– మంత్రులను ప్రశ్నించిన కేటీఆర్
– ప్రభుత్వ అసమర్థత వల్లే కరువు
– ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి
– ముషంపల్లిలో పంట పొలాల పరిశీలన
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే కరువు ఏర్పడింది.. కరెంట్ కోతల్లేవని రైతుల ముందు అనగలరా..? అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మంత్రులను ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్‌లో సోమవారం బీఆర్‌ఎస్ నల్లగొండ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశం లో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన నల్లగొండ మండలంలోని ముషంపల్లిలో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. రైతులు గండేపోయిన మల్లయ్య యాదవ్, బోర్ల రామిరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు మల్లయ్యకు కేటీఆర్ రూ.లక్ష చెక్కును అందజేశారు. పంటలు ఎండిపోయినాయి.. తాగునీరు దొరకని పరిస్థితి ఉందని రైతులు కేటీఆర్‌కు విన్నవించారు. అనంతరం గ్రామంలో విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగం లేని ప్రాజెక్టుగా చూపిస్తూ, రిజర్వాయర్లలో నీళ్లు నింపకుండా ఈ ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పర్యటన భయంతో నంది పంప్‌హౌస్‌లో ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసి కరీంనగర్‌కి నీళ్లు వదిలారని తెలిపారు. నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పి ఇదే రోజు అదే బాహుబలి మోటార్లతో కరీంనగర్‌కు నీళ్లు అందిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు నాగార్జునసాగర్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికీ సాగునీరు అందిందని చెప్పారు. పదేండ్ల కాలంలో ఏనాడూ మళ్లీ బోరు వేయాల్సిన పరిస్థితి రైతులకు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో గ్రామాల్లో బోరు బండ్ల మోత మోగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రైతాంగం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వల్ల రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేవలం కేసీఆర్‌ని బద్నాం చేయాలన్న దుర్మార్గపూరిత, చిల్లర తాపత్రయంతో లక్షల మంది రైతుల పంటలను ప్రభుత్వం ఎండబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ పంట నష్టం జరిగిందో అక్కడ ఎకరానికి రూ.25 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి, ఒక్క మంత్రి కూడా రైతుల వద్దకి వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము, తమ నాయకుడు కేసీఆర్ తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా మూడు నాలుగు జిల్లాలు తిరిగి రైతులను పరామర్శించి ధైర్యం చెబుతున్నారని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన పొంకనాల పోతిరెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమస్యను పరిష్కరించకుండా ఉత్త మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు రాజకీయ చేరికలపై ఉన్న శ్రద్ధ రైతాంగం సమస్యలపై లేదన్నారు. ముఖ్యమంత్రి కేశవరావు ఇంటికి వెళ్లినప్పుడు కూడా కరెంటు పోయిందని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత బుఖాయించినా వాస్తవాలు వాస్తవాలేగానీ అబద్ధాలు కావని చెప్పారు. మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల ముందుకొచ్చి కరెంటు కోతలు, సాగునీటి కొరత లేదని చెప్పాలని సవాల్ విసిరారు. అంతకు ముందు నల్లగొండ పార్లమెంటరీ బీఆర్‌ఎస్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన మాకు లేదన్నారు. ఖమ్మం, నల్లగొండ బాంబులతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదముందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, నల్లబోతు భాస్కరరావు, రమావత్ రవీందర్ కుమార్ నాయక్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, తదితర నాయకులు ఉన్నారు.