– భారత విద్యార్ధులకు ఎదురుదెబ్బ
టొరంటో : భారత్, మరో 13 దేశాలకు చెందిన విద్యార్ధులను ప్రభావితం చేసేలా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ( ఎస్‌డిఎస్)వీసా పథకాన్ని కెనడా నిలిపివేసింది. ఈ కార్యక్రమం కింద విద్యార్ధులకు సత్వరగతిని విద్యార్ధి పర్మిట్ ప్రాసెసింగ్ జరుగుతుంది. జాతీయత ప్రాతిపదికన ఫాస్ట్ ట్రాక్ ఆప్షన్లను తొలగించడం ద్వారా విద్యార్ధులకు సమాన అవకాశాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వుంది. ఇక భవిష్యత్‌లో దరఖాస్తు చేసుకోబోయే విద్యార్ధులు రెగ్యులర్ స్టడీ పర్మిట్ దరఖాస్తు ప్రక్రియను అనుసరించాల్సి వుంటుంది. విద్యనభ్యసించడానికి అనుమతించాలని కోరుతూ దరఖాస్తులు పెట్టుకునేందుకు త్వరగా పూర్తయ్యే ఈ ప్రక్రియను భారతీయ విద్యార్ధులు ఎక్కువగా అనుసరిస్తారు. నేటికి, భారత్, మరో 13 దేశాల నుండి విద్యార్ధులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందారు. ఇక వీరందరూ కెనడా రెగ్యులర్ స్టడీ పర్మిట్ వ్యవస్థ ద్వారా దరఖాస్తు చేసుకో వాల్సిందే. ఎస్‌డిఎస్‌ను 2018లో ప్రవేశపెట్టారు. భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇతర అర్హత గల దేశాలకు చెందిన విద్యార్ధులు కెనడాలో చదువుకోవడానికి ఎక్కువ ప్రయాసపడకుండా అవకాశాలను ఈ పథకం కల్పించేది ఏటా వేలాదిమంది విద్యార్ధులు ఈ పథకం వల్ల లబ్ది పొందే వారు. ముఖ్యంగా భారత్ విద్యార్ధులకు బాగా ఉపకరించేది. కెనడాలో చదవుకునే వారిలో భారత విద్యార్ధుల సంఖ్య అత్యధికంగా వుంటుంది. కాగా ఈ నిర్ణయాన్ని కెనడా ప్రభుత్వం సమర్ధించుకుంది. ఎస్‌డిఎస్‌ను తొలగించడం వల్ల విద్యార్ధులందరికీ సమాన అవకాశాలకు కల్పించినట్లవుతుందని పేర్కొంది. ఈ మేరకు కెనడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రకటన పేర్కొంది. నవంబరు 8 మధ్యాహ్నం 2గంటల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం నిబంధనలు వర్తిస్తాయి. ఇక ఆ తర్వాత దరఖాస్తు చేసుకునేవారు రెగ్యులర్ పథకం కిందకే వస్తారని పేర్కొంది.