నిప్పును గుప్పిట మూయగలరా..?

Can you put out the fire?ఆ పేరు విన్నంతనే ఆకాశం అరుణపతాకమై రెపరెపలాడుతుంది. భూమి పిడికిలై మొలకెత్తుతుంది. గాలి అమరుల త్యాగాల రాగమై మోగుతుంది. చరిత్ర ఎరుపెక్కుతుంది. అవును… మాట్లాడుతున్నది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించే… జనాన్ని జెండాలుగా ఎగరేసి గడీలను గడగడలాడించిన కమ్యూనిస్టుల వీరగాథ గురించే… నాలుగువేల ప్రాణాలను ధారవోసి, పదిలక్షల ఎకరాలను ప్రజలకు పంచి, మూడువేల గ్రామాలను విముక్తిచేసి గ్రామ స్వరాజ్యాల్ని స్థాపించిన ఆ నెత్తుటిగాథకు నేటికి డెబ్బై అయిదేండ్లు. ఆ మహోజ్వల వారసత్వాన్ని కొనసాగిస్తూ కమ్యూనిస్టులు వార్షికోత్స వాలు జరుపుతుండగా, మిగతా రాజకీయపక్షాలూ తమ తమ కార్యక్రమాలతో హడావిడికి సిద్ధమవు తున్నాయి. జాతికి గర్వకారణమైన ఆ పోరాటఖ్యాతిని ఎవరు స్మరించినా తప్పులేదు. కానీ, దానికి వక్రభాష్యాలు చెపుతూ, విశాల ప్రజామోదమున్న ఈ చారిత్రక సందర్భాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోజూడటమే ఆక్షేపణీయం. సెప్టెంబర్‌ 17 వచ్చిందంటే వీరు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇంతకీ ఏమిటీ సెప్టెంబర్‌ 17 ప్రత్యేకత? అది యూనియన్‌ సైన్యాల ముందు నిజాం తలవంచినరోజు. అంతే తప్ప ఆనాటి పోరాటానికి అది ప్రారంభమూ కాదు, ముగింపూ కాదు. కానీ చరిత్రకు సైతం వక్రీకరణలు చేస్తున్న ప్రబుద్ధుల కాలం కదా…! ఇది ”విమోచనదినం” అనే పేరుతో ఓ ”పరివారం” నిత్యం విభజన విద్వేష రాజకీయాలకు పూనుకుంటున్నది. ప్రతియేటా విషం చిమ్ముతూనే ఉన్నది. వీరే కాదు, ఈ రోజున వేడుకల పేరుతో హడావుడి చేస్తున్నవారందరివీ వితండవాదాలు, విపరీతధోరణులే. వీరెవరూ ఈ పోరాటంలో ఒక్క నెత్తురు బొట్టు చిందించినవారూ, చుక్క చెమట రాల్చినవారూ కాకపోవడం వైచిత్రి!!
ముఖ్యంగా విమోచన పేరుతో కట్టుకథలల్లు తున్నవారి తీరుకు చరిత్ర సైతం ఫక్కున నవ్వుతుంది. కుల మతాలకతీతంగా యావత్‌ తెలంగాణ ప్రజలు లిఖించిన ఆ త్యాగాల చరిత్రకు వీరు మతం రంగు పులుముతున్నారు. ఇది హిందూ ప్రజలకూ ముస్లిం రాజుకూ మధ్య యుద్ధంగా చిత్రిస్తూ వక్రభాష్యాలు చెపుతున్నారు. ”ముస్లింల పాలన కింద ఉన్న హిందూ ప్రజలకు 1948 సెప్టెంబర్‌ 17న భారత ప్రభుత్వం విమోచన కలిగించింది” అన్న అశాస్త్రీయ వాదనను ముందుకు తెస్తున్నారు.
