మన సమాజంలో అన్యాయం లంచగొండి తనం క్యాన్సర్‌లా పెరిగిపోయిందనీ, దానిని తగ్గించడం అసాధ్యమనీ ప్రతీకాత్మకంగా వర్ణనలు చేసేవారు చేస్తూనే ఉన్నారు. ఈ వర్ణనలన్నీ pre modern thought కి ఊతమిచ్చేలా ”అసలు క్యాన్సర్ తగ్గదు. క్యాన్సర్ వస్తే తప్పనిసరిగా మరణమే గతి” అనే భావజాలాన్ని పలురకాలుగా సింబాలిక్‌గా ప్రజలు మెదళ్ళలోకి ఎక్కిస్తూనే ఉన్నాయి. సైంటిఫికల్‌గా ఇది పూర్తిగా అబద్ధం. ఐతే ఇంత సైన్స్ అభివద్ధి చెందినా ఎందుకు ఈ వర్ణనలు అలాగే ఉండిపోయాయి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మన మోడర్నిటీ మన హేతుబద్ధతలో మనం జబ్బును చూసే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో ఎలాంటి మార్పులూ తీసుకురాలేదా?. క్యాన్సర్ భూతమనీ, మహమ్మారి అనీ ఈరోజుకీ ఎందుకు వర్ణిస్తున్నాం?. ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ కాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..!
కరోనా మొదటి వేవ్ సమయంలో అప్పుడప్పుడే కరోనా తీవ్రత అర్థమౌతున్న తరుణంలో ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికలో మధ్య పేజీలో main article ఒకటి వచ్చింది. దానిని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాశారు. కరోనాను ‘మహమ్మారి’ అంటూ అది మత్యు ఘంటికలు మోగిస్తోందనీ, శవాల మీద కరాళ నత్యం చేసేస్తోందనీ ఆ వైరల్ జబ్బును అద్భుతమైన విశేషణాలతో కవితాత్మకంగా వర్ణించారు. పైగా ఇన్ని శవాలను చూస్తూ సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా స్మశాన వైరాగ్యం పొందినట్లుగా సామూహిక ఎలిజీలు రాసి ఆయన శోకోధతుడయ్యాడు. అది చదివి అప్పట్లో నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. సర్క్యులేషన్ అధికంగా ఉండే ఒక పేపర్‌ని చేతిలో పట్టుకుని ఒక మెడికల్ ఎమర్జెన్సీ కాలంలో దినపత్రికను ఒక అవేర్నెస్ కోసం, ఒక నమ్మకం కోసం, ఒక ప్రాగ్మాటిక్ టోన్‌తో కాకుండా శోకతప్త హదయాలను కవితాత్మకంగా చెప్పేందుకు చూపిన ఆ అత్యుత్సాహం ఔచిత్యం ఏంటో నాకేం అర్థం కాలేదు. ”Gravity of the situation” ని చెప్పేందుకు ఏమైనా అతిశయోక్తులు వాడారా అని చూశాను. అవీ కనబడలేదు. మన సమాజంలో నాటకీయతకు ఉండే మాస్ అప్పీల్‌ని ఉపయోగించుకుని మంచి రక్తి కట్టించే ఏకపాత్రాభినయానికి తగ్గ కంటెంట్ అలా ఊది పడేశారాయన. జబ్బులూ మరణాలు విధిరచితమనో, దేవుని/ అతీత శక్తి శాపమనో, కర్మఫలితమనో అనుకునే ఒక ప్రిమోడర్న్ ఆలోచనని ఈయన వదులుకోలేక పోవడం ఆ వ్యాసంలో స్పష్టంగా కనిపించింది. 3rd grade సెన్ససేషనలిజం తాలుకు వాసనలు వ్యాసంలో లేకున్నా ఇలాంటి సందర్భంలో వ్యక్తిగా తన బాధ్యతను, జర్నలిజం ఎథిక్స్‌ని తీసి పక్కకు పెట్టారా అనిపించింది. ఇలాంటి సమయాల్లో వార్తల్లో ”సెన్సేషనలిజం” అనేది నిజంగా ఆ జబ్బు బారినపడిన వారిని తప్పుదారి పట్టిస్తుంది.
