ప్రతి సంవత్సరం క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి

ప్రతి సంవత్సరం క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి– డీప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ టి. దామోదర్‌
నవతెలంగాణ-శంకర్‌పల్లి
జీవన శైలిలో మార్పులు చేసుకుని ప్రతి సంవత్సరం తప్పనిసరిగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ టి. దామోదర్‌ అన్నారు. మంగళవారం ఇండియన్‌ కాన్సర్‌ సొసైటీ ఆధ్వర్యంలో శంకర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం క్యాన్సర్‌ పరీక్షలు చేసుకోవాలన్నారు. ధూమపానం,గుట్కాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వం, క్యాన్సర్‌ సొసైటీలు కలసి క్యాన్సర్‌ క్యాంపులు నిర్వహిస్తాయన్నారు. ఈ క్యాంపులో 135 మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఇందులో నోటి క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నవారు ఐదుగురు, సర్విక్స్‌ క్యాన్సర్‌ లక్షణాలు ఉన్న 21 మందిని గుర్తించినట్టు తెలిపారు. రొమ్ము లక్షణాలు ఉన్నవారు ఒక్కరికీ ఉన్నట్టు గుర్తించి, వారిని క్యాన్సర్‌ ఆస్పత్రికి హైదరాబాద్‌ రిఫర్‌ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీడీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ రాకేష్‌, వైద్యాధికారులు రేవతి, శ్రీనివాస్‌, సీహెచ్‌వో సంతోష్‌, ఎమ్మెల్‌ హెచ్‌పీ డాక్టర్లు అనూష, ప్రియాసింగ్‌, రఘు, శోభా, ప్రశాంతి, వైద్య సిబ్బంది మహమ్మద్‌ మన్సూర్‌ అలీ, సుదర్శన్‌ రెడ్డి, పీతాంబర్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.