– హర్యానా ప్రభుత్వ నిర్వాకం
– ఖానౌరీ సరిహద్దు వద్ద యువ రైతు శుభకరణ్ సింగ్‌కు రైతు నాయకుల నివాళి
– ఎట్టకేలకు యువ రైతు మృతిపై హత్య కేసు నమోదు
– 17వ రోజుకు రైతుల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన రైతులపై హర్యానా పోలీసులు కుట్ర పూరిత, బెదిరింపు చర్యలకు సిద్ధమయ్యారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర, పలు డిమాండ్ల సాధనకు జరుగుతున్న ఆందోళనలో పాల్గొన్న పలువురు రైతులను గుర్తించి, వారి పాస్‌పోర్ట్‌లు, వీసాలను రద్దు చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 21న ఖానౌరీ సరిహద్దులో శుభకరణ్ సింగ్ మృతి పట్ల గుర్తు తెలియని వ్యక్తులపై వారం రోజుల అనిశ్చితి తరువాత ఎట్టకేలకు హత్య కేసు నమోదు చేయడంతో ఆయన మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి రైతులు, కుటుంబ సభ్యులు అంగీకరించారు. బుధవారం రాత్రి శుభకరణ్ సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం రాజింద్ర ఆస్పత్రి నుంచి ఖానౌరీ సరిహద్దుకు తీసుకెళ్లిన శుభకరణ్ సింగ్ భౌతిక కాయానికి రైతు నాయకులు నివాళులర్పించారు. ఆయన భౌతికకాయంపై తమ సంఘాల జెండాలను కప్పారు. అనంతరం గురువారం మధ్యాహ్నం బటిండాలోని ఆయన స్వగ్రామ ంలో అంత్యక్రియలు జరిగాయి. అంబులెన్స్ వెంట నడిచిన రైతులు ‘అమర్ షహీద్ శుభకరణ్ సింగ్, జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఆయన మృతికి కారకులైన వారిని వెంటనే పట్టుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.