సమాజంలో జబ్బుకి సంబంధించిన అనవసర భయాల్ని వందల రెట్లు పెంచుతుంది. అపోహలు కూడా అందుకు తగ్గట్టుగానే పుట్టుకువస్తాయి. ఇక పుకార్లకు కొదువే ఉండదు. దీన్నే మనం కరోనా సమయంలో మన సమాజంలో కళ్ళారా చూశాం. ఆ రకంగా ఆ మెడికల్ అత్యవసర సమయంలో వచ్చిన ఈ వ్యాసం కూడా జబ్బులకు సంబంధించిన ఒక పాపులర్ ప్రిమోడర్న్ పోయెటిక్ నరేటివే తప్ప అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అశేష ప్రజానీకానికి ఈరకమైన వ్యాసాలు చేసే ఉపకారం అంటూ ఏదీ ఉండదు. అసలు మన దేశంలో ఎంతటి చదువుకున్న వారికైనా ఈ ప్రీ మోడర్న్ థాట్ ప్రాసెస్‌ని వదులుకోవడం ఎంతో కష్టమైన విషయంగా ఉంటుందనిపిస్తుంది. ఈ థాట్ ఇక్కడి నేలలో ఇంకి ఉంటుంది. అంతేకాకుండా జగన్మిథ్యత్వం, జీవిత అశాశ్వత్వం ఈ నేల ఫిలాసఫీలో ముఖ్యమైన అర్కాటైపులు. సోషల్ మీడియా వచ్చాక తాము హాస్పిటల్‌లో జాయిన్ ఐన విషయం చివరికి వెంటిలేటర్ మీద ఉన్న విషయం కూడా ఫొటోలుగా పెట్టుకునే వారు ఉన్నారు. రొమాంటిక్ యుగంలో మహాకవి బైరన్ టీబీతో బాధపడుతున్నప్పుడు అతడి మిత్రుడు చూడటానికి వస్తాడు. అప్పుడు బైరన్ అద్దంలోకి చూసుకుంటూ ”నేను టీబీతో చచ్చిపోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆడవాళ్ళందరూ అయ్యో పాపం బైరన్ చూశావా! ఎంతలా పాలిపోయాడో! అతడు ఎలా చనిపోతాడో! అని నా మీద ఆసక్తి చూపడానికి ఉబలాటపడుతున్నారు” అని చమత్కరిస్తాడు. రొమాంటిక్ యుగపునాటి ఈ క్రూరత్వంలో ఉండే అలంకారాన్నీ మరణంలో ఉండే అందాన్నీ ఈ సోషల్ మీడియా కాలం కూడా ఒడిసిపట్టుకుందేమో అనిపించకమానదు.
ఐతే ఈ మధ్య కాలంలో చూస్తున్న ట్రెండ్ జబ్బులను ”వర్ణించడం”. కరోనా సమయంలో చూశాం. మహమ్మారి, రక్కసి, రాక్షసి వంటి విశేషణాలు జోడించి పేపర్లలో మీడియాలో కథనాలు ”విపరీతంగా” రావడం చూశాం. సినిమాల్లో దయ్యాలూ, మీడియాలో జబ్బులు దాదాపు అన్నీ స్త్రీ రూపాలే ఐవుండటం చూస్తుంటాం. అప్పట్లో ”కరోనా రాక్షసుడు” అని అనరెందుకు? ”రాక్షసి” అనే ఎందుకంటారు? అని కొందరు స్త్రీ వాదులు ప్రశ్నించారు కూడా. చాలా న్యాయమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిందే. ఐతే జబ్బుకు సంబంధించిన వర్ణనలు ఒక్క కరోనా విషయంలోనే కాకుండా డయాబెటిస్, గుండె పోటు, ఒబెసిటీ, క్యాన్సర్ వంటి జబ్బుల విషయంలో కూడా మన మీడియాలో విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని ‘భయంకరమైన జబ్బులు’ గా వర్ణించడం పెరిగింది. మత్యు ఘంటికలు, మరణ మదంగం, కరాళ నత్యం వంటి సంగీత పదాలు కూడా జబ్బులకు తగిలించి ”జబ్బు సంగీతం” వినిపించే పనిలో మీడియా తలమునకలై ఉంది. ఒకానొక కాలంలో disease అంటే ఏమిటో ఇంకా పూర్తిగా అర్థం కాని కాలంలో జబ్బు రావడాన్ని మరణంతో సమానంగా భావించేవారు. ఎందుకంటే సరైన ట్రీట్మెంట్ లేని ఆ కాలంలో ఏదైనా ఒక జబ్బు రావడం అంటే మరణంతో సమానంగా ఉండిన కాలం అది కాబట్టి. ఇప్పుడు మీడియాలో దాదాపు అటువంటి pre modern thoughts ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్నాయి. ఒక జబ్బును గురించి తెలపడం వేరు, ఆ జబ్బును వర్ణించడం వేరు. మొదటిది సైన్స్. రెండవది ఆర్ట్. వర్ణనకి భాషా పటిమ కావాలి. విశేషణాలు (adjectives)కావాలి. అతిశయోక్తులు కావాలి. ఐతే ఈ వర్ణనలు మీడియాకే పరిమితం కాలేదు. దురదష్టవశాత్తు మెడికల్ టెక్ట్స్ బుక్స్‌లో కూడా అక్కడక్కడా ఈ విశేషణాలు కనిపించడం కద్దు. Harrison text book of internal medicine లో మలేరియా జబ్బును గురించిన అధ్యాయంలో భయంకరమైన / dangerous అనే పదం ఉంది. ఒక మెడికల్ text book లో ఈ పద విశేషణం అవసరం ఏంటి?. ఇప్పటికి పదిలక్షల కాపీలు అమ్ముడుపోయిన ఒక్క హారిసన్ టెక్స్ట్ బుక్‌లోనే కాదు తరచి చూస్తే మరిన్ని లీడింగ్ మెడికల్ టెక్ట్స్ బుక్స్‌లో ఈ విశేషణాలతో కూడిన జబ్బు వర్ణనలు దొరకవచ్చు. Severe, grave, critical, advanced, malignant, fulminant, debilitating, life – thratening, dangerous వంటి పదాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి ఇంగ్లీష్ భాషా విశేషణాలను మెడికల్ పదాలుగా మార్చవచ్చు. ఉదాహరణకు severe అనే పదానికి బదులు high risk అనే పదం వాడవచ్చు. You have ‘severe inflammation’ అనే బదులు you have ‘significant inflammation’ that requires close attention అని అనవచ్చు. రాయవచ్చు. కానీ ఇప్పటికీ ఇవే విశేషణాలతో కూడిన పదాలు వాడబడుతున్నాయి. అంతే కాకుండా చాలా జబ్బుల వర్ణనలకు war terminology ని వాడుతుంటారు మెడికల్ టెక్ట్స్ బుక్స్‌లో కూడాHeart attack, Bacterial invasion, Immune defence mechanism, resistant strains, combating drugs, eradication, battle against cancer , targetting cancer cells, colonization, cancer encroachment of adjacent tissues వంటి పదాలు పదబంధాలు విస్తతంగా వాడబడుతున్నాయి. ఇటువంటి యుద్ధ సంబంధ పదాలు మెడికల్ టెర్మినాలజీలో ఎందుకొచ్చాయో తెలియదు. కానీ జబ్బులు వచ్చినవారి సైకాలజీ మీద చాలా తీవ్రంగా ఈ పదాలు ప్రభావాన్ని చూపుతుంటాయి. తమ వాళ్ళు జబ్బుతో యుద్ధం చేయలేక పోయారనీ, చివరికి ఓడిపోయారనీ ఎలిజీలలో వర్ణించేవారు ఉంటారు. కొందరు డాక్టర్లు కూడా తమ పేషంట్లతో మాట్లాడేటపుడు కూడా ఇలాంటి విశేషణాలు వాడుతూ ఉంటారు. జబ్బులపై అవగాహన లేని సామాన్య ప్రజలు ఆ విశేషణాలతో కూడిన వర్ణనలు విని జడుసుకోవడం చూస్తుంటాం. కొందరు సూడో మెడికల్ మేధావులు జబ్బులను వాటి లక్షణాలను విపరీత విశేషణాలతో వర్ణిస్తూ ప్రజలను విపరీతంగా భయపెడుతుంటారు. జబ్బులనూ ట్రీట్మెంట్ లోనూ వర్ణనలతో భయపెట్టడం చాలా పెద్ద రాబడి మార్గంగా మారిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ”కాన్సర్ కంటే కాన్సర్ ట్రీట్మెంట్ భయంకరమైనది” అనే వర్ణన అలాంటిదే. ఒకసారి సరిగ్గా ఆలోచిస్తే నిజంగా కాన్సర్ పేషెంట్ పై ఇటువంటి వర్ణన ఎంత నష్టాన్ని కలగజేస్తుందో అనిపిస్తుంది.
