– రాష్ట్రంలో వరి కోతలు షురూ.. మార్కెట్‌కు రానున్న ధాన్యం
– ఏప్రిల్ ఒకటి నుంచి కొనుగోళ్లు ప్రారంభం
– మద్దతు ధరతో పాటు బోనస్‌పై రైతుల్లో ఆశ
– నీటి ఎద్దడి, అకాల వర్షాల వల్ల అపార పంట నష్టం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
యాసంగిలో సాగు చేసిన వరి పైర్లు కోతకొచ్చాయి. ముందస్తుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోత పనులు షురూ అయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. మార్కెట్లోకి ధాన్యం వచ్చిందంటే వెనువెంటనే కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు వరి ధాన్యానికి మద్ధతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్‌లో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయనుంది. రైతులకు మద్ధతు ధరతో పాటు బోనస్ చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోనస్ చెల్లింపు గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో యాసంగిలో బోనస్ ఉన్నట్టా? లేనట్టా? అన్న సంశయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో యాసంగిలో సాగైన వివిధ రకాల పంటల్లో వరి సాగే అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 54.93 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించినా జలాశయాల్లో నీటి లభ్యత లేని కారణంగా సాగు విస్తీర్ణం తగ్గింది. ముందస్తుగా నాట్లు వేసిన నల్లగొండ, యాదాద్రి, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు షురూ అయ్యాయి. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతేడాదిలో పోలిస్తే సుమారు 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు వస్తాయనేది అధికారుల అంచనా. సిద్దిపేట జిల్లాలో 3.30 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మెదక్ జిల్లాలో 2.60 లక్షల ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో 83 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. యాసంగి సీజన్‌లో దొడ్డురకం వరినే సాగు చేశారు. పండిన ధాన్యాన్నంతా రైతులు మార్కెట్‌లోనే విక్రయిస్తారు. దాంతో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌరసరఫరా సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల కోసం 7 వేల కేంద్రాల్ని ఏర్పాటు చేసేందుకు సిద్దం చేశారు.
రైెతుకు బోనస్ భరోసా లేనట్టేనా..?
వరి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాల్సి ఉంది. ఎన్నికల్లో గెలిపిస్తే అధికారంలోకి రాగానే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం రూ.15 వేలు చెల్లించడం, రూ.2 లక్షల రుణ మాఫీ చేయడంతో పాటు ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా చెల్లిస్తామని చెప్పిన మాట మీద ప్రభుత్వం నిలబడాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే అమలయ్యాయి. రైతు భరోసా సాయం పెంచుతామని చెప్పిన ప్రభుత్వం పాత పద్దతిలోనే సాయం చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియ అమలుకాలేదు. కనీసం తక్కువ భారంపడే బోనస్ చెల్లించే విషయంలోనైనా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ను నెపంగా చూపి రైతులకు బోనస్ అందని ద్రాక్ష చేయడం సరైంది కాదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
బోనస్ ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోనున్న రైతులు
రైతుల నుంచి సేకరించే ధాన్యానికి కేంద్రం ప్రకటించిన కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) చెల్లిస్తారు. ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2183 ఎంఎస్‌పీ ఉంది. కేంద్రం ప్రకటించిన మద్ధతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను కలిపి రైతులకు చెల్లించాలి. రాష్ట్రంలో 2023-24 యాసంగీ సీజన్‌లో 66.70 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా నిర్దేశించింది. అయితే గతేడాది యాసంగి కంటే ఈ సీజన్‌లో ధాన్యం దిగుబడులు తక్కువ వచ్చే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది యాసంగిలో 66.85 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఎందుకంటే ఈ సీజన్‌లో నీటి ఎద్దడి సమస్య తలెత్తి సాగు చేసిన వరి పైర్లు ఎండిపోయాయి. చాలా చోట్ల రిజర్వాయర్లలో నీటి లభ్యత లేకపోవడంతో సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో క్రాఫ్ హాలిడే ప్రకటించారు. మిగతా అనేక ప్రాజెక్టుల పరిధిలోనూ ఇలాగే జరిగింది. ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వాన వల్ల కూడా రాష్ట్రంలో 7 లక్షల ఎకరాల్లో వరి పైర్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధర దక్కట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏటా కనీస మద్ధతు ధరల్ని ప్రకటిస్తుంది. 2023-24లో వరి ధాన్యం క్వింటాల్ ధర రూ.2183 ఉంది. 2022-23లో రూ.2060, 2021-22లో రూ.1960 ఎంఎస్‌పీ ఉంది. కేంద్రం ప్రకటించిన రూ.2183 ఎంఎస్‌పీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.500 బోనస్ కలిపి క్వింటల్‌కు రూ.2683 చొప్పున రైతులకు చెల్లించాల్సి ఉంది. కేంద్రం ప్రకటించిన మద్ధతు ధర గిట్టుబాటు కాని పరిస్థితి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం రూ.500 బోనస్ చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
బోనస్ చెల్లించి ధాన్యం కొనాలి: జయరాజు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు
యాసంగి సీజన్ సేకరించే ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ చెల్లించాలి. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే బోసన్ చెల్లించాలి. రాష్ట్రంలో కరువు పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం ప్రభుత్వం బోసన్ చెల్లించైనా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల కోడ్ నెపంతో రైతులకు బోనస్ ఇవ్వకపోవడం సరైంది కాదు.