ఫార్మాసిటీ భూ సేకరణ నోటిఫికేషన్లు రద్దు

Cancellation of Pharmacy land acquisition notifications–  అధికారుల తీరుపై హైకోర్టు అసహనం
–  అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలని సర్కార్‌కు ఆదేశం
నవతెలంగాణ -హైదరాబాద్‌ బ్యూరో
ఫార్మాసిటీ భూసేకరణపై హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. యాచారం మండలం మేడిపల్లిలో భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేసింది. మేడిపల్లి, కుర్మద్దలో భూసేకరణ పరిహారం ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. భూసేకరణ విషయంలో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
”ఫార్మాసిటీ భూసేకరణలో అధికారుల తీరు ఆశ్చర్యంగా ఉంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్‌ ఇచ్చిన మెమోను పక్కన పెట్టారు. కోర్టుల్లో కేసులు దాఖలయ్యాకైనా ఎందుకు తేరుకోవడం లేదు? తప్పులు కప్పిపుచ్చుకునే బదులు సవరించుకుంటే మంచిది. అధికారులు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా? ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ విధానాలను కాలరాస్తున్నారా? అనిపిస్తోంది. పిటిషనర్లు లేవనెత్తిన లోపాలను సరిచేసి ఉంటే మూడేళ్లు వృథా అయ్యేది కాదు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని భూసేకరణ మళ్లీ ప్రారంభించాలి. నిర్వాసితులు రెండు వారాల్లో అభ్యంతరాలను తెలిపి భూసేకరణకు సహకరించాలి” అని హైకోర్టు తీర్పు వెలువరించింది.