1881 లో రాబర్ట్ కోచ్ Tubercle bacillus అనే బ్యాక్టీరియానే టీబీకి కారణం అని కనుగొనంత వరకూ స్టాండర్డ్ మెడికల్ టెక్ట్స్ బుక్స్ ఈ జబ్బు హెరెడిటరీ అని, విషపురితమైన వాతావరణంలో వస్తుందనీ, ఇంట్లోనే కదలకుండా sedentary lifestyle ఉంటే వస్తుందనీ, గాలి వెలుతురు సరిగ్గా లేని గదుల్లో వస్తుందని, last but not least వ్యక్తి డిప్రెసివ్ ఎమోషన్స్ కలిగి ఉంటే వస్తుందని వర్ణించాయి. రాబర్ట్‌కోచ్ పరిశోధన ఫలితాలు మెడికల్ టెక్ట్స్ బుక్స్‌లో ఎప్పటికీ వచ్చి చేరాయో తెలియదు కానీ, ఈ విధంగా వ్యక్తి మానసిక పరిస్థితే టీబీ జబ్బుకు కారణంగా చెప్పడం తర్వాత చాలా కాలంపాటు కొనసాగింది. ఎందుకంటే మోడెర్న్ మెడికల్ నాలెడ్జ్ ప్రభావం కంటే ఆ కాలపు మేధావుల మీద రొమాంటిక్ యుగపు ధోరణుల, విలువల ప్రభావం ఎక్కువ. రొమాంటిక్ యుగంలో ఉన్న ఒక ప్రముఖమైన భావన ఏంటంటే- వ్యక్తి ప్రవర్తనయే జబ్బును కలిగిస్తుందని. అందుకే జబ్బు ఆ వ్యక్తి ప్రవర్తనకు బాహ్య రూపమని. ప్లేగు వ్యాధిని అప్పట్లో pestilence అనేవారు. ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీ ప్రకారం pestilence అంటే ”మతానికి ప్రమాదకరమైన” అనేది అర్థం. మత – నీతి బాహ్యమైన వ్యక్తులకు ప్లేగు వస్తుందనేది అప్పటి వారి అవగాహన.
