ20 ప్రపంచకప్‌ను చక్కటి అవకాశంగా చూస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ హార్దిక్‌ పాండ్యకు కోల్పోయిన రోహిత్‌.. భారత టీ20 జట్టు పగ్గాలను హార్దిక్‌ నుంచి తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. బ్యాటింగ్‌ లైనప్‌లో రోహిత్‌ శర్మ స్థానం ఓపెనింగ్‌. ఇటీవల వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్‌ శర్మ విశ్వరూపం చూపించాడు. సెహ్వాగ్‌ తరహాలో పవర్‌ప్లేలో ప్రత్యర్థులను ఊచకోత కోశాడు. భారత్‌కు అది బాగా కలిసొచ్చింది. టీ20ల్లో సైతం పవర్‌ప్లేలో విధ్వంస రచన రోహిత్‌కు పెద్ద విషయం కాదు. బ్యాటర్‌గా భీకర ఫామ్‌ అందుకునేందుకు రోహిత్‌ ఎదురుచూస్తున్నాడు. కానీ నాయకుడిగా రోహిత్‌ శర్మ కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నాడు. విరాట్‌ కోహ్లికి తుది జట్టులో చోటు కల్పించే అంశం నుంచే రోహిత్‌ కెప్టెన్సీ కష్టాలు షురూ అవుతాయని చెప్పవచ్చు. 148 టీ20ల్లో రోహిత్‌ శర్మ 31.32 సగుటుతో 3853 పరుగులు చేశాడు. స్ట్రయిక్‌రేట్‌ 139.24. పొట్టి ఫార్మాట్‌లో రోహిత్‌ 4 సెంచరీలు, 29 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 262 మ్యాచుల్లో 49.12 సగటుతో 10709 పరుగులు చేశాడు.
కుర్రాళ్లకు కష్టమే!
యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మ సహా రింకూ సింగ్‌లు రానున్న 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు కీలకం అవుతారని ఇప్పటివరకు ఓ అంచనా. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ రాకతో అసలు తుది జట్టులో ఈ కుర్రాళ్లకు చోటు దక్కటమే ప్రశ్నగా మిగిలి పోనుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌లలో ఒకరు రోహిత్‌ శర్మ కోసం స్థానం వదులుకోవాలి. నం.3 బ్యాటింగ్‌ స్థానం రేసులో శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మలు విరాట్‌ కోహ్లి కోసం బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. రోహిత్‌, కోహ్లిలతో కూడిన తుది జట్టులో సమతూకం కోసం ఏకంగా రింకూ సింగ్‌ను సైతం పక్కన పెట్టే ప్రమాదం లేకపోలేదు. మేటి బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు ఏ సవాల్‌నైనా ఎదుర్కొని నిలబడగలరు. టీ20 జట్టులో చోటే చర్చకు దారితీసి నప్పుడు.. అందుకు తగినట్టుగా ధనాధన్‌ విధ్వంసం వ్యూహలు చేయాలనే సంగతి బాగా తెలుసు. అయితే, ఇద్దరు సీనియర్‌ క్రికెటర్ల ప్రపంచకప్‌ కల కోసం..భీకర ఫామ్‌లో ఉరకేస్తున్న కుర్రాళ్లను పక్కనపెట్టడం భారత్‌ క్రికెట్‌కు మేలు చేస్తుందా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.
2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించాలి. విరాట్‌ కోహ్లి సైతం మన జట్టులో కచ్చితంగా ఉండాలి. కోహ్లి అద్భుతమైన క్రికెటర్‌. 14 నెలల విరామం రోహిత్‌, కోహ్లిలపై ఎటువంటి ప్రభావం చూపించదు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ గెలుపు గుర్రాలు రోహిత్‌, కోహ్లి’
– సౌరవ్‌ గంగూలీ,
మాజీ కెప్టెన్‌