కంచం పొత్తే కానీ మంచం పొత్తు కాదు

Cancham pothu but not couch pothuజానపదులు సామెతలను ఎట్ల పొందిచ్చిండ్రో కానీ యతిప్రాసలు కల్సి ఎప్పటికీ గుర్తుకు వచ్చేట్టు వుంటయి. మళ్లీ చిన్న వాక్యంలోనే తత్వం కూడా ఇమిడి వుంటది. అందుకే ఇవి అన్ని కాలాల్ల పాపులర్‌ అయితన్నయి. వాల్లకు ‘కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు’ అంటరు. అంటే వాల్లు ఒకల ఇంట్ల ఒగలు తినవచ్చు గానీ పిల్లను ఇచ్చుడు పిలగాన్ని చేసికునుడు వుండదని అర్ధం. మంచం పొత్తు అంటే అర్ధం అయింది గదా అదే. వర్ణ వ్యవస్థలోని అన్ని కులాలకు ఏ లెక్క దానికే వుంటది. ఒక కులం మీద మరో కులం, మరింత మీద కొన్ని కులాలు, కిందికి మరింత కిందికి కొన్ని వుంటయి. అట్లాంటి వర్ణాలలో కంచం పొత్తు వుంటది. మరికొన్ని కులాల మధ్య ఆ ఇంత కూడా వుండది. కొందరు ఎవల ఇంట్లో తినరు. అసొంటోల్లకు బియ్యం ఇస్తరు. పొత్తుల పంచాయితీ ఇట్ల వుండగా ఇద్దరు కల్సి పొత్తుల ఎవుసం చేసినా, ఏదైనా వ్యాపారం చేసుకున్నా ఎప్పుడో ఒకనాడు విడిపోవుడే వుంటది. సాధారణంగా అందరికీ వరుగులు కలవయి. అందుకే ‘పొత్తు పెట్టుకంటే పిత్తుక సచ్చుడే’ అన్న సామెత పుట్టింది. అంటే అంత చెప్పరాని అవస్థ వుంటది. సంసారాలు కూడా అంతే. ఉమ్మడి కుటుంబాలు కాకుండా విడివిడిగా వుంటేనే ఎవల ఫ్యామిలీ వాల్లకు ఆనందం. లేకుంటే నియంతృత్వం పెరుగుతది. అసొంటి లొల్లులు అయినప్పుడు ‘పొత్తుల సంసారం ఇచ్చుక పోవుడే’ అంటరు. ఎన్నటికైనా పొయ్యి కుండలు వేరు కావల్సిందే. పొత్తు అంటే స్వతంత్రత వుండది. అందుకే ఇయ్యాల రేపు పోరగాండ్ల పెండ్లి చెయ్యంగనే ఏరుపోస్తండ్రు. ఎక్కడోల్లు అక్కడ ఉండాలె. పండుగలకు, పబ్బాలకు మంచికీ చెడుకు ఒక్క దగ్గరికి రావాలె. అదే నడుస్తంది. ఇంకో సామెత కూడా గుర్తుకు వస్తది. అది ‘పొత్తుల మొగడు పుచ్చి సచ్చినట్లు’ అంటరు. కొందరి ఇద్దరు భార్యలు వుంటరు. వాళ్లిద్దరికి భర్త కాబట్టి ఎవల అవసరాలు, బాధలు ఒత్తిడిలు వాల్లకు ఉంటయి. మరి ఆ మొగడు పుచ్చిపోవలసిందే.
– అన్నవరం దేవేందర్‌, 9440763479