ఐతే ఆధునిక యుగానికి కాఫ్కా తనకు 1917లో టీబి జబ్బు నిర్ధారణ జరిగాక అతడు ఏమన్నాడో చూడండి ”I donµt believe this illness to be tuberculosis but rather a sign of my general bankruptcy” అని. ముఖ్యంగా ఫ్రాయిడ్ వచ్చి unconscious mind ని వివరించాక, మనుషులలో unconscious mindలో దాగివున్న లేదా అణచివేయబడి ఉన్న భావోద్వేగాలే ఆ తర్వాత మానసిక జబ్బులకు దారి తీస్తాయని అతడు వివరించాక, దానిని శరీరంపైకి కూడా project చేయడం పెరిగింది. మనసులోని అంశాలు శరీరం మీద ప్రభావం కలిగిస్తాయనే స్పహ వచ్చింది. ఐతే అది అంతకుముందు నుండే పాతుకుని ఉండిన ”పాపాత్ములకే జబ్బులు వస్తాయి” అనే మత పరమైన వివరణకు ఊతమిచ్చినట్టుగా తయారైంది. అందుకే మోడెర్న్ రైటర్ ఐన కాఫ్కాలో ఆ రొమాంటిక్ యుగపు వాసనలు కనిపిస్తాయి. టీబి జబ్బు రావడానికి ఇదమిత్థమైన కారణం తెలిసాక, ఇదమిత్థమైన చికిత్సా విధానం వచ్చాక ఈ విధమైన మానసిక స్థితి వలననే టీబీ వస్తుందనే వర్ణన క్రమంగా తగ్గింది. కానీ అది ప్రస్తుత కాలంలో టీబీ నుండి కాన్సర్‌కి బదిలీ అయింది. ఇపుడు కాన్సర్ విషయంలో ఈ వర్ణనలు మళ్ళీ మొదలయ్యాయి. ఏ జబ్బుకైతే వ్యాధి కారకాలు ఎక్కువగా ఉంటాయో (multifactorial), ఇదమిత్థమైన ఏక కారణం ఇదే అని ఎస్టాబ్లిష్ కాలేదో, ఆ జబ్బు చుట్టూ ఊహాగానాలు ఎక్కువగా చెలరేగడమే కాకుండా అవన్నీ దాదాపుగా ”ఆ వ్యక్తి ప్రవర్తనే కారణం” అనేలాగా moral point of disease causation వైపు వెళుతూ victim blaming ని పెంచుతుంటాయి. విపరీతమైన కోరికలు కలిగి ఉండటమే జబ్బులకు కారణం అని pre modern society అవగాహన. Well balanced ప్రవర్తన ఆ సమాజపు ఐడియల్.
తత్వవేత్త ఇమాన్యువల్ కాంట్ అసలు ఈ విపరీతమైన కోరికలనే క్యాన్సర్ అన్నాడు. “Passions are cancers for pure practical reason and often incurable. The passions are unfortunate moods that are pregnant with many evils” (Kant – Anthropologic 1798)అని కోరికలను క్యాన్సర్‌తో పోల్చాడు. పైగా కోరికలు అన్ని రకాల కష్టాలను పుట్టిస్తాయని గర్భంతో లింక్ చేశాడు. ఇప్పటికి కూడా జబ్బులను బూచిగా భయంకరమైన విధంగా చూపడంలో TV మీడియా వాడే పదాలు, ఆ వర్ణనలప్పుడు వచ్చే background music ఇవన్నీ ఎందుకు?. జబ్బుల విషయంలో ప్రజలను భయపెట్టడంలో ఉండే శాడిస్టిక్ ఆనందానికి గల ముఖ్య కారణం ఏమిటి?. సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటిల్లో స్త్రీల లైంగిక కోరికలకు సంబంధించిన అంశాన్ని చేర్చి క్యాన్సర్ రావడానికి ఆయా వ్యక్తుల ప్రవర్తననే ముఖ్య కారణం చేసేస్తున్నారు. కొందరు బాహాటంగా చెబుతున్నారు. గమనించి చూస్తే సైన్స్ అభివద్ధి చెందని కాలంలో ఉండిన ప్రీ మోడర్న్ థాట్ అయినా ఈనాటి మోడర్న్ థాట్ అయినా క్యాన్సర్ కారణాలను కనుగొంటూ చివరికి victim blaming దగ్గరికి వచ్చేస్తున్నాయనేది నిర్వివాదాంశం. ఈ ధోరణి మారకపోతే మనం ఆబ్జెక్టివ్‌గా సైంటిఫిక్‌గా ఏమాత్రం అభివద్ధి చెందనట్టుగా రూఢ చేసుకోవాలి. సామాజిక ఆలోచనలో తప్పక మార్పు రావాలి. జబ్బులను జబ్బులుగా వివరించాలి. వర్ణనలు ఆపాలి. ఇప్పుడున్న మెడికల్ విద్యార్థులకు సైన్స్ జ్ఞానం అందుతున్న ధోరణిలోనే, అంటే సైంటిఫిక్ జ్ఞాన సిద్ధాంతంలోనే కొంత అవకతవకలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ Epistemological issues.