కానీ వాస్తవమేమిటీ? అసలు హైదరాబాద్‌ సంస్థానం ముస్లిం పాలన కింద ఉండేదన్నదే అర్థసత్యం. పాలకుడు ముస్లిం కావొచ్చు… పాలకుల మతం ఇస్లాం కావొచ్చు… రాజు పరమ నిరంకుశుడనడంలోనూ సందేహం లేదు. కానీ ఆ రాజు ఆధారపడి పాలన సాగించింది హిందూ భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్ధార్ల్ల మీదేనన్నది కూడా అంతే నిజం. ప్రజలు ప్రత్యక్షంగా దోపిడీకి, విపరీతమైన పీడనకు గురయింది వీరి చేతుల్లోనే. వీరికి అండ నిజాం రాజు. చివరికి అత్యంత క్రూరులూ మతోన్మాదులైన రజాకార్‌ మూకలన్నిటికీ ఈ హిందూ దొరల గడీలలోనే విడిది. అక్కడే తిని, తాగి ప్రజలమీద, పోరాడే వీరుల మీద ఈ కసాయి మూకలు కిరాతక దాడులు చేసేవి అన్న సంగతి మరువగలమా? రజాకార్ల సైన్యాధ్యక్షుడు కాసీం రజ్వీ ముస్లిం అయితే, ఉపాధ్యక్షుడైన విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డి ఎవరు? హిందువు కాదా? అతని దాష్టీకానికి బలైన బందగీ ఎవరు? ముస్లిం కాదా? లక్షల ఎకరాలకు అధిపతిగా జనాల మూల్గులు పీల్చిన జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఎవరు? పసిబిడ్డల తల్లుల్ని మోదుగు డొప్పల్లో పాలు పిండించి పరీక్షించిన పసునూరి రామ్మోహన్‌రావు ఎవరు? నీర్మాల నియంత లింగాల నర్సింహారెడ్డి ఎవరు? కోడూరి కర్కోటకుడు గడ్డం నర్సింహారెడ్డి ఎవరు? వీరి అమానుషాలను ఎండగట్టిన షోయబుల్లాఖాన్‌ ఎవరు? వీరి దురాగతాలను ప్రతిఘటించిన మఖ్ధూం మొహియుద్ధీన్‌ ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర నిండా అనేక ఉదాహరణలు… వీటిలో ”పీడకులు – పీడితులు” అన్న విభజనకు తప్ప ”హిందువులు – ముస్లింలు” అనే విభజనకు అస్కారముందా? అడుగడుగునా హిందూ ముస్లిం ఐక్యత, సామరస్యం వెల్లివిరిసిన మహా సంగ్రామమది.
కానీ…. ఎంత వక్రీకరణ…! మనుషుల్ని నిరపేక్షంగా ప్రేమించిన వాళ్ల గురించి ఎన్ని అసత్యాలు. ఎన్ని అర్థసత్యాలు. నిజాం రాజు, దొరలు, జాగిర్దార్లనే కాదు, కులమతాలను సైతం ధిక్కరించిన చరిత్ర అది. ”కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం… శరీర కష్టం స్పురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి… సహస్ర వృత్తుల సమస్త చిహ్నం….” అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు… శ్రమైక జీవన సౌందర్యాన్నే కాదు… శ్రామికవర్గ ఐక్యతను కూడా చాటి చెప్పిన మహోన్నత ఇతిహాసమది. భూసంస్కరణలను జాతీయ ఎజెండాగా మార్చడమేకాదు, వాటి ఆచరణకు మార్గదర్శిగా నిలిచిన ప్రజాయుద్ధమది. దీన్ని ముస్లింలకు హిందువులకు మధ్య వైషమ్యంగా ప్రచారం చేయబూనడం, దీనిని ముస్లిం రాజు నుండి హిందూ ప్రజలకు లభించిన విమోచనగా చిత్రించడం కేవలం ఓ కట్టుకథ. దేశమంతటా 80-20 పోలరైజేషన్‌ను అమలు చేసే విద్వేష రాజకీయం జడలు విచ్చుకున్నకాలం కదా… ఇప్పుడీ ఈ మతవాద రాజకీయ కౌటిల్యం మరింత తీవ్రమైంది.
