కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలు రద్దు

నవతెలంగాణ-కంటోన్మెంట్‌
దేశంలో కంటోన్మెంట్‌ బోర్డుల ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేస్తున్నట్టు రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఒక గెజిట్‌ విడుదల చేశారు. దాంతో సికింద్రాబాద్‌ సహా దేశంలోని 57 కంటోన్మెంట్‌ బోర్డుల్లో ఎన్నికలు రద్దయ్యాయి. అయితే రద్దుకు గల కారణాలు పేర్కొనకపోవడం గమనార్హం. దేశంలో ఉన్న 57 కంటోన్మెంట్లకు ఏప్రిల్‌ 30న ఎన్నికలు నిర్వహించాలని గత నెల 17న రక్షణ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్‌ల విలీన ప్రక్రియ ఒక వైపు కొనసాగుతుండగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని, అలాగే 2020 యాక్ట్‌ అమలు కాకుండా పాత చట్టం ప్రకారం ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని కూడా పలు కంటోన్మెంట్లలో రాజకీయ నాయకులు కోర్టులను ఆశ్రయించారు. కంటోన్మెంట్‌ల నుంచి రక్షణ శాఖకు ఒత్తిడి రావడం వల్లనే ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేసినట్టు తెలుస్తోంది. తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే వివరణ గెజిట్‌లో తెలపకపోవడం గమనార్హం.