ముఖ్యంగా ఈ ధోరణి 1990ర నుండి మొదలైంది. 1960, 70 లలో ఒక క్యాన్సర్ జబ్బు రావడానికి geographical & environmental factors కారణమై ఉంటాయని ఆ రంగాల్లో పరిశోధనలు జరిగేవి. వివిధ రకాలైన carcinogens ఏ విధంగా మానవునికి హానికారకాలో ఎలాంటి ఇండిస్టియల్ వాతావరణం ఎలాంటి క్యాన్సర్‌ని కలగజేస్తుందో పరిశోధనలు జరిగేవి. కానీ 90s లో గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ జరిగాక ఈ పరిశోధనల రూపం మారిపోయింది. కొత్తగా వచ్చిన టెక్నాలజీ, మాలిక్యులార్ బయాలజీ వైపు పరిశోధనలు జరిగేలా చేసింది. పరిశోధనల్లో టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహించింది. చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో నడిచే ఖరీదైన మెషీన్లు రావడం, తద్వారా ఖరీదైన పరిశోధనలు విపరీతంగా జరగడం మొదలైంది. ఈ రెండు దశాబ్దాలలో మెడికల్ /సైంటిఫిక్ జర్నల్స్ లో మాలిక్యులార్ బయాలజీ & జెనెటిక్స్ మీద వచ్చిన పరిశోధనల పబ్లికేషన్స్ 500 శాతం పెరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకరకంగా జీవితమే మాలిక్యులరైజేషన్ చేయబడింది. ఈ పరిశోధనలు కణంలో, కణ కేంద్రకంలో DNA, RNA లలో జీన్స్‌లో వచ్చే మార్పులను పసిగట్టే పనిలో పడ్డాయి. దానితో తక్కువ మోతాదు టెక్నాలజీ అవసరమయ్యే పరిశోధనలు మూలన పడ్డాయి ఈ మాలిక్యులార్ లెవెల్ కారకాలకే పట్టంకట్టి క్యాన్సర్ కి అవే కారణాలుగా చెప్పడం మొదలైంది. 2013 లో ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ ఆంజెలీనా జోలీ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుని, తన కణాల్లో BRCA1 జీన్ మ్యుటేషన్ జరిగిందని తనకు రాబోయే భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు breast cancer వచ్చేస్తుందనీ భావించి ముందుగానే preventive గా ఆపరేషన్ ద్వారా తన రొమ్ములు తొలగించుకుంది (preventive double mastectomy) అంటే జీవితం ఎంతగా molecularization జరిగిందో ఆలోచించకతప్పదు. BRCA1 gene mutation ఉన్నంత మాత్రాన తప్పని సరిగా క్యాన్సర్ వచ్చేస్తుంది అని కాదు. జaఅషవతీ Cancer susceptibility పెరుగుతుంది. అంటే వచ్చే ఛాన్స్ మామూలుగా కంటే కొంత పెరుగుతుంది. ఐతే అలా ఉన్నప్పుడు mammogram వంటి టెస్ట్‌లను రెగ్యులర్‌గా చేసుకోండి అని మాత్రమే సైన్స్ చెబుతుంది తప్ప ఈ జీన్ మ్యుటేషన్ ఉంటే రొమ్ములు తొలగించుకోవాలని చెప్పదు. అందుకు ఆధారాలు లేవు. ఐతే ఆంజలీనా జోలీ తన పర్సనల్ ఛాయిస్‌గా రొమ్ములను తొలగించుకోవడాన్ని మాత్రం మన సమాజం క్యాన్సర్‌పై కలిగించిన విపరీత విశేషాలతో కూడిన భయాలే కారణం. ఆధునిక మాలిక్యులార్ బయాలజీ పరిశోధనలు తప్పని కాదు కానీ అవి అసలు కారకాలైన social determinants of cancer