వీరంటున్నట్టు 1948 సెప్టెంబర్‌ 17న జరిగింది విమోచనే అయితే, 1950 జనవరి 26 దాకా హైదరాబాద్‌ రాజ్యపాలన నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పేరు మీదనే ఎందుకు సాగినట్టు? ఆ తరువాత 1956 దాకా ఆయన రాజప్రముఖ్‌ (గవర్నర్‌)గా ఎలా కొనసాగినట్టు? జరిగింది ప్రజల విమోచనే అయితే, దుర్మార్గమైన ఫ్యూడల్‌ నిరంకుశ పాలన సాగించి, ప్రజల రక్తమాంసాలు పిండి, పన్నులు వసూలుచేసి, ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకనిగా చలామణీ అయిన నిజాం ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? పైగా రాజభరణం పేరుతో ఎదురు పరిహారాలు ఎందుకు చెల్లించినట్టు? ఈ ప్రశ్నలకు ”పరివారం” జవాబు చెప్పగలదా? మరి దీనిని విమోచన అనగలమా? అదే నిజమైతే ఆ తరువాత కూడా ప్రజలు సాయుధ పోరాటం ఎందుకు కొనసాగించినట్టూ? ఎందుకంటే ఆ రోజుతో ఏదో మార్పు వచ్చినట్టు ప్రజలు భావించలేదు గనుక. అదే సమయంలో 1948 సెప్టెంబర్‌ 17న విమోచన పూర్తయితే 1951 దాకా పటేల్‌ పటాలాలు తెలంగాణను ఎందుకు వీడలేదు? ఎందుకంటే అవి వచ్చింది నిజాం రాజు కోసం కాదు గనుక. వాటి ”ఆపరేషన్‌ పోలో” అసలు లక్ష్యం కమ్యూనిస్టులే గనుక. తెలంగాణ ప్రజలపై, కమ్యూనిస్టులపై నిజాం పోలీసులు, రజాకారు మూకలకంటే నెహ్రూ సైన్యాల హత్యలూ అకృత్యాలే ఎక్కువ కదా! దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటి? కాషాయ పరివారం చెపుతున్నట్టు ఇది విమోచనే అయితే ఎవరి నుండి ఎవరికి విమోచన? ఈ చారిత్రక వాస్తవాలన్నీ విస్మరించి, వక్రీకరించి ”విమోచనగానాలాపన” చేయడంలో ఈ పరివారానికి కొన్ని నిర్ధిష్టమైన ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలియనిది కాదు. మత విద్వేషాలను రగిలించి రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు వీరు ఎంతటి వక్రీకరణలకైనా దిగజారు తారనడానికి ఇంతకు మించిన ఉదాహరణేముంటుంది?
ఇక ‘విలీన గానాలాపన’ చేసేవారిది మరో ప్రహసనం. తన సైనిక చర్య ద్వారా నిజాంను లొంగదీసుకుని, హైదరాబాద్‌ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసింది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నది వీరి వాదన. ఈ వాదన ద్వారా ఈ ”ఘనత”ను తమ ఖాతాలో వేసుకోవాలన్నది వీరి తాపత్రయం. అదే నిజమైతే నాటి నిజాం రాజుతో సంధి చేసుకుని, హైదరాబాద్‌ రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ ”యథాతథ ఒప్పందం”పై ఎందుకు సంతకం చేసినట్టో వీరు సమాధానం చెప్పాలి. అంతకుముందే సంస్థానాలలో పోరాటం మన లక్ష్యం కాదని, బ్రిటిష్‌ ఇండియా పరిధిలోనే ప్రజలను స్వాతంత్య్ర పోరాటానికి సమీకరించాలని తీసుకున్న విధానం వెనుక ఉద్దేశ్యం ఏమిటో కూడా వీరు చెప్పాలి. అంతే కాదు, కమ్యూనిస్టులు విలీనాన్ని స్వాగతించినప్పటికీ, ఆ తరువాత కూడా వారిపై క్రూరమైన అణచివేతకు ఎందుకు పాల్పడ్డారో కూడా చెప్పాలి. నిజానికి 1948లో నెహ్రూ సైన్యాలకు కేవలం రోజుల వ్యవధిలోనే నిజాం లొంగిపోయాడు కదా? కానీ ఆపైన 1951 దాకా మూడేండ్ల పాటు అవి తెలంగాణలో చేసిన యుద్ధం ఎవరి మీద? కమ్యూనిస్టుల మీద, తెలంగాణ ప్రజల మీదనే కదా! ఇక్కడ గమనించవలసిన అసలు విషయం ఏమిటంటే… తెలంగాణ సాయుధ పోరాటం ముందు నిజాం తలవంచక తప్పదనీ, ఆ ప్రజా యుద్ధం ధాటికి నిరంకుశ ఫ్యూడల్‌ పాలన కూలిపోవడం తథ్యమనీ తేలిపోయాకే భారత యూనియన్‌ సైన్యాలు రంగప్రవేశం చేసాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు గెలిస్తే తెలంగాణ కమ్యూనిస్టుల చేతిలోకి వెళుతుందనీ, అది రేపు తమ ఢిల్లీ కోటను కూడా ముట్టడిస్తుందనే భయం వారిది. నిజం చెప్పాలంటే ఇది యూనియన్‌ సైన్యాలు తెలంగాణ ప్రజల నుండి నిజాం రాజుకు కల్పించిన విమోచన. కమ్యూనిస్టు ఉద్యమ ప్రకంపనలు హస్తినదాకా చేరకుండా నెహ్రూ ప్రభుత్వం తనకు తాను కల్పించుకున్న విమోచన.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో పక్షం తయారైంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా జగత్‌ప్రసిద్ధిగాంచిన ఈ మహాసంగ్రామానికి అధికారిక వేడుకలు జరుపాలన్న చిత్తశుద్ధిలేని వీరు… ఇప్పుడు ఎన్నికల ముంగిట ”జాతీయ సమైక్యతా దినోత్సవం” పేరిట ఓ కొత్త నాటకానికి తెరతీసారు. అందరివీ స్వార్థరాజకీయ ప్రయోజనాలే. లేని వారసత్వం కోసం ఆరాటాలే. అంతిమంగా ఆ పోరాట స్ఫూర్తిని నీరుగార్చే ప్రయత్నాలే. ఈ ప్రయత్నాల వెనుక… ఇది ”కమ్యూనిస్టుల సారథ్యంలో సామాన్యులు సాయుధులై సాగించిన విముక్తి పోరాటం” అన్న చారిత్రక సత్యాన్ని విస్మరణకు గురిచేయడం కూడా ఒక లక్ష్యమం. కానీ నిప్పును గుప్పిట మూయగలరా? వీటన్నిటినీ ఛేదిస్తూ ఆ మహౌజ్వల పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడంలోనే ఈ దేశ భవిష్యత్తు ఉంది.
ఆకలి, అసమానత, అణచివేతలతో ప్రజా జీవితం మున్నెన్నడూ ఎరుగనంత సంక్షోభంలోకి జారిపోతున్న తరుణమిది. పోరాడి సాధించుకున్న ప్రజల ప్రాధమిక హక్కులు సైతం దిక్కులేనివిగా మారిపోతున్న సమయమిది. మత విద్వేషాలు ఇంతకుముందెన్నడూ లేనంతగా మనుషుల మధ్య సంబంధాలను సంక్లిష్టం, సంఘర్షణాత్మకం చేస్తున్నాయి. ఏకంగా మతం అధికార శక్తిగా కొలువుదీరిన వర్తమానంలో ఉన్నాం మనం. వ్యక్తిగతమయిన మతం ఆర్థిక, రాజకీయ, సామాజిక సందర్భాలలోకి చొచ్చుకొని రావటం వలన సంభవించిన పరిణామం ఇది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగానే ఈ ధోరణులు పెనుప్రమాదమై ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల చరిత్రపై, ఉద్యమాలపై విమర్శలు, దాడులు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ప్రత్యేకించి భావోద్వేగాలను రెచ్చగొడుతూ మత ప్రాతిపదికపై మనుషులను విభజించే ప్రక్రియ ఊపందుకుంటున్నది. అప్రమత్తంగా ఉండాలి. ప్రతిఘ టించాలి. జీవితాల్లో అభద్రత, విద్వేషాలు నింపుతూ మనిషిని మనిషి నుండి, మనిషిని సమూహం నుండి వేరు చేస్తున్న శక్తులెవరైనా సరే… వారిని ఎదుర్కోవడం నేటి మన కర్తవ్యం. ఆ కర్తవ్యానికి దారి చూపే దీపస్తంభం వీరతెలంగాణ సాయుధ పోరాటం.
రాంపల్లి రమేష్‌