ని పూర్తిగా మరుగున పడవేశాయి. ఈ social determinants of cancer పై పరిశోధనలు దాదాపు సున్నాకు చేరుకున్నాయి. మూగబోయాయి. తమ వాయిస్‌ని వినిపించడం ఆపేశాయి. ఇపుడు ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్‌ని అడిగినా కాన్సర్ కారణాలు ఏవి అంటే మనిషి ప్రవర్తనకు అతడి జీవిత విధానానికి సంబంధించిన సమాధానాలు చెబుతారు. ఒబెసిటీ కారణమని, అతిగా పలానా ఆహారం తినడంవలననే అనీ, ప్రతిరోజూ ఎక్సర్సైజు చేయక పోవడమేననీ, మల్టిపుల్ సెక్స్ పార్టనర్ల ఉండటం వలననే అనీ etc. గమనించి చూస్తే ఈ etiology మొత్తం పేషెంట్ బంధువులు చేస్తున్నట్టే పేషెంట్ వైపే తమ వేళ్ళని చూపిస్తాయి. ఒకవ్యక్తికి కాన్సర్ రావడానికి అతడి ప్రవర్తన, అతడి తిండి, అతడి జీవిత విధానమే కారణమనేంతగా రిడక్షన్ చేయబడుతుంది. ఈ కారణాల వలనే అతడి జన్యువులలో మార్పు వచ్చిందనో మ్యుటేషన్ జరిగిందనో వైరస్ లోడ్ పెరిగిందనో చెప్పడం మొదలైంది. ఈ మధ్య పెరుగుతున్న కాన్సర్ జబ్బులు విషయంలోకి ఇటువంటి మోరల్, victim blaming అంశాలు విపరీతంగా వచ్చి చేరాయి. క్యాన్సర్లు పెరగడానికి ప్లాస్టిక్ బ్యాగ్ లలో ఆహారం తినడమే కారణమని ఒకాయన చెబుతాడు. కానీ ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ కల్చర్ ఎలా వచ్చింది. ఎవరు తెచ్చారు అనేది ఎవరూ చెప్పరు. పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం తిని కాన్సర్ తెచ్చుకుంటున్నారు అని మరో పెద్దమనిషి చెబుతాడు. కానీ ఏ వాణిజ్య పంటల వ్యవసాయ పద్ధతులకోసం ఎక్కువ ఎరువులు వాడాల్సి రావడం జరిగిందో, ఈ వాణిజ్య పంటల చుట్టూనే దేశ రాజకీయాలు అల్లుకుని సాగుతున్నాయో ఎవరూ చెప్పరు. హైదరాబాద్‌లో రోజురోజుకూ క్యాన్సర్లు పెరుగుతున్నాయని ఒకాయన వాపోతాడు. కానీ హైదరాబాద్‌లో industrial development జరిగిన పద్ధతి, industrial wastes ని డిస్కార్డ్ చేసే పద్ధతులు ఎలా ఉన్నాయో ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో ఎవరికీ పట్టట్లేదు. అభివద్ధికి పర్యాయపదంగా వేల కోట్ల పెట్టుబడులు పెట్టబడుతున్న చోట, క్యాన్సర్ కారణాలు ఇవే అని చెప్పాల్సిన చోట గంభీరమైన మౌనం అలముకొని ఉంది. మానవాభివద్ధి అనే పదం విపరీతంగా exploitation కి గురైంది. అసలు వీటిపై సామాజిక పరిశోధనలు కూడా మనదేశంలో దాదాపు శూన్యం. ఈ కాలం అమ్మాయిలు ఎక్కువ మందితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వలననే క్యాన్సర్ బారిన పడుతున్నారని ఒకావిడ ఇంటర్వూ ఇస్తుంది. కానీ డబ్బు చుట్టూ పరిగిత్తే వేగవంతమైన జీవితాల్లో pulverize అవుతున్న కుటుంబాలు, విపరీతమైన ఫ్రిక్షన్‌కి గురౌతున్న మానవ సంబంధాలు అసలు కారణమని ఎవరూ చెప్పడంలేదు. క్యాన్సర్ కారకాలుగా మనిషి కణంలో జరిగే సూక్ష్మ ప్రక్రియలలో లోటుపాట్లు అని గుర్తించడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. సందేహమూ లేదు. కానీ ఈ లోటుపాట్లు సమాజంలోకి ఏ కారణం చేత వచ్చాయో ఎవరు వివరిస్తున్నారు. క్యాన్సర్ వచ్చిన వ్యక్తిని ఎన్ని రకాలుగా అనుమానపు దక్కులతో ఈ సమాజం చూస్తుంటుందో వారిని ఎంతలా స్వీయ వ్యతిరేకతకు లోనుచేసి మానసికంగా కంగదీస్తుందో ఎవరూ మాట్లాడరు. ఎందుకని?. నెపాన్ని చివరకు పేషెంట్ మీదనే పెట్టడం వలన అది పేషెంట్ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా అతడిని క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటేనే భయపడి దూరం జరిగే పరిస్థితిని తీసుకువస్తుంది. Cancer causing personality అనే దానిని ఒకటి తయారు చేసి, ఎవరికి క్యాన్సర్ వచ్చినా పేషెంట్‌కి ఉన్న ఈ పర్సనాలిటీనే కారణం అనే దశకు చేరుకున్నాం. ఈ ప్రాసెస్‌లో భాగంగా ట్రీట్మెంట్ పై నమ్మకం ఉంటే కాన్సర్ తగ్గుతుందని చెప్పేవారూ మొదలయ్యారు. నమ్మకం ఉంటే, పాజిటివ్ దక్పథం ఉంటే, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందనీ క్యాన్సర్‌ని జయించే (మళ్ళీ యుద్ధానికి చెందిన పదం) శక్తి వస్తుందని చెబుతున్నారు. ఇవన్నీ మళ్ళీ emotions are the reason for disease ని తెలివిగా డైవర్ట్ చేసి emotions are the reason for successful treatment అనే భావనను తెచ్చేవే. ఇది కూడా మనలో పెరిగిపోయిన, పాతుకుపోయిన pre modern thought గా అర్థం చేసుకోవాలి. జబ్బులు రావడానికి భావోద్వేగాలే కారణం అన్న ప్రి సైన్స్ యుగం నుండి సైంటిఫిక్ యుగంలోకి వచ్చిన మనం ఈ రోజు జబ్బు తగ్గడానికి వ్యక్తి will power కారణం అంటున్నామంటే మనం మానవ శారీరక ధర్మ శాస్త్రాన్ని ఏమాత్రం సైంటిఫిక్‌గా అర్థం చేసుకోలేదని అర్థం. ఈ ధోరణులు డాక్టర్లలో కూడా కాన్సర్ ట్రీట్మెంట్‌ల పట్ల pessimism ని పెంచేలా చేస్తాయి. కాన్సర్ వచ్చేసరికి ఆ పేషెంట్లు అప్పటికే కాన్సర్ గురించిన సకల భయంకరమైన వర్ణనలూ వినేసి ఉంటారు. అది మరణానికి దారి తీస్తుందని కుంగిపోతుంటారు. అందుకే క్యాన్సర్‌కి సంబంధించిన, ఒక రకంగా జబ్బులకు సంబంధించిన పదాలు మంచి వైపు పరిణామం చెందాలి. వర్ణనలు ఆగాలి. పాత వర్ణనలను తుడిచి పెట్టాలి. ఇది ఒక సమాజంగా కలిసి కూడబలుక్కుని చేస్తే గానీ సాధ్యంకాదు. Informed decision making వ్యక్తులను ఎంపవర్ చేస్తుంది. కానీ జబ్బుల కవితాత్మక రొమాంటిక్ వర్ణనలు, రచయితల అతిశయోక్తి అత్యుత్సాహాలు, మీడియా సెన్సేషనలిజాలు ప్రజలను తప్పు దారి పట్టిస్తాయి. కాబట్టి క్యాన్సర్ పై యుద్ధాలను ఆపి అటువంటి పదాలను వాడటం ఆపి ఈ అతిశయోక్తి అలంకారపు వర్ణనలపై మూకుమ్మడిగా దాడి చేయాలి. వాటిని మన మెదడు డిక్షనరీలో సంపూర్ణంగా విలుప్తం చేయాలి.